జగన్ కోసం జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం జనం

జగన్ కోసం జనం

Written By news on Wednesday, September 25, 2013 | 9/25/2013

చంచల్‌గూడ జైలు నుంచి లోటస్‌పాండ్ వరకు పోటెత్తిన జన సునామీ
 
మంగళవారం సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు.  ఆ వెంటనే ‘వచ్చాడదిగో పులివెందుల పులి బిడ్డ’ అంటూ అభిమానులు  పెద్దపెట్టున నినాదాలు చేశారు... పావురాలను పైకి ఎగురవేశారు.
 
సాక్షి, హైదరాబాద్:  రాజధానిలో దారులన్నీ మంగళవారం చంచల్‌గూడ వైపే మళ్లాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో మలక్‌పేట్, చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, డబీర్‌పురా పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మంగళవారం విడుదలవుతారని తెలియడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ మధ్యకు తిరిగి వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు చంచల్‌గూడ జైలు ముందు ఉదయం 8 గంటల నుంచే జనం భారీ సంఖ్యలో బారులు తీరారు.

చూస్తుండగానే 11 గంటలకల్లా జైలు ఎదురుగా ఉండే ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానుల తాకిడి పెరిగే కొద్దీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జైలు ప్రాంగణంలోకి ఎవరినీ రానీయకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాహనాలను జైలు ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా అనుమతించకపోవడంతో వారంతా జైలు దాకా నడిచే వచ్చారు. తమ నాయకుడు ఎప్పుడెప్పుడు బయటికొస్తాడా, ఎప్పుడు ఆయనతో కరచాలనం చేస్తామా అనే ఆరాటం అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎండ నిప్పులు చెరుగుతున్నా ఎవరూ అంగుళమైనా కదల్లేదు. తిండి, నీరూ కూడా పట్టించుకోకుండా జైలు గేటు వైపే దృష్టి నిలిపి నిలబడ్డారు. అక్కడ ఏ చిన్న అలజడి రేగినా జగనేవస్తున్నారంటూ కేరింతలు కొట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత జగన్ మాస్కులు ధరించి సందడి చేశారు. కాసేపు తొక్కిసలాట కూడా జరిగింది.

జగన్ వచ్చిన వేళ...
అసంఖ్యాక అభిమాన జనం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. లోపలి నుంచి జైలు ప్రధాన ద్వారం దాకా జగన్‌ను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఎత్తుకుని తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు జైలు గేటు వద్ద గుమ్మడికాయతో ఆయనకు దిష్టి తీశారు. జగన్ బయటికి రాగానే దిక్కులు పిక్కటిల్లేలా జయజయ ధ్వానాలు చేశారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. ప్రవాహంలా ఆయన వైపు తోసుకెళ్లారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జగన్‌కు, జైలు గేటు నుంచి ఎదురుగా నిలిపిన వాహనం వరకు చేరుకోవడం కూడా గగనంగా మారింది.

అభిమానులందరికీ జగన్ రెండు చేతులూ జోడించి ఆప్యాయంగా అభివాదం చేశారు. వాహనం ఫుట్‌బోర్డుపై నుంచుని చుట్టూ చూస్తూ చేతులూపారు. చిరునవ్వుతో అందరినీ పలకరించారు. ఎట్టకేలకు భారీ పోలీసు భద్రత నడుమ జగన్ కాన్వాయ్ చంచల్‌గూడ నుంచి ముందుకు సాగింది. అడుగడుగునా అభిమాన జనం జగన్‌కు నీరాజనం పట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా వాహనాల పెకైక్కి కూర్చుని మరీ ప్రయాణించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు దారిపొడవునా పోటీలు పడడం విశేషం.

చంచల్‌గూడ నుంచి నల్లగొండ క్రాస్‌రోడ్స్, చాదర్‌ఘాట్, మొజాం జాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డెక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిలింనగర్ రోడ్డు దాకా అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అన్నిచోట్లా ఆగుతూ, అతి నెమ్మదిగా సాగుతూ ఐదున్నర గంటల అనంతరం జగన్ ఎట్టకేలకు రాత్రి 9.30 గంటలకు లోటస్‌పాండ్ నివాసానికి చేరుకున్నారు.

చంచల్‌గూడ-చాదర్‌ఘాట్
చంచల్‌గూడ జైలు నుంచి చాదర్‌ఘాట్ దాకా అభిమానులు అసంఖ్యాకంగా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. జగన్ కాన్వాయ్‌పై అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ‘పులివెందుల పులిబిడ్డ’, ‘ఏపీ కా షేర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఛావ్‌ణీ చౌరస్తాలో కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం కళాకారులు ఆటపాటలతో అలరించారు. మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఎటు చూసినా జన సందోహమే నెలకొంది.

మార్కెట్ నుంచి బేగంబజార్, అఫ్జల్‌గంజ్ రోడ్లపైకి అభిమానులు భారీగా తరలివచ్చారు. మార్కెటింగ్ మంత్రి ముకేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుపై పూలు, పండ్ల వ్యాపారులు, స్థానికులు టపాకాయలు కాల్చారు. జగన్‌ను పూలమాలలతో సత్కరించారు. జగన్ వాహనం నుంచి దిగి అందరికీ అభివాదం చేశారు. ఆయనతో కరచాలనానికి అంతా పోటీ పడ్డారు. కాన్వాయ్ గాంధీభవన్ సమీపానికి చేరుకోగానే గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో స్వాగతం పలికారు.

లక్డీకాపూల్ చౌరస్తాలో లంబాడాల నృత్యాలు
వైఎస్సార్‌సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచే పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో లక్డీకాపూల్ బస్టాప్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై లంబాడా మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం 6.10 నిమిషాలకు అక్కడికి చేరుకున్న జగన్ కారు నుంచి అభిమానులకు అభివాదం చేశారు. విజయారెడ్డి మహిళలతో కలిసి జగన్‌కు హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. లక్డీకాపూల్ పాత ఫ్లైఓవర్ మీదుగా భారీ ర్యాలీగా సాయంత్రం 6.45 గంటలకు జగన్ ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు.

పంజాగుట్ట చౌరస్తాలో కోలాహలం
జగన్ పంజాగుట్ట చౌరస్తాకు వస్తున్నారన్న సమాచారంతో సాయంత్రం 4 నుంచే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడి వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో అభిమానులు బ్యాండుమేళాలతో నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకూ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  ఫ్లై ఓవర్ బ్రిడ్జిమీదనుంచి తమ ప్రియతమ నేతను చూడవచ్చని వారంతా భావించారు. చివరికి జగన్ అక్కడికి రావడం లేదని తెలిసి వారంతా నిరాశ చెందారు. చెన్నారెడ్డి విగ్రహం మీదుగా కాన్వాయ్ ముందుకుసాగడంతో అభిమానులు కాన్వాయ్‌ను అనుసరించారు. నాగార్జున సర్కిల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌పైనుంచి అభిమానులు కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు.

మొరాయించిన స్కార్పియో
నాగార్జున సర్కిల్ నుంచి కొద్దిగా ముందుకెళ్లగానే పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద జగన్ బులెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం మొరాయించింది. దాంతో ఆయన మరో స్కార్పియోలోకి మారారు. టీవీ9, హెరిటేజ్ సంస్థల ముందు నుంచి కాన్వాయ్ వెళ్లినపుడు ఆయా సంస్థల ఉద్యోగులు కేరింతలు కొడుతూ జగన్‌కు అభివాదం చేయడం కనిపించింది. నాగార్జున సర్కిల్ నుంచి లోటస్‌పాండ్ వరకు మార్గమధ్యంలోని దుకాణాల నిర్వాహకులు జగన్ రాక కోసం ఆసక్తిగా నిరీక్షించారు. దుకాణాల బయటకు వచ్చి అభివాదం చేశారు. కేబీఆర్ పార్క్ చౌరస్తాలో వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని జగన్ కాన్వాయ్‌కి ఘన స్వాగతం పలికారు.

అనంతరం జూబ్లీహిల్స్ చౌరస్తా కూడా జనసంద్రంగా మారింది. సరిగ్గా 9.30 గంటలకు జగన్ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానుల పూలవర్షం , మహిళల నృత్యాలు, యువకుల కేరింతల నడుమ జై జగన్ నినాదాలు మిన్నంటాయి. జగన్‌కు బాల్కనీ నుంచి కుటుంబ సభ్యులు అభివాదం చేశారు.

జైలు వద్దకు వచ్చిన నాయకులు...
ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్లబాబూరావు, బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, టి. బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేకాశేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మాజీఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వై.బాలనాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జోగిరమేష్, కొడాలినాని, పేర్నినాని, గొట్టిపాటి రవికుమార్, మద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సామినేని ఉదయభాను లతో పాటు ఇతర నేతలు హెచ్‌ఏ రెహ్మాన్, కొల్లి నిర్మల, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తాప్రతాప్‌రెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, కాలేరు వెంకటేష్, దేప భాస్కర్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, కొండా రాఘవరెడ్డి, కె.సురేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి తదితర నాయకులున్నారు. అలాగే బంధువులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప మాజీ మేయర్ పి.రవీంధ్రనాథ్‌రెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, బంధువు యశ్వంత్‌రెడ్డి తదితరులు మధ్యాహ్నమే జైలు వద్దకు చేరుకున్నారు.
 
పోలీసులు ఊహించనంతగా..
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదల సందర్భంగా పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు తల్లకిందులయ్యాయి. నిఘా సంస్థల ఊహకు కూడా అందని రీతిలో అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకోవటంతో భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. జగన్‌ను స్వాగతించేందుకు వందల సంఖ్యలో జనం వస్తారని ఉన్నతాధికారులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక కంపెనీ బీఎస్‌ఎఫ్, మూడు ప్లాటూన్ల ఏపీఎస్‌పీ బలగాలు, దక్షిణ మండలం పరిధిలోని 10 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 90 మంది కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు తూర్పు, దక్షిణ మండలాలకు చెందిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో డీసీపీ తరుణ్‌జోషి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

అయితే ఉదయం 8 గంటల నుంచే జనం పెద్ద సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికేందుకు జైలు వద్దకు వచ్చారు. జన ప్రవాహం చూస్తుండగానే అంతకంతకూ పెరుగుతూ పోయింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. నిఘా సంస్థలు కూడా ఇంత మంది వస్తారని ఊహించలేదు. అభిమానులను అదుపు చేసేందుకు ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను జైలుకు చాలా దూరంలోనే నిలిపేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మీడియాను మాత్రమే జైలు ప్రధాన ద్వారం దాకా అనుమతించారు. అయితే అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లు, ముళ్ల కంచెలు దాటుకుంటూ జైలు ప్రధాన గేటు ముందుకు దూసుకువచ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అభిమానులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నిలబడ్డారు.

ఎస్కార్ట్‌నూ నెట్టేసిన అభిమానులు...
జగన్ వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఎస్కార్ట్‌గా పోలీసు వాహనాల కాన్వాయ్ వచ్చినప్పటికీ.. జైలు నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం వరకు రాగానే అభిమానుల వాహనాలు ఒక్కసారిగా కాన్వాయ్ మధ్యలోకి దూసుకువచ్చాయి. దీంతో జగన్ కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎస్కార్ట్ వాహనాలు చెల్లాచెదురయ్యాయి.
Share this article :

0 comments: