విద్యుత్ చార్జీల పెంపునకు సర్కారు సన్నద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ చార్జీల పెంపునకు సర్కారు సన్నద్ధం

విద్యుత్ చార్జీల పెంపునకు సర్కారు సన్నద్ధం

Written By news on Sunday, November 10, 2013 | 11/10/2013

విద్యుత్ చార్జీల పెంపునకు సర్కారు సన్నద్ధం
ప్రజల నెత్తిన 12,000 కోట్ల భారం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను విద్యుత్ చార్జీలతో చావబాదేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏకంగా రూ.12 వేల కోట్ల మేర భారాన్ని జనం నెత్తిన మోపేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన లెక్కలను తేల్చడంలో ప్రస్తుతం ఇంధన శాఖ వర్గాలు బిజీగా ఉన్నాయి. ప్రాథమికంగా లెక్కించిన దాని ప్రకారం సుమారు 12 వేల కోట్ల మేరకు చార్జీల భారాన్ని ప్రజలపై మోపాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్టు ఇంధనశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్ర విభజన గొడవలో ఆర్టీసీ చార్జీల పెంపుపై పెద్దగా నిరసన వ్యక్తం కాలేదని గ్రహించిన ప్రభుత్వం.. రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపునకు సిద్ధపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంధనశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సుమారు రూ.47 వేల కోట్ల మేరకు ఆదాయం అవసరమవుతుందని అంచనా వేశారు.
 
 ప్రస్తుతం ఉన్న విద్యుత్ చార్జీల ద్వారా రూ.35 వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరనుంది. దీంతో రూ.12 వేల కోట్ల మేరకు ఏర్పడే లోటును కరెంట్ చార్జీల పెంపు ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇంత భారీ చార్జీల భారానికి కారణం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ డిమాండ్‌ను చూపడం ద్వారా తక్కువ సబ్సిడీని ఇవ్వడం.. విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలను తక్కువగా చూపడం, 2013-14లో సర్దుబాటు చార్జీలు లేవంటూ నాటకమాడి.. ఇప్పుడు ఆ భారాన్నీ ప్రజలపై మోపనుండటమేనని విద్యుత్‌రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. పైగా.. 2014-19 ఆర్థిక సంవత్సరాలకుగానూ(వచ్చే ఐదేళ్లకు) మల్టీ ఇయర్ టారిఫ్(ఎంవైటీ)ను ప్రకటించాల్సి రానుండటంతో గత నాలుగే ళ్లుగా భరించకుండా తప్పించుకున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ భారంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాలు, సర్దుబాటు చార్జీలనూ ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 12 వేల కోట్ల చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి డిస్కంలు సమర్పించనున్నట్టు సమాచారం.
 
 ‘ఉచిత’ భారాన్ని తగ్గించుకుంటోందిలా..: వ్యవసాయ విద్యుత్ సరఫరా అంచనాలను తక్కువగా లెక్కించడం ద్వారా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత కరెంట్‌కయ్యే వాస్తవిక భారాన్ని ప్రభుత్వం అదనంగా చెల్లించేది. ఈ విధంగా 2007-08 ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్లను డిస్కంలకు అదనంగా చెల్లించింది. అదేవిధంగా 2008-09 ఆర్థిక సంవత్సరంలో అదనపు విద్యుత్ కొనుగోలుకు అయిన రూ.6 వేల కోట్లనూ చెల్లిస్తామని హామీనిచ్చారు. అయితే, ఆయన మరణానంతరం ఉచిత విద్యుత్‌కయ్యే అదనపు వ్యయాన్ని ప్రభుత్వం భరించడం లేదు. గత రెండేళ్ల లెక్కలనే పరిశీలిస్తే.. 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకుగానూ వ్యవసాయానికి రాష్ర్టంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో  6143.15 మిలియన్ యూనిట్ల(ఎంయూ) క రెంట్ అదనంగా సరఫరా అయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈఆర్‌సీ అనుమతి మేరకు వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్ 16569.22 ఎంయూలు కాగా, సరఫరా అయినది 19924.4 ఎంయూలు. అదనంగా 3355.18 ఎంయూల విద్యుత్ ఇచ్చారు. అదేవిధంగా 2012-13లో సరఫరా చేయాల్సిన విద్యుత్ 18225.9 ఎంయూలు కాగా, సరఫరా అయింది 21013.87 ఎంయూలు. అంటే 2787.97 ఎంయూల విద్యుత్‌ను అదనంగా సరఫరా చేశారన్నమాట. ఈ లెక్కన గత రెండేళ్లలోనే ఏకంగా 6143.15 ఎంయూలు అదనంగా ఇచ్చారు. మొత్తమ్మీద 2010-11 నుంచి 2013- 14 వరకూ ఈ విధంగా ఏటా సగటున 2,500 ఎంయూల మేరకు ఉచిత విద్యుత్‌ను అదనంగా సరఫరా చేయాల్సి వచ్చింది.
 
 అయితే, ఈ 10 వేల మిలియన్ యూనిట్ల మొత్తానికి సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో డిస్కంలు వాణిజ్య సంస్థల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుని అదనపు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయానికి అదనపు కరెంట్‌ను సరఫరా చేశాయి. యూనిట్‌కు సగటున రూ.5.50 చొప్పున లెక్కిస్తే.. 10 వేల ఎంయూలకు రూ.5వేల కోట్ల మేరకు అదనంగా వెచ్చించాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉన్నా.. చెల్లించేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ భారం మొత్తాన్ని ఇప్పుడు ట్రూ-అప్ పద్ధతిలో(వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడం) రాబట్టుకునేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి.
 
 నష్టాలు, సర్దుబాటు అన్నీ జనంపైనే..
 
 ఉచిత విద్యుత్ భారంతో పాటు డిస్కంల నష్టాల భారాన్నీ ప్రజలపైనే మోపనున్నారు. ఈఆర్‌సీ నిర్ణయించిన విద్యుత్ సరఫరా, పంపిణీ(టీఅండ్‌డీ) నష్టాలతో పోలిస్తే.. వాస్తవ  నష్టం ఎక్కువగా ఉంది. అయితే, గత నాలుగేళ్లుగా వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఆ లోటును భర్తీ చేసుకోవాల్సి వస్తోంది. ఈ తేడా విలువ సుమారు రూ.3 వేల కోట్ల మేరకు ఉంటుందని డిస్కంలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీల వసూలు లేదని ప్రభుత్వం దర్జాగా ప్రకటించింది.
 
 అయితే, ఇప్పుడు దాన్నీ వసూలు చేయనున్నారు. 2013-14లో వసూలు చేయాల్సిన సర్దుబాటు చార్జీల భారాన్ని.. తాజా రెగ్యులర్ చార్జీలతో కలిపి సుమారు 2 వేల కోట్ల మేరకు వసూలు చేయనున్నట్టు తెలిసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిన అదనపు విద్యుత్ కోసం మరో 2 వేల కోట్ల మేరకు వెచ్చించాల్సి వస్తుందని అంచనా. తాజా చార్జీల్లో దాన్ని కలిపి వడ్డించనున్నారు. మొత్తంగా అన్నింటినీ కలుపుకుని రూ.12 వేల కోట్ల మేర చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు సన్నద్ధమవుతోంది.  అయితే, ఏయే కేటగిరీ(గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వగైరా)కి ఎంత మేరకు చార్జీలను పెంచాలనే విషయంపై కసరత్తు పూర్తికాలేదని ఇంధనశాఖ వర్గాలు చెప్పాయి. ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే కీలక సమావేశంలో ఏయే కేటగిరీకి ఎంత మేరకు చార్జీలను పెంచాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
 
 ఇప్పుడే ఎందుకు?
 
 డిస్కంలు ప్రతీ ఐదేళ్లకు ఓసారి మల్టీ ఇయర్ టారిఫ్(ఎంవైటీ)ను ఈఆర్‌సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఎంవైటీలో టారిఫ్ ప్రతిపాదనలను స్థూలంగా పేర్కొంటారు. తద్వారా రానున్న ఐదేళ్లపాటు టారిఫ్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ప్రధానంగా పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉంటుందనేది ఈ ఎంవైటీ లక్ష్యం. 2009-14 సంవత్సర కాలానికి సమర్పించిన ఎంవైటీ కాలపరిమితి 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోయింది. దీంతో 2014-19 వరకు.. అంటే రానున్న ఐదేళ్ల వరకు  ఎంవైటీను డిస్కంలు సమర్పించాల్సి ఉంది. కాగా, ఏటా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టారిఫ్‌ను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ ఆర్థిక సంవత్సరంలో చార్జీల పెంపు వివరాలతో టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్‌సీకి డిస్కంలు సమర్పిస్తున్నాయి. ఇప్పుడు ఎంవైటీని సమర్పించాల్సి ఉండటంతో 2009-14 ఎంవైటీ లెక్కలను సరిచూసుకుని.... గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన మొత్తాలన్నింటినీ వసూలు చేయాల్సి ఉందని ఇంధనశాఖ వర్గాలు చెబుతున్నాయి.  
 
 బాబు బాటలోనే..
 
 వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చంద్రబాబు హయాంనాటి రోజులు మళ్లీ వచ్చాయి. విద్యుత్ చార్జీల పెంపులో బాబును ప్రస్తుత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోంది. గత ఐదేళ్లు చార్జీలు పెంచలేదని... మరో ఐదేళ్లూ పెంచేది లేదని 2009లో వైఎస్ ప్రకటించారు. ఈ హామీని ప్రభుత్వం పట్టించుకోలేదు. నాడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచగా... వైఎస్ మరణానంతరం గత నాలుగేళ్లలో నాలుగుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఐదోసారి పెంచేందుకూ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నాలుగేళ్లలోనే రెగ్యులర్ చార్జీల రూపంలో సర్కారు రూ.12,500 కోట్ల భారాన్ని మోపింది. సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.11 వేల కోట్లకుపైగా మొత్తాన్ని జనం నెత్తిన రుద్దింది. అయితే, విద్యుత్ సరఫరా మాత్రం రోజురోజుకీ అంతంతమాత్రంగా మారిపోతోంది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ హామీనిచ్చారు. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట కూడా ఇచ్చారు. అయితే, ఈ హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
     
 
 గతంలో రెగ్యులర్ చార్జీల భారమిలా..
 ఆర్థిక సంవత్సరం    భారం(రూ. కోట్లలో)
 2010-11    1,000
 2011-12    1,000
 2012-13    5,000
 2013-14    5,500
 మొత్తం    12,500
 సర్దుబాటు చార్జీల వడ్డన ఇలా...
 ఆర్థిక సంవత్సరం    భారం(రూ.కోట్లలో)
 2009-10    1,442
 2010-11, 11-12    6,022
 2012-13     4240    
 మొత్తం    11,704
Share this article :

0 comments: