వెనువెంటనే దీక్షలతో ప్రమాదం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెనువెంటనే దీక్షలతో ప్రమాదం..

వెనువెంటనే దీక్షలతో ప్రమాదం..

Written By news on Thursday, October 10, 2013 | 10/10/2013

జగన్ దీక్ష భగ్నం
బలవంతంగా నిమ్స్‌కు తరలింపు..
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పోలీసుల సహాయంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.  దీక్షలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారంనాడు వైద్యులు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగా క్షీణించిందని, తక్షణం ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రమాదకర స్థాయికి చేరుతుందని నివేదించారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఆమరణ దీక్షకు దిగిన నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష సాగిస్తున్న లోటస్‌పాండ్ ప్రాంతానికి రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా, పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని అంబులెన్స్ రప్పించారు.
రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు పెద్దసంఖ్యలో దీక్షా శిబిరం వేదికపైకి చొచ్చుకువచ్చి జగన్‌ను బలవంతంగా తరలించడానికి ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించారు. మొదట నగర సంయుక్త పోలీస్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) మల్లారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పరిస్థితిని వివరించి దీక్ష విరమించాలని కోరారు. తనకు ఏమీ కాదంటూ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. శిబిరం పరిసర ప్రాంతాల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు పోలీసుల ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేదికపైకి చేరుకున్న పోలీసు అధికారులు తొలుత జగన్‌తో చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కసారిగా జగన్‌ను ఎత్తుకుని వేదిక నుంచి అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా, నిరంకుశంగా వ్యవహరించి జగన్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అక్కడున్న నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే జగన్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి అక్కడి నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 
ఫ్లూయిడ్స్ వద్దని ప్రతిఘటించిన జగన్..
ఆసుపత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి యత్నించగా.. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిఘటించారు. సమైక్యాంధ్ర కోసం తన ఆమరణ దీక్షను కొనసాగించనివ్వాలని వైద్యుల్ని, పోలీసులను కోరారు. ఈ పరిస్థితుల్లో నిమ్స్ వైద్యులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యానికి ఆయన తిరస్కరిస్తున్నారని చెప్పారు. అయితే  ఆయన ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు తెలిపినట్లు చెప్పారు. తర్వాత 12.30 గంటల సమయంలో పోలీసుల సాయంతో వైద్యులు బలవంతంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో ఐదు రోజులుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైంది.
 
 ఆసుపత్రికి చేరుకున్న విజయమ్మ, భారతి
 బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తల్లి విజయమ్మ.. జగన్‌ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని హుటాహుటిన నిమ్స్‌కు బయలుదేరారు. 11.25 గంటల ప్రాంతంలో ఆమె, జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతి.. పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డితో కలిసి ఆస్పత్రికి వెళ్లి జగన్‌ను పరామర్శించారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డిని చూడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున వస్తారని తెలిసి పోలీసులు ముందస్తుగా ఆస్పత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను ఆస్పత్రి లోనికి తరలించగానే గేట్లు మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.
 
 వెనువెంటనే దీక్షలతో ప్రమాదం..
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బుధవారం బాగా క్షీణించింది. రాత్రి దీక్ష భగ్నానికి ముందు బుధవారం ఉదయంపూట.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన డా.రఫీ (ఆర్‌ఎంఓ), డా.రామచంద్రరావు (జనరల్ ఫిజీషియన్), డా.అభిమన్యుసింగ్ (అనస్థీషియా), డా. వలీ(నెఫ్రాలజిస్ట్) తదితరులతో కూడిన వైద్య బృందం రెండు దఫాలుగా జగన్‌మోహన్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఐదురోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో పాటు కీటోన్ బాడీస్ వేగంగా పెరిగాయని, ఇది ఆందోళనకర అంశమని హెచ్చరించింది. ఫ్లూయిడ్స్ తీసుకొని తక్షణం దీక్ష విరమించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు పరీక్షల అనంతరం జగన్‌కు తెలిపారు. అయినప్పటికీ దీక్ష విరమించడానికి జగన్ ఒప్పుకోలేదు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి జైలులోనే ఆగస్టు 25న ఆమరణ దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జైలు అధికారులు ఆయనను నిమ్స్‌కు తరలించారు. అక్కడా దీక్ష కొనసాగించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31న బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్ష భగ్నంచేశారు. బెయిల్‌పై బయటకొచ్చాక మళ్లీ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కేవలం మధ్యలో నెల రోజుల వ్యవధిలో ఇలా రెండోసారి జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయడం ఏమాత్రం మంచిది కాదని, భవిష్యత్తులో ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు.
 
 4 ప్లస్ స్థాయికి కీటోన్స్..
 నెలరోజుల వ్యవధిలోనే రెండు సార్లు దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కీటోన్స్ పెరగడంతో పాటు సుగర్ లెవల్స్ పడిపోయాయని, ఆయన వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు తేల్చిచెప్పారు. దీక్ష నాలుగోరోజైన మంగళవారం 3 ప్లస్ స్థాయిలో ఉన్న కీటోన్స్ బుధవారం 4 ప్లస్ స్థాయికి చేరుకోవడాన్ని బట్టి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. దీక్ష కొనసాగితే కిడ్నీలపై దుష్ర్పభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే రాష్ట్ర ప్రజల కోసం తాను దీక్ష కొనసాగిస్తానని జగన్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం జగన్ సంబంధీకులతో పాటు పార్టీ నేతలతోనూ చర్చలు జరిపి ఆరోగ్య రీత్యా దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. బీపీ స్థాయి 120/90, చక్కెరస్థాయి 54 శాతం, కీటోన్స్ 4+, పల్స్‌రేటు నిమిషానికి 72 స్థాయిగా ఉన్నాయని తెలిపారు. వైద్య బృందంలోని డాక్టర్ రఫీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం క్షీ ణిస్తుందన్న కారణంగా దీక్ష విరమింపచేయాలని జగన్‌కు సూచించామన్నారు. రాష్ట్ర సమైక్యత కంటే తన ప్రాణం ముఖ్యం కాదని జగన్ తెలిపినట్లు చెప్పారు.
 
అభిమానుల్లో ఆందోళన..
ఉదయం దీక్షాస్థలికి వచ్చిన శ్రేణుల ముఖాల్లో తమ అభిమాన నాయకుడి ఆరోగ్యం పట్ల ఆందోళన స్పష్టంగా కనిపించింది. కొందరు మహిళలయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటూ, మహానేత బాటలో ఆయన తనయుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందని కంటతడి పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండడం, ఆ తర్వాత అక్రమంగా కేసులు బనాయించి టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయి ఆయనను జైలుకు తరలించడం, ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను తలుచుకుని ఉద్విగ్నానికి లోనయ్యారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న శ్రమ తన సొంతం కోసం కాాదని, నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా ఆయన నడుస్తున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా కార్యకర్త వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం పెద్ద ఎత్తున పడుతున్నప్పటికీ అభిమానుల సందోహం తగ్గలేదు. వర్షంలోనూ వారు దీక్షా వేదిక ముందు నిల్చొని తమ అభిమాన నాయకుడికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలకు లెక్కచేయకుండా జగన్  దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని ఈ సందర్భంగా దీక్షస్థలి వద్ద పలువురు ప్రజలు, అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.
 
 దీక్షకు మద్దతుగా రక్తదానం శిబిరం...
 జగన్‌మోహన్‌రెడ్డిదీక్షకు మద్దతుగా పార్టీ యువజన విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాచమల్లు రవి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రారంభించిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు, అభిమానులు రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తదితరులున్నారు.
 
 సంఘీభావం తెలిపిన నాయకులు...
 పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, టి.బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబురావు, బి.గుర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నేతలు పేర్ని నాని, భూమా నాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్ కుమార్, ఎస్వీ మోహన్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, ద్వారకనాథరెడ్డి, అంబటి రాంబాబు, జ్యోతుల నెహ్రూ, నూకసాని బాలాజి, సామినేని ఉదయభాను, వై.విశ్వేశ్వరరెడ్డి, అడుసుమిల్లి జయప్రకాశ్, వీఎల్‌ఎన్ రెడ్డి, ఎల్వీ కృష్ణారెడ్డి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొల్లి నిర్మలకుమారి, మేరిగ మురళి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి జగన్‌ను పరామర్శించారు.
 
 ప్రభుత్వం స్పందించాలి: వాసిరెడ్డి పద్మ
 సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటం రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులకు ఆవేదన కలిగిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా తక్కువ సమయంలోనే రెండో సారి దీక్షకు పూనుకోవడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విశాల ప్రయోజనాల రీత్యా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
Share this article :

0 comments: