రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ?

రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ?

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

నేడే సమైక్య శంఖారావం
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలనే మెజారిటీ ప్రజల బలీయమైన ఆకాంక్షను చాటిచెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరిపారు. విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందున.. భారీ వర్షాలు, వరదలతో తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా నష్టాలొచ్చినా లెక్కచేయకుండా సమైక్య శంఖారావం నిర్వహించాల్సిందేనని అన్ని ప్రాంతాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. సమైక్య రాష్ట్రం భగ్నమైతే రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ? సీమాంధ్ర తాగునీరు, సాగునీటికి భద్రత ఏదీ? అంటూ ఎల్లెడలా వ్యక్తమవుతున్న ఆవేదనను ఢిల్లీకి వినిపించి తీరాలని అన్ని వర్గాల వారూ స్పష్టంచేస్తున్నారు. దీంతో సభను యథావిధిగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ మేరకు సభను నిర్వహించే ఎల్‌బీ స్టేడియంలో పరిస్థితిని పార్టీ నేతలు సమీక్షించారు. దగ్గరుండి సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు పార్టీ నేతల నుంచి ప్రకటనలు వెలువడిన వెంటనే సుదూర ప్రాంతాలకు చెందిన కొందరు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే శాశ్వత నష్టాన్ని నిరోధించే లక్ష్యంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి జనం పెద్ద ఎత్తున కదులుతున్నారు. 
 
 భారీ వర్షాలూ వరదల్లోనూ చెదరని సంకల్పంతో.. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా సమైక్య లక్ష్యం సాధించాల్సిందేనని అకుంఠిత దీక్షతో తరలి వస్తున్నారు. అనేక చోట్ల స్థానికులు దగ్గరుండి మరీ ఉత్సాహవంతులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లో శనివారం జరగబోయే సభకు పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో సమైక్య వాణిని ఢిల్లీకి వినిపించడానికి ఇదొక్కటే సరైన వేదికగా ప్రజలు కదులుతున్నారని పార్టీ నేతలు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సజావుగా, శాంతియుతంగా సభను నిర్వహించడానికి పార్టీ నేతలు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సభ నిర్వహణకు సంబంధించి పలుమార్లు ముఖ్య నేతలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న ఎల్‌బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా నామకరణం చేశారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలంటూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. 
 
 సమైక్య వాణి వినిపించడంలో జాప్యం తగదు
 రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నవంబర్ 7వ తేదీన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం నిర్వహించి విభజన ప్రక్రియను వేగవంతం చేయనున్న నేపథ్యంలో సమైక్య వాణిని బలంగా వినిపించాలని, ఆ విషయంలో ఇక ఏమాత్రం జాప్యం చేయరాదని భావించి.. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సభ జరుపుతున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో హైదరాబాద్ దిశగా జనం తరలి వస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం అందింది. 
 
 వరదలపై జగన్ సమీక్ష...
 గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన అన్ని జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు, కన్వీనర్లకు ఫోన్లు చేసి పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం నిర్వహణపై శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమై సమీక్షించారు. శనివారం కూడా వర్షాలు ఉంటాయని సమాచారం అందింది. దీనిపై జిల్లాల వారీగా నేతలతో ఫోన్లో మాట్లాడినప్పుడు సమైక్యం కోసం ఎన్ని వర్షాలనైనా ఎదుర్కొని శంఖారావం సభకు వస్తామని ఇప్పటికే ప్రజలు పెద్దఎత్తున సిద్ధమయ్యారని వారు తెలిపారు. ప్రజలు తమ మనోభిప్రాయాన్ని తెలియజేయాలన్న సంకల్పంతో హైదరాబాద్ తరలిరావడానికి ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాన్ని ఢిల్లీకి తెలియజేయాల్సిన అవసరముందని వైఎస్సార్ కాంగ్రెస్ భావించింది. కాబట్టి సమైక్య శంఖారావాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. కురుస్తున్న భారీ వర్షాల వల్ల సభకు వచ్చేవారికి ఇబ్బందులు ఉంటాయని.. అయినప్పటికీ విభజన జరిగితే రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం తప్పదని, సభ నిర్వహణలో ముందుకే వెళ్లాలని తీర్మానించారు. 
 
 ఎనభై అడుగుల వేదిక
 సభా ప్రాంగణమైన ఎల్‌బీ స్టేడియంను శుక్రవారం శాసనసభలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు జూపూడి ప్రభాకరరావు, వై.వి.సుబ్బారెడ్డి, మూలింటి మారెప్ప, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ ముఖ్య నేతలు ఆసీనులు కావడానికి 80 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటుచేశారు. ఈ వేదికపై పదహారు అడుగుల ఎత్తై  ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పటం, తెలుగుతల్లి విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిల చిత్రాలను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభను దగ్గరి నుంచి తిలకించడానికి వీలుగా ప్రాంగణంలో నాలుగు అతి పెద్ద ఎల్‌సీడీలను ఏర్పాటు చేస్తున్నట్లు వేదిక ఏర్పాట్లను చూస్తున్న రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. స్టేడియం బయట కూడా వీక్షకుల సౌకర్యం కోసం మరో నాలుగు మొబైల్ ఎల్‌సీడీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
Share this article :

0 comments: