సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు

సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు

Written By news on Thursday, November 7, 2013 | 11/07/2013

దారులన్నీ బంద్
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
రోడ్లపైనే వంటావార్పులు, మానవహారాలు, వినూత్న నిరసనలు
విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు ప్రజల మద్దతు
వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులు
నేడూ కొనసాగనున్న దిగ్బంధనం

 
సాక్షి నెట్‌వర్క్:
సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి.  వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది.  పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం బుధవారం తొలి రోజు విజయవంతమైంది. ఉదయం నుంచే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలు మిన్నంటించారు. రోడ్లపై మానవహారాలుగా నిలబడ్డారు. వంటావార్పులు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. జిల్లాల మీదుగా వెళ్లే జాతీయరహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. ఒక్కో జిల్లాలో హైవేపై కనీసంగా పాతిక, ముప్పై చోట్ల ఆందోళనలు చేపట్టారు. దీంతో జాతీయరహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. ఇక స్టేట్‌హైవేలు, పంచాయతీరాజ్ రహదారులపై వాహనాలను అటకాయించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనకు సీమాంధ్ర ప్రజ బాసటగా నిలబడింది. పల్లెప్రాంతాల్లోనూ గ్రామీణులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై పడేసి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. అంబులెన్సులు, 108 వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చిన పార్టీ శ్రేణులు మిగిలిన అన్ని వాహనాలనూ అడ్డుకున్నాయి. రాత్రి వేళ కూడా పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. రోడ్లపై కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టాయి. పార్టీ ముందుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థలు బుధవారం మూతపడ్డాయి. ఇక చాలాచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. కొన్నిచోట్ల డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులు గంటలసేపు ఆలస్యంగా ప్రయాణించాయి. రాజకీయప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ సర్కారు, కాంగ్రెస్ హడావుడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులూ సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల రోడ్లపై స్వచ్ఛందంగా వాహనాలు నిలిపి పార్టీ శ్రేణులతో కలిసి సమైక్యనినాదాలు చేశారు. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించడంతో వాహనాల డ్రైవర్లు, సిబ్బంది, ప్రయాణీకులకు పార్టీ నేతలే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయపార్టీ చేపట్టని విధంగా తొలిసారిగా 48గంటలసేపు రోడ్ల దిగ్బంధానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాదిమంది నేతలు, వేలాదిమంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును ముందే ఊహించిన పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లో రాస్తారోకోలను ఒక్కచోటకే పరిమితం చేయకుండా, బృందాల వారీగా కార్యకర్తలను పలుచోట్లకు పంపి రోడ్లను దిగ్బంధం చేపట్టారు. బుధవారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 3054 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు.
 
‘అనంత’లో ఉద్రిక్తత
అనంతపురంలో రాస్తారోకో చేస్తున్న పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. మహిళలను చూడకుండా బలంవంతంగా లాక్కెళ్లి జీపులో పడేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన తేరుకున్న తర్వాత అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసిస్తూ పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించాయి.  కనేకల్లులో పార్టీ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధర్నా చేశారు. పార్టీ కార్యకర్తలు ఎస్కేయూ వర్శిటీని బంద్ చేయించి.. 205 రహదారిని దిగ్బంధించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి చేపట్టారు. కర్నూలు నగరంలోని  తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జిని దిగ్బంధించి ఇరువైపులా రాకపోకలను స్తంభింపజేశారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 18వ నంబర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. డోన్‌లో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలువరించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 45చోట్ల రోడ్లను దిగ్బంధించారు. కడపలో కర్నూలు-చెన్నై, , కడప-రాయచోటి రహదారులపై ఉదయం 6గంటల నుంచే కార్యకర్తలు బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు గేటు ఎదుట బైఠాయించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట-తిరుపతి రహదారిని దిగ్భందించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో,రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్భందించారు.
 
తిరుమలకూ రోడ్ల దిగ్బంధం సెగ
తమిళనాడు లోని వేలూరు మార్గం, కర్నాటక నుంచి వచ్చే బస్సులు, బెంగళూరు బస్సులు నిలిచి పోవడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు కర్ణాటక సరిహద్దు వరకు వచ్చి నిలిచిపోయాయి. పుంగనూరు వద్ద ఆందోళనకారులు పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. చంద్రగిరి వద్ద జాతీయ రహదారి ట్రాక్టర్లతో నిండిపోవడంతో ఆ వైపు ఎలాంటి వాహనాలు వెళ్లలేదు. పుత్తూరు, నగరి, నాగలాపురం, నారాయణవనంలో రోడ్లను దిగ్బంధం చేయడంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి.  తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేశారు. చంద్రగిరిలో  తిరుపతి-చిత్తూరు రోడ్డుకు  50 ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు.
 
హైవేపైనే వంటావార్పు
కృష్ణాజిల్లా  జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు అడ్డరోడ్డు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదుగంటల పాటు జాతీయరహదారిని రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది.  ఇబ్రహీంపట్నంలో హైవేపైనే వంటావార్పు  నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నానిల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పామర్రులో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా  కనిగిరిలో ఉదయం 5.30 గంటలనుంచే బస్సులను  అడ్డుకున్నారు. దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట,  మంగళగిరి, పెదకాకానిల వద్ద చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై పార్టీ నేతలు, కార్యకర్తలు గంటలసేపు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర చెన్నై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలోగుంటూరు-మాచర్ల రహదారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి దిగ్బంధించారు.  గుంటూరు నగరంలో  నేతలు అంకిరెడ్డి పాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ నేత ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
రోడ్డుపైనే సాంస్కృతిక కార్యక్రమాలు
తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి వద్ద మోరంపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో ఎర్ర వంతెన వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, తదితరులు పాల్గొన్నారు.  పశ్చిమగోదావరి  జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉదయం 9 గంటల నుంచే టెంట్లు వేసి వాహనాల రాకపోకలకు అడ్డుపడటంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రత్తిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో  ఉదయం నాలుగు గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.   సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో నిర్వహించిన దిగ్బంధం వల్ల   ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా  కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)తో పాటు రాష్ట్రీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే కృష్ణదాస్  ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులో ఉదయం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనాలు గంటలతరబడి నిలిచిపోయాయి.  కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు.  జిల్లా మీదుగా వెళ్లే 16వ నెంబరు జాతీయరహదారిపై పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో గంటలసేపు వాహనాలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువు సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో, రావులపాలెం వద్ద  మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో 16వ  నంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు.
Share this article :

0 comments: