యథావిధిగా సమైక్య శంఖారావం: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యథావిధిగా సమైక్య శంఖారావం: వైఎస్సార్‌సీపీ

యథావిధిగా సమైక్య శంఖారావం: వైఎస్సార్‌సీపీ

Written By news on Friday, October 25, 2013 | 10/25/2013

యథావిధిగా సమైక్య శంఖారావం: వైఎస్సార్‌సీపీ
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడి  
ఎల్బీ స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లు
వర్షాలతో ఇబ్బంది ఉన్నా ఆశయం గొప్పది
సమైక్య శంఖారావం విన్పిస్తాం: వైవీ సుబ్బారెడ్డి
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకోండి  
పార్టీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు
బెయిల్ షరతుల వల్ల ముంపు ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నానంటూ ఆవేదన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఆశయంతో తలపెట్టిన సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వర్షాలు శనివారం నాటికి నిదానించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంటున్నందున ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో మెజారిటీ ప్రజల భావోద్వేగాన్ని ఢిల్లీకి తెలియజెప్పాలన్న సంకల్పంతో సభ తలపెట్టినందున, కొన్ని కష్టాలున్నప్పటికీ దాన్ని యథావిధిగా నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. 26వ తేదీ శనివారం ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన ఈ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు గురువారం ప్రత్యక్షంగా సమీక్షించారు.
 
 కొనసాగుతున్న సభ ఏర్పాట్లు
 వర్షం కారణంగా సభ ఏర్పాట్లకు కొంత అంతరాయం కలిగినా గురువారం సాయంత్రం నుంచి పనులు చురుగ్గా సాగుతున్నాయి. సభ జరిగే శనివారం రోజున వర్షముండదని అందుతున్న సమాచారంతో నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల నుంచీ సభలో ప్రాతినిధ్యం ఉండేలా జిల్లాలవారీగా నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఇతర నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం వల్ల కొన్ని ఇబ్బందులున్నా సభ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం పూరించేందుకు తమ అంచనాలకు మించి ప్రజలు వచ్చే అవకాశముందన్నారు.
 
 అందుకే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. గురు, శుక్రవారాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొని, శనివారం నేరుగా సభకు రావాల్సిందిగా వరద బాధిత ప్రాంతాల్లోని జిల్లా పార్టీ కన్వీనర్లు తదితర నేతలకు సూచించామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న ఆశయం గొప్పది గనుక ఎన్ని ఇబ్బందులున్నా యథావిధిగా 26వ తేదీనే సభ జరుపుతామని వివరించారు. రాష్ట్ర సమైక్యతను కోరే వారందరూ సభలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాహన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని మరీ జనం తరలి వస్తున్నారన్నారు. స్టేడియంను సందర్శించిన వారిలో పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్, కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తదితరులున్నారు.
 
 ఇవీ పార్కింగ్ స్థలాలు: కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా మెహిదీపట్నం చేరుకుని, అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌లో పార్కింగ్ చేసుకోవాలి. ఉభయగోదావరి, కృష్ణా, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే వాహనాలు దిల్‌సుఖ్‌నగర్ మీదుగా ఇందిరాపార్క్ చేరి, ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల వాహనాలను కూడా ఎన్టీఆర్ స్టేడియంలోనే నిలపాలని పార్టీ సూచించింది.
 
 ప్రత్యేక వైద్య ఏర్పాట్లు: శంఖారావానికి వచ్చే వారి కోసం మైదానం వద్ద పెద్ద ఎత్తున వైద్య చికిత్స ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్దా ఒక అంబులెన్స్, అత్యవసర వైద్య సిబ్బంది, ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నారు.
Share this article :

0 comments: