ఢిల్లీ + చంద్రబాబు + నల్లారి = విభజన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ + చంద్రబాబు + నల్లారి = విభజన

ఢిల్లీ + చంద్రబాబు + నల్లారి = విభజన

Written By news on Sunday, October 20, 2013 | 10/20/2013

ఢిల్లీ + చంద్రబాబు + నల్లారి = విభజన
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర విభజన దిశగా కేంద్ర ప్రభుత్వానికి సానుకూల వాతావరణం కల్పించడంలో కాంగ్రెస్-టీడీపీ ఇంతకాలంగా గుట్టుగా అమలు చేస్తూ వస్తున్న రహస్య ఎజెండా నెమ్మదిగా వెలుగు చూస్తోంది. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడటంతో కొంతకాలంగా అంతర్గతంగా అమలు చేసిన వ్యూహాన్ని కాస్తా ఇప్పుడు ఆ రెండు పార్టీలూ బాహాటంగానే ముందుకు తీసుకెళ్తున్నాయి.
 
 విభజనకు వ్యతిరేకమన్న భావనను పైకి కల్పిస్తూనే, లోలోపల మాత్రం రెండు రాష్ట్రాల ఏర్పాటులో కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా సానుకూల పరిస్థితులను కల్పించే దిశగా రెండు పార్టీలూ పరస్పరం కలసికట్టుగా ముందుకు వెళ్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు నుంచి వాటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతమవుతూ వస్తున్నాయి. టీడీపీ-కాంగ్రెస్ పార్టీల నేతలు కలసికట్టుగానే ఒకవైపు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసేలా కేంద్రానికి అండదండగా నిలుస్తున్నారు.
 
 మొదట సీమాంధ్ర సమస్యలంటూ మాట్లాడిన రెండు పార్టీల నేతలూ ఇప్పుడు ఒక్కొక్కరుగా ‘సీమాంధ్రకు ప్యాకేజీ’ అంటూ కొత్త గొంతుక విన్పిస్తుండటం పూర్తిగా హస్తిన స్క్రిప్టులో భాగమేనంటున్నారు! ‘విభజన తప్పదు కాబట్టి ప్యాకేజీ’ అనే వాదన ద్వారా విభజన దిశగా మరింతగా సానుకూల పరిస్థితులను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేంద్రం గేమ్ ప్లాన్‌ను టీడీపీ, కాంగ్రెస్ నేతలు పక్కా పథకం ప్రకారం ఒక్కో అడుగూ ముందుకు తీసుకెళ్తున్నారన్న వాదన ఆయా పార్టీల్లోనే బలంగా విన్పిస్తోంది!
 
 
రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడటంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం సైతం మొదట్లో తర్జనభర్జన పడింది. సీమాంధ్ర ఉద్యమానికి తోడు రాజకీయ సంక్షోభమూ తలెత్తితేవిభజనపై ముందుకెళ్లడం మరింత కష్టతరమవుతుందని భావించింది. ఈ తరుణంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనను విరమింపజేయడంతో పాటు ఉద్యమం రాజకీయ మలుపు తిరగకుండా చూడటంలో కాంగ్రెస్, టీడీపీల నాయకత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలోనే విభజన ప్రక్రియను ఒక్కొక్క అడుగు చొప్పున వేగవంతం చేస్తూ వస్తోందని తెలుస్తోంది.
 
 చంద్రబాబు దీక్ష.. రెండో అంకం...
 
 
రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన జూలై 30 నుంచి ఇప్పటిదాకా సమైక్యం గురించి చంద్రబాబు ఏ రోజూ ఒక్క మాటైనా మాట్లాడలేదు. పైగా ఢిల్లీలో నిరాహార దీక్ష సందర్భంగా కూడా సమైక్యమన్న పదం ఉచ్చరించడానికే ఆయన ఇష్టపడలేదు. అంతేగాక, ‘సమస్యలను పట్టించుకోకుండా విభజన చేయడమేంటి?’ అంటూ విభజనకు అనుకూలంగా కొత్త వాదనను వ్యూహాత్మకంగా బాబు తెరపైకి తెచ్చారు. నిజానికి సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించిన రోజునే ‘సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలి’ అంటూ ఆయన డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ తర్వాత కూడా సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ వచ్చారే తప్ప సమైక్యంగా ఉంచాలని ఎక్కడా చెప్పలేదు. వేగవంతంగా విభజన చేసి సీమాంధ్రకు ప్యాకేజీ వంటిదేదైనా డిమాండ్ చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్, టీడీపీ రెండూ మొదటి నుంచీ ఒకే మాటగా ముందుకు వెళ్తున్నాయి. ఢిల్లీలో బాబు దీక్ష మొదలైన రోజు నుంచీ ఆ రెండు పార్టీల రహస్య ఎజెండా ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
 
 
దీక్ష ప్రారంభించిన రోజునే విభజన విధివిధానాలను సూచించడానికి కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) యూపీఏ సర్కారు ఏర్పాటు చేసింది. నిజానికి సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతున్న దశలో విభజనపై కేంద్రం కొంత నెమ్మదించినట్టు కనిపించింది. సీమాంధ్రలో అన్ని వర్గాలూ ఆందోళనలు చేయడం, జీతాలు, రోజువారీ కూలీ డబ్బులు రాకపోయినా ప్రభుత్వోద్యోగుల నుంచి కార్మికుల దాకా అందరూ సమైక్య మహోద్యమాన్ని సాగించారు. రోజుల తరబడి విద్యుత్తు లేకపోయినా కష్టనష్టాలకు ఓర్చుకుంటూ ముందుకు సాగారు. అలాంటిది, బాబు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచే కేంద్రం మళ్లీ విభజన చర్యలను వేగవంతం చేసింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో ఒక్కొక్కటిగా చర్చలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెర లేపారు. అసెంబ్లీలో తీర్మానంపై ఓటింగ్ జరగదని తెలిసి కూడా, ‘తీర్మానాన్ని ఓడిస్తాం’ అంటూ ఉద్యోగ సంఘాలకు లేనిపోని హామీలిస్తూ, ఆందోళన విరమించేలా వారిపై ఒత్తిడి పెంచారు.
 
 
ఇక దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఎలాంటి అనుమతీ లేకుండానే బాబు దీక్షకు దిగినా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసమాత్రంగా కూడా అభ్యంతరపెట్టలేదు. పైగా ఢిల్లీ పోలీసులకు, కేంద్ర హోం శాఖకు ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ఫిర్యాదు చేసినా వారు స్పందించనేలేదు. తద్వారా బాబు విభజన దీక్ష సజావుగా సాగేలా సహకరించారు. ఇక తాజాగా శుక్రవారం బాబు రాష్ట్ర విభజనకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించగా, ఆ మర్నాడే కేంద్ర మంత్రుల బృందం మలి భేటీ జరపడం, విభజన ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లడం జరిగిపోయాయి. ఇలా పథకం ప్రకారం కలసికట్టుగా విభజనను వేగవంతం చేస్తూనే... పైకి మాత్రం ఢిల్లీలో జీవోఎం సమావేశం వద్ద టీడీపీ ఎంపీలు హైడ్రామా సృష్టించారు. పైగా టీడీపీ ఎంపీలంతా జీవోఎం రాష్ట్రంలో పర్యటించాలని, ఆ తర్వాతే విభజన చేయాలని మాట్లాడారే తప్ప విభజన వద్దని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారెక్కడా కోరలేదు!
 
అంతా ఒకే బాటలో: ఇక విభజనపై పార్టీపరంగా రక్షణ మంత్రి ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ వేయడం కూడా కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు వ్యూహంలో భాగంగానే జరిగింది. ఇటు ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ ప్రకటించగానే, సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ అటు బాబు డిమాండ్ చేశారు. అక్టోబర్ 7న ఢిల్లీలో దీక్ష ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో కూడా విభజనపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని బాబు డిమాండ్ చేయగా, ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ప్రధానికి అదే విషయమై విజ్ఞప్తి చేశారు! రెండు పార్టీల సారథులు ఇలా ఒకే డిమాండ్ విన్పించడం ఏఐసీసీ పెద్దల డెరైక్షన్ మేరకేనని ఇట్టే అర్థమైపోతోంది. బాబు ఢిల్లీ దీక్ష కూడా పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ మార్గదర్శనం మేరకే సాగింది. ఆయన ఢిల్లీలో దీక్ష చేసినంత కాలం జాతీయ స్థాయి రాజకీయ పార్టీల దృష్టి సీమాంధ్ర ఉద్యమంపై పడకుండా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న జాతీయ మీడియా ప్రశ్నలకు దీక్ష తొలి రోజు నుంచి చివరి వరకు బాబు ఎప్పుడూ బదులే ఇవ్వలేదు. పైగా ఆద్యంతం సీమాంధ్ర ఉద్యమాన్ని పలుచన చేసే కోణంలోనే ఆయన మాటతీరు సాగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
 
ఉద్యోగుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారు: ఒకవైపు బాబు ఢిల్లీలో దీక్ష చేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేబినెట్ నోట్‌కు ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను కూడా కాంగ్రెస్, టీడీపీ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. దాదాపు రెండున్నర నెలలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆందోళన కొనసాగించిన ఉద్యోగ సంఘాలు, రాజకీయ అండ దొరక్కపోవడంతో చివరికి సీఎం ముందు ఒక్కొక్కటిగా విరమణకు అంగీకరించాయి! ఉద్యమం రాజకీయ మలుపు తిరిగితే తట్టుకోవడం కష్టమవుతుందనే భయంతోనే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినట్టుగా వారితో కలసి పని చేయడానికి కాంగ్రెస్, టీడీపీ ముందుకు రాలేదు. రెండు పార్టీలూ పరస్పర అవగాహనతోనే తమ ఉద్యమానికి దూరంగా ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించడం తెలిసిందే.
 
 
ఒకే వాదన: సీమాంధ్రలో ఉద్యమం పలుచబడిందంటూ ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు ‘సీమాంధ్రకు ప్యాకేజీ’ అంటూ కొత్త అంశాన్ని మెల్లమెల్లగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా, ‘మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ మాట్లాడటం ప్రారంభించారు. బాబు కూడా సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజు నుంచే ఇదే డిమాండ్ చేస్తూ వస్తుండటం తెలిసిందే. పైగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో కూడా, ‘విభజన తప్పదు. కేంద్రానికి నేనిచ్చిన విభజన లేఖను వెనక్కి తీసుకోబోను’ అని కూడా బాబు స్పష్టం చేశారు!
 
 ‘రాజీ’నామాలు: రాష్ట్ర సమైక్యాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
 
 తరవాత పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు, ఎంపీలు కూడా వరుసగా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కానీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం రాజీనామాల విషయంలో పథకం ప్రకారం ఒకే రకమైన డ్రామాను నడిపించారు! ముందు మౌనంగా ఉన్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్-టీడీపీ నేతలు... విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఒక్క ఉదుటున గళమెత్తి తీవ్రస్థాయిలో ఆందోళనలకు దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామాల పేరిట డ్రామాకు తెరలేపారు. ప్రధానికి రాజీనామా ఇచ్చామని కేంద్ర మంత్రులు, స్పీకర్‌కు సమర్పించామని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు చెప్పుకుంటూ వచ్చారు. తీరా చూస్తే ఒక్క కొనకళ్ల నారాయణ తప్పించి సీమాంధ్ర కేంద్ర మంత్రులు గానీ టీడీపీ ఎంపీలు గానీ అసలు రాజీనామా లేఖలనే లోక్‌సభ స్పీకర్‌కు పంపలేదన్న విషయం తర్వాత స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనతో బయటపడింది. పైగా వారంతా ఇప్పటికీ అధికార హోదాల్లో పర్యటనలు కొనసాగిస్తూనే వస్తున్నారు!


http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-and-kiran-kumar-reddy-trying-to-backstab-74297?pfrom=home-top-story
Share this article :

0 comments: