పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!

పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!

Written By news on Saturday, October 12, 2013 | 10/12/2013

పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!


* ఒడిశా, ఉత్తరాంధ్రలను వణికిస్తున్న ‘ఇంద్రనీలం’
* నేటి సాయంత్రం తీరం తాకనున్న పెను తుపాను
* పారాదీప్ - కళింగపట్నం మధ్య తీరం దాటనున్న పై-లీన్
* శ్రీకాకుళం సహా ఒడిశాలోని నాలుగు జిల్లాలకు పెను ముప్పు
* గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి
* తీరం దాటేటపుడు 25 సెంటీమీటర్ల వర్షపాతం అంచనా
* విశాఖ - ఒడిషాల మధ్య నేడు రైలు సర్వీసులు రద్దు

 
 ప్రస్తుతం ఎక్కడుంది?
 పై-లీన్ తుఫాను శుక్రవారం సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే ఇంద్రనీలం అని అర్థం.
 
 దూసుకొచ్చేదెప్పుడు?
 శనివారం సాయంత్రం ఒడిశాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా) మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ వద్ద ఇది తీరం దాటుతుంది.
 
 ఏ జిల్లాలకు నష్టం?
 తీరం దాటే సమయంలో గంటకు 220 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తాయి. ఈ సమయంలో సముద్రం మూడు మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. తక్కువ సమయంలోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చు. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
 
 పెను ముప్పు?
 1999లో ఒడిశాను వణికించిన తుపాను 9,885 మందిని బలితీసుకుంది. గంటకు 220 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండొచ్చని అమెరికా అంచనా.
 
 కుండపోతే!
 వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్రలో రోజుకు 25 సెం.మీ. వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవవచ్చు.
 
 
భువనేశ్వర్/విశాఖపట్నం/హైదరాబాద్, సాక్షి:  పెను తుపాను పై-లీన్ పడగ విప్పుతోంది. తూర్పు తీరాన్ని కబళించేందుకు వేగంగా దూసుకొస్తోంది. శనివారం సాయంత్రం ఒడిషాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ వద్ద ఇది తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 220 కిలోమీటర్ల వరకూ వేగంతో పెను గాలులు వీస్తాయని హెచ్చరించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చని వెల్లడించింది.
 
ఈ తుపాను ఒడిషాలోని ఐదు తీర ప్రాంత జిల్లాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అపార విధ్వంసం సృష్టించనుందని అప్రమత్తం చేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం ఒడిషాలోని 14 తీర జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు, జాతీయ విపత్తు సహాయ దళం, సైనిక బలగాలు, వాయుసేనలు.. తుపాను ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నాయి.  8 ఓడ రేవుల్లో (కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం) మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
 
 సముద్రం ఉప్పొంగుతుంది...
 థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే అంటే ఇంద్రనీలం అని అర్థం.   ఈ తుపాన్ ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. రోడ్లు కొట్టుకుపోతాయి. ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలపై ‘ఇంద్రనీలం’ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ విభాగం అధిపతి డాక్టర్ ఎల్.ఎస్.రాథోడ్ తెలిపారు. ఇది శుక్రవారం సాయంత్రం గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో (కళింగపట్నం తీరానికి తూర్పు, ఆగ్నేయ దిక్కున 410 కిలోమీటర్ల దూరంలో) బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. గంటకు 45 కి.మీ. వేగంతో కదులుతోందన్నారు.

ఇది దిశ మారుతూ ఒడిశా తీరంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కళింగపట్నం-పారాదీప్ మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో సముద్రం 3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుందని రాథోడ్ వివరించారు. ఇది పెను తుపానే కానీ.. సూపర్ సైక్లోన్‌గా మారబోదని రాథోడ్ ఢిల్లీలో పేర్కొన్నారు. 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ 9,885 మందిని బలితీసుకుంది. అప్పుడు గంటకు 220 కి.మీ.కి పైగా వేగంతో పెనుగాలులు వీచాయని.. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండవచ్చని అమెరికా నౌకాదళం అంచనా వేసింది కాబట్టి.. ఇది కూడా సూపర్ సైక్లోనేనని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి.కె.మహాపాత్రా భువనేశ్వర్‌లో పేర్కొన్నారు.
 
 తీర ప్రాంతాలు ఖాళీ...
 తుపాను కారణంగా ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలన్న లక్ష్యంతో ఏడు కోస్తా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలను వేగంగా ఖాళీ చేయించాలని ఒడిశా సర్కారు ఆదేశించింది. గంజాం, గజపతి, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపర, నయాగఢ్, ఖుద్రా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను శుక్రవారం సాయంత్రానికల్లా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రక్, బాలాసోర్ జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
   
 సర్వసన్నద్ధంగా సైనిక, సహాయ బృందాలు
 తుపాన్ నేపథ్యంలో వాయుసేనకు చెందిన రెండు ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలను, పరికరాలను భువనేశ్వర్‌కు తరలించారు. సహాయ చర్యల కోసం వాయుసేన బలగాలను రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్‌పూర్, బారక్‌పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో సంసిద్ధంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టటం కోసం నౌకాదళం, వాయుసేన, జాతీయ విపత్తు సహాయ దళం, ఒడిషా విపత్తు సహాయ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. 28 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలను ఒడిషా ప్రభుత్వానికి అందుబాటులో ఉంచారు.
 
 గంజాం గజగజ...
 తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో శుక్రవారం ఉదయం నుంచే గంటకు 65 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి ఈ గాలుల తీవ్రత 100 కిలోమీటర్ల వేగం దాటింది. భువనేశ్వర్, బరంపురం, కటక్  తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. పారాదీప్‌లో సాయంత్రం 7 గంటలకు వర్షం అధికమైంది. భువనేశ్వర్, కటక్ నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోనూ సాయంత్రం 4.30 గంటల నుంచే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు ప్రజలు పోటీ పడడంతో దుకాణాల్లో సరుకులు ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల సాయంత్రం నుంచి దుకాణాలు మూతపడ్డాయి. గంజాం జిల్లా గోపాల్‌పూర్ సమీపంలో తుఫాన్ తీరం దాటనుండటంతో.. ఆ జిల్లాతో పాటు బరంపురం నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
 భయం గుప్పిట సిక్కోలు...
 పై-లీన్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. క్షణక్షణానికీ పెరిగిపోతున్న గాలుల ఉధృతి.. అంతకంతకూ ఎగసిపడుతోన్న కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ప్రత్యేకంగా హెచ్చరికలు పంపారు. తూర్పు నావికాదళం తీర ప్రాంతాల్లో ప్రత్యేక హెలికాప్టర్లతో గస్తీ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి చిన్నపాటి ఈదురుగాలులతో ప్రారంభమైన చినుకులు క్రమంగా వర్షంగా మారాయి. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సముద్రం సాయంత్రం 4 గంటల నుంచి అల్లకల్లోలంగా మారింది. గార మండలం కళింగపట్నం, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, కంబాలరాయుడు పేట తదితర ప్రాంతాల్లో సముద్రం 30 నుంచి 70 మీటర్ల ముందుకు వచ్చేసింది. అలలు ఐదు, పది మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో అధికారులు, మెరైన్ పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని మత్స్యకారులను, బోట్లను తీరం నుంచి వెనక్కి తరలించారు. అలల ఉధృతికి తీరం కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న పడవలను గ్రామాల్లోకి తరలించారు. 

పలు గ్రామాల్లో స్థానికులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. జిల్లాలోని 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల పరిధిలోని 237 గ్రామాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని సుమారు 47 వేల మందిలో శుక్రవారం సాయంత్రానికి 12,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను రక్షిత భవనాలు, ప్రభ్వుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 137 పునరావాస కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడే విధంగా బియ్యం, కిరోసిన్, నిత్యావసరాలు సిద్ధం చేశారు. మరోవైపు ఎగువన ఒడిశాలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లలో నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. గొట్టా బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని కూడా వంశధార నదిలోకి వదిలారు.

 విజయనగరం, విశాఖ జిల్లాల్లో...

 విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ, చింతపల్లి, తిమ్మయ్యపాలెం, తిప్పలవలసల వద్ద సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. తీర గ్రామాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంతాల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసింది. విశాఖ జిల్లా పరవాడలోని ముత్యాలమ్మపాలెం తీరంలో సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. భీమిలిలోని తీరం ప్రమాదకరంగా మారింది. బోయివీధి తీరానికి సమీపంలోని రక్షణ గోడ ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదముంది. సముద్రంపై వేటకు వెళ్లిన వారు సుమారు 1,500 మందికి పైగానే ఉంటారన్న సమాచారంతో.. వారందరినీ వెంటనే వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
 కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా ప్రభావం...
 పై-లీన్ ప్రభావంతో మచిలీపట్నం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారి ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి.  మంగినపూడిబీచ్‌లోకి పర్యాటకులను శుక్రవారం అనుమతించలేదు. గురువారం నాటికి 40 బోట్లు చేపలవేట సాగిస్తుండగా వాటిలో 16 బోట్లు గిలకలదిండి హార్భర్‌కు చేరాయి. మరో 24 బోట్లు తిరిగి రావాల్సి ఉంది. వెలగలేరు వద్ద కుంపిణివాగులో గురువారం గల్లంతైన ఎన్.పావని (14) మృతదేహం శనివారం లభ్యమైంది. వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున లోతట్టు వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ డెల్టాలోని వరి, పసుపు, వేరుశనగ పంటలు ముంపుబారిప పడకుండా సాగునీటి కాల్వల్లో నీటి విడుదలను తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు.
 
 ‘ఇంద్రనీలం’ తీవ్రత ఇదీ...
 శుక్రవారం సాయంత్రం నుంచే గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీయటం మొదలయింది. అర్ధరాత్రి నుంచి గాలుల వేగం పెరుగుతూ పోతుంది. శనివారం ఉదయానికి ఈ గాలుల వేగం గంటకు 150 కిలోమీటర్లు దాటుతుంది.
తుపాను శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య చిలుకా సరస్సు దక్షిణ ప్రాంతాన్ని తాకుతుంది. చిలుకా సరస్సుకు దక్షిణంగా 20 కిలోమీటర్ల పరిధిలో తుపాను పెను విధ్వంసం సృష్టిస్తుంది. పారాదీప్‌లో తుపాను వాతావరణం కొన్ని గంటల పాటు కొనసాగుతుంది.
 ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది.
*  అతి తక్కువ సమయంలోనే 25 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ వర్షపాతానికి అవకాశముంది. 48 గంటలపాటు ఉత్తరాంధ్రలో కుండపోతగా వర్షం కురుస్తుంది. వడగండ్ల వాన ఉంటుంది.  
*  తుపాను తీరం దాటే సమయంలో తీరంలో గాలుల ఒత్తిడికి సముద్రం 3.3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. దీనివల్ల తీరంలోని కొన్ని ప్రాంతాలు నీట మనుగుతాయి.
*  విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. భారీ స్థాయిలో రోడ్లు కొట్టుకుపోతాయి. చెట్లు నేలకూలుతాయి. రైలు, రోడ్డు, రవాణా స్తంభిస్తుంది.
*  ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
 *  తుపాను తీవ్రత ఆదివారం నాటికి క్రమంగా తగ్గుతుంది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది.బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపాను ఏకంగా మనదేశం సైజులో సగం వరకూ ఉందట. తీరాన్ని తాకేదాకా పైలీన్ పరిమాణం, బలం తగ్గే అవకాశాలు లేవని హవాయిలో అమెరికా నేవీకి చెందిన ‘జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(జేటీడబ్ల్యూసీ)’ వెల్లడించింది. పై-లీన్ తీరాన్ని దాటితే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పెను విలయం సృష్టించే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. అయితే పైలీన్ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉందని, అది దేశంలో సగం సైజులో లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ పేర్కొన్నారు.


 220 కి.మీ. వేగంతో తీరం దాటే అవకాశం....
 ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్‌ల మధ్య శనివారం రాత్రి గంటకు 220 కి.మీ. వేగంతో వీచే గాలులతో పై-లీన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. అయితే తుపాను గంటకు 315 కి.మీ. వేగంతో వీచే గాలులతో విరుచుకుపడే అవకాశముందని ‘జేటీడబ్ల్యూసీ’, లండన్‌లోని ‘ట్రాపికల్ స్టార్మ్’ సంస్థల నిపుణులు హెచ్చరించారు. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ 220 కి.మీ. వేగంతో కూడిన గాలులతో విరుచుకుపడిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

 వెంటనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే గనక.. అనూహ్యరీతిలో ప్రాణనష్టం, లక్షలాది మందిపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. 1999లో వచ్చిన ఒడిశా సైక్లోన్ ధాటికి సుమారు 10 వేల మంది మృత్యువాత పడగా.. 450 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆ తుపాను తీరం దాటిన ప్రదేశం వైపుగానే దాదాపు అదే తీవ్రతతో పై-లీన్ కూడా సాగుతోంది. అయితే హరికేన్ హంటర్ విమానాలు లేకపోవడంతో పై-లీన్ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా.. ఈ తుపాను 300 కి.మీ. వేగాన్ని మించి విజృంభించనుందని, అదే జరిగితే బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత పెను తుపానుగా ఇది రికార్డులకు ఎక్కనుందని చెబుతున్నారు.

 ‘కత్రినా’ను మించే విలయం..?
 అమెరికాను 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అతలాకుతలం చేసింది. వేల కోట్ల డాలర్ల నష్టాన్ని కల్గించడమే కాకుండా 1,800 మందిని ఆ హరికేన్ పొట్టనపెట్టుకుంది. అయితే ఆ హరికేన్ కన్నా పై-లీన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఉపగ్రహ చిత్రాల సమాచారాన్ని బట్టి చూస్తే.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వేసిన అంచనాలకు మించి పైలీన్ తీవ్రత పెరగవచ్చని జేటీడబ్ల్యూసీ, ట్రాపికల్ స్టార్మ్ నిపుణులు భావిస్తున్నారు.


శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్‌’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు  సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయి. తుపాను ప్రభావితం చేసే 11 మండలాల్లో 237 గ్రామాలు గుర్తించారు. దాంతో 134 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కవిటి మండలం ఇత్తివానిపాలెం, గార మండలం బందరువాణి పేట వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు వచ్చింది. 12,500మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్‌, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం నెంబర్లు :
నంబర్లు-08942 240557, 96528 38191
Share this article :

0 comments: