చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం

చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం
హైదరాబాద్ : వర్షాలు, వరదలు వారి సంకల్పాన్ని ఏమాత్రం చెదరగొట్టలేకపోయాయి. ఇళ్లు కూలుతున్నా, పంట మునుగుతున్నా, జీవితమే స్తంభించిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. రైళ్లు, బస్సులు, జీపులు.. ఇలా ఏవి దొరికితే వాటిలోనే బయల్దేరారు. వందలు.. వేలసంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం జరిగే సమైక్య శంఖారావం సభకు హాజరయ్యేందుకు సీమాంధ్రలోని పదమూడు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు బయల్దేరి వచ్చారు.

సభ ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం రెండు గంటలకే అయినా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని తెల్లవారు జాము నుంచే హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి... ఇలా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, జీపులు, కార్లలో సమైక్య వాదులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేలాదిగా శుక్రవారం సాయంత్రం నుంచే బయల్దేరారు. వీరంతా శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద నుంచి ఎల్బీ స్టేడియం వైపు తరలి వెళ్తున్నారు. ఎల్బీ స్టేడియానికి ఇప్పటికే చేరుకున్న పలువురిని అక్కడినుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపుతున్నారు. స్టేడియం బయట మరింతమంది లోపలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్న గట్టి నమ్మకం తమకుందని.. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టాలని సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రజలు చెప్పారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ఏకైక లక్ష్యమని, తమ ప్రాంతాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నా.. వాటివల్ల కలిగే నష్టం కంటే విభజన వల్ల శాశ్వతంగా కలిగే నష్టమే ఎక్కువని, తమతో పాటు తమ బిడ్డల జీవితాలను కూడా రాష్ట్ర విభజన సర్వనాశనం చేస్తుందని.. అందుకోసమే దాన్ని అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న తమ డిమాండును ఢిల్లీ గల్లీల్లో కూడా గట్టిగా వినిపించేలా సమైక్య శంఖాన్ని పూరించి తీరాలని అంటున్నారు.
Share this article :

0 comments: