‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం

Written By news on Sunday, October 20, 2013 | 10/20/2013

‘విభజన’ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని.. దానిని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ప్రధాని కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజన విషయంలో కేంద్రం అక్టోబర్ 3న ప్రకటించిన నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు అనుగుణంగా లేదని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఉందని.. అది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా కూడా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
 ఈ వ్యాజ్యంపై       సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. రఘురామకృష్ణరాజు తరఫున ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మ విభూషణ్ ఫాలీ ఎస్.నారీమన్ వాదనలు వినిపించనున్నారు.

 గవర్నర్, స్పీకర్‌లను కలిసినా ప్రయోజనం లేకపోయింది.. ‘అసెంబ్లీకి బిల్లు రావడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి, విజ్ఞప్తి చేశారు. కానీ అటు గవర్నర్, ఇటు స్పీకర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందనా లేదు.
 
 అధికరణ 3 కింద రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకు తెలుసుకోలేదు. అంతేగాక ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చిదంబరం చేసిన ‘డిసెంబర్ 9’ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. పార్లమెంట్‌లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి లేదు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ తగిన సలహాలు ఇవ్వొచ్చు. అయితే అవి ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగించే విధంగా ఉంది. రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర తెలుసుకోకుండా, ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు.
 
 ముందు అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవాలి..
 
 ‘ప్రస్తుతమున్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై రాజ్యాంగంలోని 3వ అధికరణలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలి. అనంతరం పార్లమెంట్ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతుంది.  ఆ తరువాతే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఇంతకు మించి మరో విధానం లేదు. 3వ అధికరణ విషయంలో కేంద్రం తనకు అధికరణ 73 కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించాలంటే.. ముందు అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి.
 
 అలా చేయకుండా విభజనపై ముందుకెళితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్లడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని 1955లోనే రామ్ జయకపూర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్ర కేబినెట్ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమేగాక, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయం కూడా. అందువల్ల ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలి.
 
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందుకు సంబంధించి అసెంబ్లీలో తగిన తీర్మానం చేస్తారని 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. దాంతో తెలంగాణపై ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందని డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371 (డి), 371 (ఇ)లను రాజ్యాంగంలో చేర్చారు. అవి అమలులో ఉండగా, విభజనపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రఘురాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Share this article :

0 comments: