ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తూ ముందుకు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తూ ముందుకు...

ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తూ ముందుకు...

Written By news on Thursday, November 28, 2013 | 11/28/2013

ఏలూరు : డెల్టా.. తీర గ్రామాల్లో అణువణువునా హెలెన్ తుపాను చేసిన గాయాలను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. చితికిపోయిన రైతులు.. ఉపాధి కోల్పోయి పుట్టెడు దుఃఖంలో చిక్కుకున్న మత్స్యకారుల దుస్థితిని తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. ప్రతిచోటా, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి బాధలు తెలుసుకుంటూ.. ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తూ ముందుకు సాగారు. బుధవారం నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ క్షణం కూడా విశ్రమించకుండా గ్రామాల్లో తిరిగారు. 
 
 జనం అడుగడుగునా ఆయన్ను చూసేందుకు, చేయి కలిపేం దుకు, మాట్లాడేందుకు పోటీ పడటంతో పర్యటన చాలా ఆలస్యమైంది. నరసాపురం మండలంలోనే రాత్రి 7 గంటల వరకూ వైఎస్ జగన్ పర్యటించారు. ఆ తర్వాత కొన్ని గ్రామాల్లో పర్యటనను రద్దు చేసుకుని పాలకొల్లు మండలం దిగమర్రు వెళ్లి రైతులను పరామర్శించారు. తొలుత నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇంటినుంచి పర్యటనకు బయలుదేరిన జననేత పట్టణాన్ని దాటడానికే గంటన్నర సమయం పట్టింది. గోదావరి రేవు, స్టీమర్ రోడ్డు, మొగల్తూరు రోడ్డు మీదుగా నరసాపురం మండలంలోకి ప్రవేశించే దారి పొడవునా జనం బారులు తీరి నిలబడి ఆయనతో చేయి కలిపారు. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నపిల్లలు ఆయన్ను చూసేం దుకు ఎగబడ్డారు. వారందరికీ అభివాదం చేస్తూ, చేయి కలుపుతూ, పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకెళ్లారు. పలుచోట్ల చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటంతో వారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు.
 
 పట్టణంలోని రాజగోపాల స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి దర్గా సెంటర్‌లో మసీదులోకి ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మత పెద్దలు వైఎస్ జగన్ చేతులు పట్టుకుని తమ మద్దతు వైఎస్సార్ సీపీకేనని చెప్పారు. పట్టణ శివారులో ఉన్న బొండమ్మ వృద్ధాశ్రమం వద్ద రోడ్డుపై వేచిచూస్తున్న వృద్ధులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే గ్రహణం మొర్రితో బాధపడుతున్న చిన్నారిని చూసి చలించిన జగన్‌మోహన్‌రెడ్డి పాపను ఎత్తుకుని వెంటనే చికిత్సకు ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. ముస్కేపాలెంలో తుపాను దెబ్బకు తెగిపోయిన వలలను బాగు చేసుకుంటున్న మత్స్యకారులను పరామర్శించారు. అక్కడినుంచి లక్ష్మణేశ్వరం గ్రామానికి చేరుకుని దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులను పలకరించి ‘ఇప్పటివరకూ ఎంత పెట్టుబడి పెట్టారు.. దెబ్బతిన్న పంట ఉపయోగపడుతుందా.. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితి వచ్చింది..
 
 ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా.. లేదా’ అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు చూపించిన వరి పనలను చూసి అవి పనికొస్తాయా లేదా అని ఆరా తీశారు. ఆ తర్వాత పలుచోట్ల నీళ్లలో నానుతున్న వరి పంటను కోసి రోడ్లపైకి తెస్తున్న రైతుల బాధలు తెలుసుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు వైఎస్ జగన్ వద్దకు పరుగుపరుగున వచ్చారు. వారిని ఆప్యాయంగా పలకరించి.. కూలి పనులు దొరుకుతున్నాయూ, చేసిన పనికి తగినంత కూలీ వస్తోందా అని అడిగి తెలుసుకున్నారు. సారవ సెంటర్‌లో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలి కారు. అక్కడ అందరినీ పలకరించిన వైఎస్ జగన్ ముందుకెళ్లారు. పలుచోట్ల ధాన్యం ఆరబెడుతున్న రైతులతో మాట్లాడి వారి పరిస్థితులపై ఆరా తీశారు. మోడి శివారున పూర్తిగా నీళ్లలో మునిగి నానిపోయిన వరి పొలంలోకి దిగి రైతులతో మాట్లాడారు. మోకాళ్ల లోతున ఉన్న బురదలో దిగడంతోపాటు తన చెప్పులు తానే చేత పట్టుకుని మళ్లీ గట్టు ఎక్కడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 
 
 వేములదీవి ఈస్ట్, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంకలో మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలలు, బోట్లు ఇవ్వడంతోపాటు ఉప్పు రైతులకు గోడౌన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తాను ఆయా గ్రామాలకు వచ్చి ఉప్పుమడుల్లోకి దిగి మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో ‘జగన్ బాబుకు అన్నీ గుర్తే’ నంటూ స్థానికులు ఉబ్బితబ్బియ్యారు. పెదమైనవాని లంక చేరుకునేసరికి రాత్రి 7 గంటలు దాటడంతో నరసాపురం మండలంలోని మిగిలిన గ్రామాలకు వెళ్లకుండా నేరుగా పాల కొల్లు మండలం దిగమర్రు వెళ్లి అక్కడ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇంటికెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తాడేపల్లిగూడెం వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 10.28 గంటలకు రైలులో హైదరాబాద్ పయనమయ్యారు.
 
 ఉదయం నుంచి సాయంత్రం వరకూ నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతోపాటు పలువురు వైసీపీ నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉండి దెబ్బతిన్న పంటలను చూపించారు. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, తోట చంద్రశేఖర్, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తానేటి వనిత, మద్దాల రాజేష్, పెండ్యాల వెంకట కృష్ణబాబు, గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, ఎస్.రాజీవ్‌కృష్ణ, తోట గోపీ, చీర్ల రాధ య్య, పీవీ రావు, అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు, అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఆకెన వీరాస్వామి, కండిబోయిన శ్రీనివాస్, తలారి వెంకట్రావు, మల్లుల లక్ష్మీనారాయణ, కావలి నాని, కౌరు సర్వేశ్వరరావు, కారుమంచి రమేష్, సాయినాధ్‌ప్రసాద్ పాల్గొన్నారు. 
Share this article :

0 comments: