వరద పరిస్థితిపై జగన్ ఆరా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరద పరిస్థితిపై జగన్ ఆరా

వరద పరిస్థితిపై జగన్ ఆరా

Written By news on Friday, October 25, 2013 | 10/25/2013

వరద పరిస్థితిపై జగన్ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల పార్టీ కన్వీనర్లతో గంట, గంటకూ సమీక్షలు నిర్వహించారు. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి స్థానిక అధికారుల తోడ్పాటు తీసుకొని ముందుకు సాగాల్సిందిగా జిల్లా నాయకులను ఆయన ఆదేశించారు. వరదలపై జగన్ సమీక్ష వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు మంజూరు చేసిన బెయిల్ షరతులను న్యాయస్థానం సడలిస్తే ఈ నెల 27, 28 తేదీల్లో వరద ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని చెప్పారు. న్యాయస్థానం నుంచి సానుకూల స్పందన రానియెడల పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని కొణతాల వెల్లడించారు.
 
 ముంపు ప్రాంతాల్లో తక్షణం సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని కొణతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. వరదల నేపథ్యంలో రిజర్వాయర్ల దగ్గర గట్లు తెగిపోయిన ప్రాంతంలో ప్రభుత్వం అప్రమత్తమై భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయినందున రైతులకు తక్షణ పరిహారం అందజేయాలన్నారు. గతంలో నీలం తుపాను కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం అందించలేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మొన్నటి పై-లీన్ తుపానుకు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో కొబ్బరి, జీడి మామిడి తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయని, మత్స్యకారులు కూడా నష్టపోయారని చెప్పారు. ప్రస్తుత వర్షాలకు కూడా మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉందని, వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
 రైతుకు కన్నీరు మిగిల్చిన వర్షాలు
 
 ఈ ఏడాది పంటలు ఎంతో బాగుంటాయని రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన తరుణంలో భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంటంతా నీటిపాలైందని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు, పత్తి, చెరకు తదితర పంటలు భారీగా నష్టపోయాయని వివరించారు.
 
 ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వరంగల్ లాంటి కొన్ని మార్కెట్ యార్డుల్లో పత్తి, మొక్కజొన్న నిల్వలు నీటిపాలయ్యాయన్నారు. ప్రకాశం జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తిపంట, గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాల్లో నీరు నిలిచిపోవడంతో టమాటా, చిక్కుడు, బెండ లాంటి పంటలు పూర్తిగా నష్టపోయాయన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో 40 క్వింటాళ్ల పత్తి పూర్తిగా నీటమునిగి పాడైపోయిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు రూ. ఆరు కోట్ల విలువైన వేరుశనగ పంట దెబ్బతిందన్నారు. అలాగే కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఉంచిన వివిధ ఉత్పత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అంతేకాక ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వరద ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కొణతాల కోరారు.
 
Share this article :

0 comments: