ఈ ముగ్గురిలో ఎవరి పరిపాలన సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ముగ్గురిలో ఎవరి పరిపాలన సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది?

ఈ ముగ్గురిలో ఎవరి పరిపాలన సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది?

Written By news on Tuesday, September 3, 2013 | 9/03/2013

వైఎస్ పాలనలోనే సమ్మిళిత వృద్ధి
నివేదిక: ఇప్పుడు అభివృద్ధికి పర్యాయపదంగా ఎవరి నోట విన్నా గుజరాత్ పేరే వినపడొచ్చు. కానీ ఈ ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన సంగతిని విస్మరించడం వాస్తవికత అనిపించుకోదు. గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి మోడీ, వైఎస్ కంటే ముందు తొమ్మిదేళ్లు మన రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లేదంటే ఆరేళ్లు మాత్రమే పాలించినా, సువర్ణాధ్యాయాన్ని లిఖించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి - ఈ ముగ్గురిలో ఎవరి పరిపాలన సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది? ప్రస్తుతం సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. ‘సెస్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం ఆ అంశాన్నే ఆవిష్కరిస్తున్నది.
 
 2004 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ‘మారథాన్ వాక్’తో ప్రజల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రజల మదిలో చిరకాలంగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి ఒకరు. దేశంలో మరే రాష్ట్రం లో లేనన్ని సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలుచేసి ఉచిత విద్యుత్ పథకం ద్వారా దేశ ఆర్థిక వృద్ధివ్యూహంలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కల్పించిన నేత ఆయన. అన్నిరంగాల్లో వృద్ధి సాధిం చడంలో దేశానికే ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా గుర్తింపు పొందిన గుజరాత్‌కు సారథ్యం వహిస్తున్న నేత మరొ కరు. వేరొకరేమో... ఆర్థిక సంస్కరణలను దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన సీఎం. తనను తాను సీఈవోగా పిలుచుకుని... టూరిజం తప్ప ఏ ఇజం లేదంటూ ఊరేగిన నాయకుడు.
 
 ఈ ముగ్గురి అభివృద్ధి నమూనాలలో ఏది సమ్మిళితవృద్ధి సాధిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 1993-94 నుంచి 2003-04 దాకా చంద్రబాబు నాయుడు పాలనా కాలాన్ని, 2004-05 నుంచి 2008-09/2009-10 దాకా వైఎస్ పాలనను, 2004-05 నుంచి 2009-10 దాకా మోడీ ఏలుబడిని అధ్యయన కాలంగా తీసుకుని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీకి చెందిన కామర్స్ ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి ‘సెస్’ (ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం) కోసం నివేదిక రూపొందించారు. ఈ ముగ్గురి నమూనాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన నమూనాయే సమ్మిళిత వృద్ధి సాధించిందని ఈ అధ్యయనం నిగ్గుదేల్చింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్ హయాంలోనే వివిధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని నివేదిక సోదాహరణంగా పేర్కొన్నది.
 
గుజరాత్ సీఎం నరేంద్ర మోడి హయాంలో కంటే వైఎస్ హయాంలోనే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పేందుకు ఈ నివేదిక ఓ దాఖలా. వైఎస్ ప్రవేశపెట్టిన అభివృద్ధి- సంక్షేమ పథకాలు ఇందుకు దోహదం చేశాయని ఈ అధ్యయనం నిరూపించింది. ఉచిత విద్యుత్తు మొదలుకుని కరెంటు బకాయిల మాఫీ, సామాజిక పెన్షన్లు, రూ.2 కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా సేద్యానికి నీరు అందేలా చేయడం వంటి అనేక చర్యలు ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టంగా పేర్కొంది. వైఎస్ హయాంలో మొదటిసారిగా రెండు దశాబ్దాల తర్వాత (1980, 1990ల తర్వాత) జాతీయ సగటు కంటే వృద్ధిరేటు అధికంగా నమోదైందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వృద్ధిరేటు గుజరాత్‌కు దాదాపు సమానంగా ఉండటం గమనార్హమని ఉటంకించారు. ఈ అధ్యయనంలో సమ్మిళిత అభివృద్ధికి సూచికలైన పేదరికం, ఉపాధి-నిరుద్యోగం, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మికుల వేతనాలు, వైద్యం, విద్యతో పాటు సామాజిక రంగంలో పెట్టిన ఖర్చు వంటి అంశాలను, అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలను ఆయన పరిశీలించారు.
 
 పేదరికం
         ఆంధ్రప్రదేశ్ 12వ పంచవర్ష ప్రణాళిక అప్రోచ్ పేపర్‌లో పేర్కొన్న ప్రకారం 1993-94 నుంచి 2004-05 కంటే 2004-05 నుంచి 2009-10 కాలంలో రాష్ట్రంలో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది.
 
         1993-94 నుంచి 2004-05 వరకు రాష్ట్రంలో పేదరికం తగ్గుదల శాతం 1.34 శాతం మాత్రమే ఉండగా, 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో పేదరికం తగ్గుదల 2.12 శాతంగా నమోదైంది. ఇది గుజరాత్ కంటే ఎక్కువ. గుజరాత్‌లో ఇదే కాలంలో పేదరికం తగ్గుదల శాతం 1.86 శాతం మాత్రమే కాగా... జాతీయ సగటు 1 శాతం మాత్రమే.
 
         గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా పేదరికం తగ్గుదల శాతాన్ని గమనించినా వైఎస్ హయాంలోనే పేదరికం తగ్గుదల శాతం అధికంగా ఉంది. 1993-94 నుంచి 2004-05 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుదల వరుసగా 1.70, 1.07 శాతం ఉంది. అదే 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో ఇది ఏకంగా 2.33, 1.44 శాతంగా ఉంది. అంటే అటు గ్రామీణ ప్రాంతాలలోను, ఇటు పట్ణణ ప్రాంతాల్లోనూ పేదరికంలో తగ్గుదల వైఎస్ హయాంలోనే ఎక్కువగా ఉందన్నమాట. గుజరాత్‌లో పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల శాతం చాలా తక్కువగా కేవలం 0.48 శాతం మాత్రమే ఉంది. అంటే వైఎస్ హయాంలోనే గుజరాత్ కంటే పేదలకు విస్తృతస్థాయిలో లబ్ధి చేకూరిందని అర్థం చేసుకోవచ్చు.
 
         వైఎస్ హయాంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు... 2 రూపాయలకే కిలో బియ్యం అందించడం, పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ, పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయడం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులకు ప్రతినెలా జీతం ఇచ్చినట్టుగా సామాజిక పింఛన్ల పథకాన్ని భారీగా అందించడంతో పాటు ఆర్థిక సమస్యలతో పేదలు చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా ప్రభుత్వమే ఫీజులు చెల్లించడం వంటి పథకాలే కారణమని ఈ అధ్యయనం నొక్కిచెప్పింది. అదేవిధంగా ఈ పథకాలను కొద్ది మందికి మాత్రమే కాక అర్హులైన ప్రతి ఒక్కరికీ  సంతృప్తస్థాయిలో అమలుచేయడం వైఎస్ హయాంలోనే జరిగిందని ఈ అధ్యయనం వివరించింది. రాష్ట్రంలో పేదల సంఖ్య భారీగా తగ్గేందుకు ఈ పధకాలు దోహదం చేశాయని స్పష్టం చేసింది.
 
         రాష్ట్రంలో పేదల సంఖ్య 1993లో 3.1 కోట్లు ఉండగా... ఇది కాస్తా 50 శాతం వరకు తగ్గి 2009-10 నాటికి 1.6 కోట్లకు తగ్గింది.
         గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సగటు నెలవారీ వ్యయం కూడా వైఎస్ హయాంలో భారీగా పెరిగింది. బాబు హయాంలో రాష్ట్రంలో గ్రామీణ- పట్టణ ప్రాంతాల్లో సగటు నెలవారీ వ్యయం కేవలం 1.7 - 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. అయితే, వైఎస్ హయాంలో కేవలం 5 ఏళ్ల కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో 3.4 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.5 శాతం పెరిగింది. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నమాట.
 
         సామాజిక వర్గాల వారీగా చూసినప్పటికీ పేదరికం తగ్గుదల వైఎస్ హయాంలో మెరుగ్గా ఉంది. వైఎస్ హయాంలో ప్రత్యేకించి ఎస్సీ సామాజికవర్గాల్లో పేదరికం తగ్గుదల మిగిలిన వర్గాల కంటే ఎక్కువగా ఉంది. చంద్రబాబు హయాంలో గ్రామీణప్రాంతాల్లోని ఎస్టీలలో పేదరికం 1993-94 లలో 58.4 శాతం ఉండగా 2004-05 నాటికి ఏకంగా 60.3 శాతానికి పెరిగింది. అయితే 2009-10 నాటికి ఇది గణనీయంగా 39.3 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోని ఎస్టీలలో 1993-94 నాటికి పేదరికం 43.9 శాతం నుంచి 2004-05 నాటికి 50 శాతానికి పెరగగా వైఎస్ హయాం నాటికి అంటే 2009-10 నాటికి ఏకంగా 19 శాతానికి తగ్గింది. ఎస్సీలలోనూ 2004-05 నాటికి పేదరికం 35 శాతం నుంచి 2009-10 నాటికి 23.4 శాతానికి తగ్గిపోయింది. గుజరాత్ విషయానికి వస్తే 2009-10 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్టీలలో సుమారు సగం జనాభా (49 శాతం) పేదరికంలోనే మగ్గుతున్నారు. మొత్తంగా గుజరాత్‌లో ఎస్సీ-ఎస్టీ వర్గాలలో పేదరికం శాతం 2004-05తో పోలిస్తే 2009-10 నాటికి 31.17- 18.73 శాతం నుంచి 32.19- 29.41 శాతానికి పెరగడం గమనార్హం. అంటే మోడీ హయాంలో గుజరాత్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పెరిగిందన్నమాట.
 
         అన్ని సామాజికవర్గాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లోను, ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ సగటు కొనుగోలు వ్యయాన్ని పరిశీలిస్తే.... 1993-94 నుంచి 2004-05 వరకు (బాబు హయాంలో) అది నామమాత్రంగానే పెరిగింది. అదే 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో సగటు కొనుగోలు వ్యయం 1993-94లలో వరుసగా రూ.263, రూ.230, రూ.581, రూ.722 ఉండగా, 2004-05 నాటికి కేవలం రూ.431, రూ.495, రూ.581, రూ.722కు మాత్రమే పెరిగింది. అయితే, 2009-10 నాటికి ఇది ఏకంగా రూ.753, రూ.962, రూ.959, రూ.1313కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా సగటు కొనుగోలు వ్యయం 2004-05 నుంచి 209-10 మధ్యకాలంలో ఏకంగా 80 శాతం మేర పెరిగిందని అధ్యయనం వివరించింది.
 
         రాష్ట్రంలో పేదరికం తగ్గడానికి ప్రధానకారణాలు... సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు, వ్యవసాయ రుణాల మాఫీ, రైతుల కరెంటు బకాయిలు మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, చిన్న, సన్నకారు రైతులకు సంస్థాగత రుణవసతి కల్పన. అదే విధంగా రూ.2 కిలో బియ్యం, పావలా వడ్డీకే రుణాలు, సామాజిక పెన్షన్లు ఇవ్వడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ర్టంలోనే భారీగా అమలు చేయడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ పథకాలు చంద్రబాబు హయాంలో లేవు. గుజరాత్‌లో ఉన్నా పూర్తి స్థాయిలో లేవు.
 
 నిరుద్యోగం
         చంద్రబాబు హయాంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని విధాలుగా నిరుద్యోగిత రేటు పెరిగింది. రోజువారీ పరిస్థితి ఆధారంగా (సీడీఎస్) నిరుద్యోగిత లెక్కిస్తే బాబు హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 0.8 శాతం నుంచి 1.3 శాతానికి పెరిగింది. కానీ, వైఎస్ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2009-10లో రాష్ట్రం లో మొత్తం లేబర్ ఫోర్స్ 3.92 కోట్ల మంది ఉండగా.... 6.3 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. జాతీయసగటు కంటే 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉంది.
 
 కార్మికులు-వేతనాలు
         రిజర్వ్‌బ్యాంకు నివేదిక ప్రకారం 1995 నుంచి 2002 మధ్యకాలంలో రాష్ట్రంలో అసంఘటిత రంగంలోని కార్మికుల వేతనాలు నామమాత్రంగా పెరిగాయి. 2002 నుంచి 2004 వరకు పెద్దగా పెరుగుదలలేదు.  అసంఘ టిత రంగంలోని కార్మికుల వేతనం 2002లో కేవలం రూ.48.94 ఉండగా 2003 నాటికి రూ.48.32కు తగ్గి 2004 నాటికి రూ.49.35 మాత్రమే. అయితే, 2005 నుంచి వేతనాలు గణనీయంగా పెరిగాయి. 2005లో రూ.51.78 ఉన్న వేతనం కాస్తా 2007 నాటికి రూ.71.31కు,  2009 నాటికి ఏకంగా రూ.108.32కు పెరిగాయి. 2004తో పోలిస్తే 2009 నాటికి అసంఘటిత రంగంలోని కార్మికుల వేతనాలు రెండింతలకంటే ఎక్కువగా  పెరిగాయి. గుజరాత్‌తో పోలిస్తే 2006 వరకు ఆంధ్రప్రదేశ్ వేతనరేటులో తక్కువస్థాయిలోనే ఉంది. అయితే, 2006 తర్వాత పరిస్థితి మారిపోయింది.
 
         వ్యవసాయరంగంలో వేతనాలను పరిశీలిస్తే.... నిజవేతన వృద్ధిరేటు 2004-09 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 7.9 శాతం సగటు వార్షిక వృద్ధిని సాధించినట్టు ఎన్‌ఎస్‌ఎస్ సర్వేలు చెబుతున్నాయి. ఇందుకు కారణం రాష్ట్రంలో వ్యవసాయరంగంలో నమోదైన వృద్ధిరేటే. అంటే వైఎస్ హయాంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రుణాల మాఫీ, సంస్థాగతంగా రుణాలను రైతులకు అధికంగా ఇప్పించడమే కారణమని అధ్యయనం తేల్చిచెప్పింది. అయితే, ఇది గుజరాత్‌లో 1.1 శాతం మాత్రమే.
 
         మార్కెట్ వేతనాలు కూడా వైఎస్ హయాంలోనే మెరుగయ్యాయి. అదే విధంగా మగవారి కనీస వేతనాలు కూడా 2004-09 మధ్యకాలంలో రూ.60 నుంచి రూ.120కి పెరిగాయి. వైఎస్ హయాంలో ఆడవారి కనీస వేతనాలు కూడా 67 శాతం నుంచి 81 శాతం వరకూ పెరిగాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయని విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడంవల్ల వేతనాలు భారీగా పెరిగాయని అధ్యయనం వివరించింది.
 
Share this article :

0 comments: