జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరం

జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరం

Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013

జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరంవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభినందించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణం దుర్వినియోగం కాకుండా చూడాలని జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన అంశాలివీ...

''జగన్, ఇతర నేతలు అన్ని జాతీయ పార్టీలను కలుసుకునే సందర్భంగా మమ్మల్నీ కలిశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నేను కలిసి వాళ్లతో చర్చించాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయొద్దని, సీపీఐ వైఖరిని పునరాలోచించాలని వారు మమ్మల్ని కోరారు. మూడో అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, దానిపై మేం ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. రాష్ట్రాలను విభజించే అధికారాన్ని ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి మా వైఖరిలో పునరాలోచన లేదు. విభజన జరిగి తీరాల్సిందేనని పునరుద్ఘాటించాం. భవిష్యత్తులో పార్లమెంటులో మెజారిటీ ఉండి ఇష్టం వచ్చినట్లు విభజన జరిగే అవకాశం ఉందని, దేశం ముక్కలవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకీ 272 సీట్లు రావు. ఫ్రంటులు ఏర్పడతాయి. అలా ఏర్పడ్డ ఫ్రంటులలో ఏకాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడిపోతామంటే వారిని బలవంతంగా ఆపలేమని, అయితే ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు న్యాయం చేయడానికి మా పార్టీ నిలుస్తుంది. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఇతర ప్రాంతాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉద్యమిస్తాం. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు న్యాయం జరిగిన తర్వాతే విభజన ప్రక్రియ ముందుకు సాగాలి'' అని సురవరం చెప్పారు.

విభజన విషయంలో రాష్ట్రంలోని వివిధ స్టేక్ హోల్డర్లను సప్రందించకుండా ముందుకువెళ్లడం తగదని గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశామని, కోస్తాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన రెండూ జరగాలని ఆయన తెలిపారు. దేశం ముక్కలు కావడం తమకూ ఇష్టం లేదని, అయితే అదే సమయంలో తెలంగాణ ప్రాంత వాసులకు ఇన్నాళ్లుగా జరిగిన అన్యాయాన్ని మాత్రం విభజన ద్వారానే సరిచేయాలని చెప్పారు. పొత్తుల విషయంలో మాత్రం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, లౌకిక వాదంతో ఉండాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అభినందించామని చెప్పారు.
Share this article :

0 comments: