సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ త్వరలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ త్వరలో

సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ త్వరలో

Written By news on Friday, November 22, 2013 | 11/22/2013

28 నుంచి జగన్ సమైక్య శంఖారావంవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
* కుప్పం నుంచి శ్రీకారం; ఓదార్పు యాత్ర కూడా  
* రాయలసీమ, తెలంగాణ మీదుగా శ్రీకాకుళం వరకూ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నవంబర్ 28న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై.. రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర సాగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరగలేదు కాబట్టి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక జిల్లాలో మరణించిన వారి కుటుంబాలను యాత్ర సందర్భంగా జగన్ పరామర్శిస్తారు.
 
  సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏ.వీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాంతీయ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జగన్ సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ను చేశారని.. ఇప్పుడు జగన్ సమైక్యాంధ్ర లక్ష్యంగా స్వయంగా యాత్ర చేపడుతున్నారని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది మంది ఆకాంక్షను చాటి చెప్పడానికే జగన్ పర్యటిస్తున్నారని తెలిపారు.
 
 విలేకరుల సమావేశంలో అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి త్యాగం చేయడానికైనా వెనుకాడబోదన్నారు. రాష్ట్రాన్ని విభజించమని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి గండ్రగొడ్డలిని ఇచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంకు జగన్ వస్తే అడ్డుకోవాలని, ఆయన వస్తే తలుపులు మూసుకోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడి ప్రజలను కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కుప్పంలో సమైక్యతను కోరే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చంద్రబాబు తనది ఏ వాదమో చెప్పకుండా జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారని విభజిస్తే అందరమూ నష్టపోతామనేది జగన్ వాదన అని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విరమింప జేసి, అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టకుండా కిరణ్ సమైక్య పోరాటం చేస్తున్నారని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు.
 
  
కిరణ్ కొత్త పార్టీ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్దేశకత్వంలోనే ఉంటుందన్నారు. రాష్ట్రం, దేశం నాశనమైనా చంద్రబాబునాయడు పట్టించుకోరని, రాజకీయ స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేటపుడే చాలా పెద్ద తప్పు చేస్తున్నారని తాను హెచ్చరించారని, అయినా చంద్రబాబు వినిపించుకోలేదని వెల్లడించారు. బాబు చేస్తున్న పనులకు రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇప్పటికే యావ జ్జీవ కారాగార శిక్ష విధించారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు రాజకీయ ఉరిశిక్ష వేస్తారన్నారు. జగన్ బస్సు యాత్ర చేస్తారని, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారని, మధ్యలో ఓదార్పు యాత్ర కూడా ఉంటుందని మిథున్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: