ఆనాడు ఏం చేశావు కిరణ్? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనాడు ఏం చేశావు కిరణ్?

ఆనాడు ఏం చేశావు కిరణ్?

Written By news on Wednesday, November 20, 2013 | 11/20/2013

బాబును నిలదీయండి
 రాష్ట్ర విభజన జరగరాదని భావిస్తే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన జరగకూడదని చంద్రబాబు భావిస్తే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. లేదా సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖ రాయాలి. ఆ రెండూ చేయకుండా వస్తే ప్రజలు నిలదీయాలి’’ అని అన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 27న కుప్పంలో పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆయనను చూడటానికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అంబటి మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం వెళితే చంద్రబాబుకు అంత భయమెందుకు? జగన్ వచ్చి జనంతో మాట్లాడితే కుప్పం ప్రజలు బాబుకు ఓట్లేసే పరిస్థితి ఉండదని భయపడుతున్నారా? అందుకే అలా మాట్లాడుతున్నారా? అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుడి సభకు వెళ్లొద్దని తాము పిలుపునివ్వబోమని, అయితే రాష్ట్ర విభజనకు సంబంధించి వైఖరీ చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడే చంద్రబాబు లాంటి వారిని ప్రశ్నించాలని ప్రజలకు చెబుతామన్నారు.
 
 టీడీపీని మూసేదశకు తెచ్చారు..
 సమైక్యమో విభజన వాదమో చెప్పలేని స్థితిలో టీడీపీని మూసివేసే దశకు చంద్రబాబు తెచ్చారని అంబటి విమర్శించారు. జగన్ వల్ల తనకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకున్న చంద్రబాబు.. సోనియా గాంధీతో ఆయన కుమ్మక్కయ్యారంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుమ్మక్కయి ఉంటే ఆయన 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది? సమైక్య శంఖారావం సభలో సోనియాగాంధీని ఆమె పౌరసత్వంపై ప్రశ్నించే వారా? అని అంబటి అన్నారు.
 
 ఆనాడు ఏం చేశావు కిరణ్?
 రాష్ట్ర విభజనపై కేంద్రానికి నివేదికలు పంపిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పైకి మాత్రం సమైక్యవాదినని చెప్పుకుంటున్నారని అంబటి అన్నారు. ఆయన నిజంగా సమైక్యంగా ఉండాలని కోరేవారే అయితే కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయకముందే అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపిద్దామంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి, షర్మిల రాలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను విలేకరులు ప్రస్తావించగా, చంద్రబాబు, కిరణ్ ప్రభావానికి లోనైన పత్రికలు కావాలనే ఇలాంటి అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.
Share this article :

0 comments: