సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు?

సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు?

Written By news on Friday, November 22, 2013 | 11/22/2013

సమైక్య రాష్ట్రానికి సైంధవుడు సీఎం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు కేంద్రానికి మార్గాలను సుగమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలంతా కలసి రోజుకొక నాటకం, పూటకొక డ్రామా వేస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్, ముఖ్యమంత్రిల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హైడ్రామాను చూస్తుంటే చాలా విస్మయం కలుగుతోందని పద్మ వ్యాఖ్యానించారు. కీలకమైన రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగా, నాటకీయంగా సాంకేతిక విషయాలను అడ్డుపెట్టి రోడ్డుమీద చర్చ జరిగేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. సమైక్యవాదాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రచించిన గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ముఖ్యమంత్రి, స్పీకర్‌ల మధ్య వివాదమున్నట్టుగా ఆ పార్టీ నేతలు చర్చకు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అనే వెయ్యి తలల విషసర్పంలో ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటే, విభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్న సీఎం కిరణ్ సమైక్యవాదం వినిపిస్తారు. మరికొందరు విభజన జరిగిపోయిందంటారు. సీఎం ఒక పక్క విభజనకు అవసరమైన యావత్ సమాచారాన్నీ తన శాఖల ద్వారా కేంద్రానికి, జీవోఎంకు పంపిస్తూనే, మరోవైపు సమైక్యం కోసం అసెంబ్లీని ఆయుధంలా వాడుకోబోతున్నట్టుగా ప్రచారం చేయడం హాస్యాస్పదం..’ అని పద్మ పేర్కొన్నారు.
 
 సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు?
 కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి ‘సమైక్య తీర్మానం’ చేసి కేంద్రానికి ఎందుకు పంపడం లేదని పద్మ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచే అధికారం మీ చేతిలోనే ఉంది కనుక, కేబినెట్ నోట్ రాకముందే తీర్మానం చేయమంటే తనకు పట్టనట్టుగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, విభజనను అడ్డుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు తమకు వినపడనట్లు నటించారన్నారు. అసలు విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు. ఉద్యోగులు త్యాగాలు చేస్తూ సమైక్య ఉద్యమానికి దిగితే వారిని మభ్యపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేశారని మండిపడ్డారు. కిరణ్ వ్యవహారశైలి చూస్తుంటే హత్య చేసిన వ్యక్తే శ వం వద్ద ఏడ్చినట్లుందని ఎద్దేవా చేశారు.
 
 చంద్రబాబు చెప్పినట్టే ఆడుతోన్న కేంద్రం
 రాష్ట్రాన్ని విభజించాలని సోనియాగాంధీ నిర్ణయిస్తే, కొబ్బరికాయలా పగలకొట్టాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సలహా ఇవ్వడం సిగ్గుచేటని పద్మ అన్నారు. వాస్తవానికి విభజన విషయంలో కేంద్రం మొదటినుంచీ చంద్రబాబు చెప్పినట్టే చేస్తోందని తెలిపారు. ఢిల్లీలో చంద్రబాబు నిరాహారదీక్ష చేసిన వెంటనే జీవోఎం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాలు.. ఇలా ఆయన చేసిన డిమాండ్లన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ తలూపుతోందని చెప్పారు. ఇలా కాంగ్రెస్, టీడీపీల నేతలు కలిసిపోయి.. సమైక్యం కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న తమపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంయుక్తంగా బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. జగన్ మాదిరిగా సోనియాను విమర్శించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియాను తిడితే ఐఎంజీ కేసులో జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లుందని, అందుకే పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల పాలిట చీడపురుగుల్లా తయారయ్యారని మండిపడ్డారు.
Share this article :

0 comments: