విభజన తొలి ద్రోహి సోనియానే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన తొలి ద్రోహి సోనియానే

విభజన తొలి ద్రోహి సోనియానే

Written By news on Saturday, October 19, 2013 | 10/19/2013

* సమైక్య తీర్మానం కోసం వైఎస్సార్‌సీపీ డిమాండ్..
* కుదరదన్న సీఎం.. సచివాలయంలో ఎమ్మెల్యేల ధర్నా
* కేంద్రం కోరితే తప్ప తాను ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయలేనన్న కిరణ్
* సీ బ్లాక్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.. అరెస్టు
* తక్షణమే సభను సమావేశపరచాలని స్పీకర్‌ను కోరిన ప్రజాప్రతినిధులు
* సమైక్యవాదులెవరో, ద్రోహులెవరో తేలిపోతుందని వ్యాఖ్య    
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానించేందుకు శాసనసభను తక్షణమే ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం సచివాలయంలో కలిసి ఈ మేరకు డిమాండ్ చేశారు. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో దానికి విరుగుడుగా శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, కాటసాని రామిరెడ్డి, కె.శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు కిరణ్‌ను కలిశారు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్‌ను కిరణ్ పట్టించుకోలేదు. శీతాకాల సమావేశాలకోసం డిసెంబర్‌లోనే సభ జరుగుతుందని చెప్పారు. కేంద్రం కోరితే తప్ప తనంతట తానుగా ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేయలేనని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కిరణ్ తీరుతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమైక్య తీర్మానం కోసం సభను సమావేశపరచాలనే డిమాండ్‌తో ఆయనకు వినతిపత్రం అందించారు.
అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడమే గాక సీఎం  కార్యాలయముండే సీ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ‘జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం’, ‘సమైక్య జెండా, రాష్ట్రానికి అండ’, ‘సమైక్యం కోసం సభను సమావేశపరచాలి’, ‘జై సమైక్యాంధ్ర’, ‘బాబు, కిరణ్ మొండి వైఖరి నశించాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అరగంటపాటు అక్కడే బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కనీసం అక్కడున్న మీడియాతో మాట్లాడటానికీ అనుమతించలేదు. ప్రజాప్రతి నిధుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనం ఎక్కించి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పై వదిలేశారు. ధర్నా నేపథ్యంలో సచివాలయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్‌గేటు నుంచి సీ బ్లాక్ వరకు పోలీసు  వలయాన్ని ఏర్పాటు చేశారు.
 మరోవైపు అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే నష్టాల్ని అసెంబ్లీద్వారా ప్రజలకు తెలపాల్సిన అవసరముందన్నారు. అదే సమయంలో సమైక్యవాదులెవరో, సమైక్యం ముసుగులో ద్రోహం చేస్తున్నవారి బండారమేమిటో కూడా బయటపడుతుందన్నారు. శుక్రవా రం మధ్యాహ్నం వారు అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందున వెంటనే సభను సమావేశపరచాలని కోరారు.

 సీమాంధ్రలో అగ్నిజ్వాలలు
స్పీకర్‌ను కలిసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి భూమన మీడియాతో మాట్లాడారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో 79 రోజులుగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయన్నారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామం తరవాత అతిపెద్ద ఉద్యమం ఇదే. రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుంది. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు తొలి నుంచీ పోరాడుతూనే ఉన్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ జైల్లోనూ, బయటా ఆమరణ దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో విభజన విషయంలో ఎవరి బండారమేమిటో ప్రజలకు తెలియాలంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాల్సిన అవసరముంది.

విభజనకు వ్యతిరేకంగా ఎగిసిపడుతున్న అగ్ని కీల లను ఆపడానికి సమైక్యవాద ముసుగులో నీళ్లు చల్లుతున్న ద్రోహుల బండారం కూడా సభ ద్వారానే బయటపడుతుంది. మేం సీఎంను కలసి ఇదే విషయం చెప్పి అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా ఆయన అంగీకరించలేదు. అసెంబ్లీని సమావేశపరచడానికి డిసెంబర్  30 దాకా గడువుంది గనుక ఆలోపుసమావేశపరుస్తామని, విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ వచ్చినప్పుడు అభిప్రాయ సేకరణ కూడా చేపడతామని బదులిచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసినా దానికి చట్టబద్ధత ఉండదు గనుక అసలు సభను సమావేశపరచాల్సిన అవసరమే లేదని కూడా కిరణ్ అన్నారు’’ అని తెలిపారు.

విభజన తొలి ద్రోహి సోనియానే
కాంగ్రెస్‌తో వైఎస్సార్సీపీ కుమ్మక్కైందంటూ వస్తున్న వార్తల్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా భూమన తీవ్రంగా స్పం దించారు. రాష్ట్ర విభజన విషయంలో తొలి ద్రోహి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయేనన్నారు. ‘‘మొదటి నుంచీ మేం ఇదే చెబుతూ పోరాడుతూనే ఉన్నాం కదా! సోనియా తరవాత... విభజనకు అనుకూల లేఖలిచ్చి, విభజన జరిగేదాకా నిద్ర కూడా పోకుండా, తీరా విభజన ప్రకటన వచ్చాక ఇప్పుడు హాయిగా నిద్ర పోతున్న చంద్రబాబు మరో ద్రోహి. 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని మేం చెప్పలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా, అందరి సమ్మతితో ఒక తండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమంటే విభజించాలని కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందనేది మా భావన. అంతే తప్ప ఏ ఒక్కరి అభిప్రాయమూ తెలుసుకోకుండా 3వ అధికరణాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసే నిర్ణయం తీసుకోవాలని కాదు. ఇలాంటి నిర్ణయాన్ని మేం అంగీకరించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు.

గతంలో రాజీనామా చేసి, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నిం చగా, ‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడిగేందుకు వచ్చిన వాళ్లం రాజీనామాలను ఆమోదించాలని కోరతామా?’ అని బదులిచ్చారు. అసెంబ్లీని సమావేశపరిచి అందరి అభిప్రాయాలూ తీసుకున్నాక స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించుకుంటామని శోభా నాగిరెడ్డి చెప్పారు.
Share this article :

0 comments: