ప్రజల మనోభావాలకు ఇలా డబ్బుతో వెల కడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల మనోభావాలకు ఇలా డబ్బుతో వెల కడతారా?

ప్రజల మనోభావాలకు ఇలా డబ్బుతో వెల కడతారా?

Written By news on Tuesday, October 8, 2013 | 10/08/2013

సమైక్యోద్యమాన్ని అవమానిస్తున్నారు: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. ‘రాష్ట్ర విభజన ప్రకటన వెలువడ్డ మర్నాడే బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ... సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు ప్యాకేజీకి డిమాండ్ చేస్తారు. బాబు అడిగిన మేరకు ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దిగ్విజయ్ చెబుతారు. ప్రజల మనోభావాలకు ఇలా డబ్బుతో వెల కడతారా?’ అంటూ మండిపడింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో కోట్లాది మంది రోడ్లమీదికొచ్చి 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా బాబు నోట మాత్రం ‘జై సమైక్యాంధ్ర’ అనే మాట ఒక్కసారైనా రావడం లేదంటూ తూర్పారబట్టింది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో బాబు చేపట్టిన నిరాహార దీక్ష రూ.4 లక్షల కోట్ల కోసమేనా అని ప్రశ్నించారు.
 
 అసలెందుకు దీక్ష చేస్తున్నదీ ఆయన ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రణబ్ కమిటీకిచ్చిన విభజన లేఖను వెనక్కు తీసుకోకుండానే బాబు దీక్షకు దిగడం దేనికోసం? చూస్తుంటే, ‘విభజన ఇప్పటికే ఆలస్యమైంది, త్వరితగతిన విభజించండి’ అనే డిమాండ్‌తోనే బాబు దీక్ష చేపట్టినట్టుంది! విభజనకు 24 గంటల్లో కేబినెట్ నోట్ సిద్ధం చేస్తామని జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటించినా, దానికి 63 రోజులు పట్టేసరికి బాబులో ఆందోళన నెలకొన్నట్టుంది. ‘నోట్‌నే ఇంత ఆలస్యంగా పెడితే ఎన్నికల్లోపు విభజన సాధ్యమా? వేగం పెంచండి’ అనే ఉద్దేశంతోనే ఆయన దీక్ష చేపట్టినట్టు అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బాబుల కుట్ర నెరవేరదన్నారు. సీమాంధ్ర ఉద్యమం వల్లే నోట్‌పై కేంద్రం ఇంత తాత్సర్యం చేసిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత విభజించడం ఎవరి తరమూ
 కాదన్నారు.
 
 సీమాంధ్రకు బాబు ద్రోహం
 సీమాంధ్ర ప్రాంతానికి బాబు తీరని ద్రోహం చేస్తున్నారని అంబటి, శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని త్వరగా విభజించాలంటూ గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లి నివేదికలిచ్చిన బాబు, ఈసారి ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏకంగా నిరాహార దీక్షే చేస్తున్నారని మండిపడ్డారు. ‘విభజన ప్రకటన తర్వాత తాను సీమాంధ్ర అంతటా తిరగానని, అయినా తననెవరూ అడ్డగించలేదని రాష్ట్రపతి, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తదితర నేతలతో బాబు బీరాలు పలికారు. వెళ్లిన చోటల్లా  తనకు జేజేలు పలికారని, సీమాంధ్రలో ఉద్యమమే లేదని చెప్పుకున్న బాబు. కొందరు ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని ఢిల్లీ పెద్దలకు బాబు చెప్పడం వల్లే కేబినెట్ నోట్ వచ్చింది. అంటే ఎవరు ఎవరితో కుమ్మక్కయినట్టు? పైగా ఢిల్లీ నిరాహార దీక్షలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఆయన పల్లెత్తు మాటైనా అనలేదు. అధికార పక్షంతో నాలుగేళ్లుగా అంటకాగుతూ, నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనను జనం ప్రజలు నిత్యం చీదరించుకుంటున్నా దానిపై ఏనాడూ కనీసం గళమెత్తని బాబు.. తనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుందనడం సిగ్గుచేటు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు చంద్రబాబు వ్యతిరేక ఓటు కూడా వైఎస్సార్‌సీపీకే పడతాయి’’ అన్నారు.
 
 సీమాంధ్రపై దాడి కనిపిస్తలేదా?
 పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడులను అరికట్టాలని సీఎంను కోరానన్న దిగ్విజయ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్‌రెడ్డి, రాంబాబు మండిపడ్డారు. ‘‘దాడులు తప్పే. వాటికి మేం అనుకూలం కాదు. కానీ కాంగ్రెస్, టీడీపీ కూడబలుక్కుని మరీ సీమాంధ్రపై పెను దాడి చేస్తుంటే ప్రజలంతా రోడ్ల మీదికొచ్చి అర్తనాదాలు చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని కేంద్రం... కేవలం మంత్రులు, ఎంపీల ఆస్తులు కాపాడేందుకు మాత్రమే ఉందా?’’ అంటూ మండిపడ్డారు.
Share this article :

0 comments: