కింగ్‌మేకర్లుగా జగన్, జయ, మమత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కింగ్‌మేకర్లుగా జగన్, జయ, మమత

కింగ్‌మేకర్లుగా జగన్, జయ, మమత

Written By news on Sunday, November 17, 2013 | 11/17/2013

కింగ్‌మేకర్లుగా  జగన్, జయ, మమత
కేంద్రంలో హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు వీరి మద్దతు కీలకం
  ఏపీ సమైక్యంగా ఉంటే జగన్‌కు 30 సీట్లు  ‘డైలీ మెయిల్’ ప్రత్యేక కథనం

 
 లండన్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వస్తే పరిస్థితి ఏమిటి? ప్రతిపాదనల్లోనే ఉన్న మూడో కూటమి సాకారం కాకుండా.. యూపీఏ, ఎన్డీఏలు ఎక్కువ సీట్లు గెలుచుకుని మెజారిటీ లేక అధికార పీఠానికి చేరువలో ఉండిపోతే ఎవరు కింగ్‌మేకర్లు అవుతారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నపై రాజకీయ నాయకులు అంతే ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. హంగ్ ఫలితాలు వస్తే.. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కింగ్‌మేకర్లుగా మారి చక్రం తిప్పుతాయని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశముందంటున్నారు. ఈమేరకు వారి విశ్లేషణలతో బ్రిటన్ నుంచి వెలువడే ‘డైలీ మెయిల్’ పత్రిక శనివారం ప్రత్యేక కథనాన్ని వెలువరించింది.
 
 అందులోని ముఖ్యాంశాలు..
 42 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ నుంచి మమత, 40 స్థానాలున్న తమిళనాడు నుంచి జయ మద్దతు లేకుండా యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ మూడు రాష్ట్రాల్లోని 120కిపైగా సీట్లు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానున్నాయి. ఏపీలో అశేష ప్రజాదరణతో ముందుకు దూసుకెళ్తున్న జగన్ పార్టీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుంది. ఏపీ సమైక్యంగా ఉంటే వైఎస్సార్‌సీపీకి 30కిపైగా సీట్లు దక్కుతాయి. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 25 సీట్లకుగాను 15 నుంచి 18 సీట్లు అత్యంత సులభంగా వస్తాయి. దీంతో కేంద్రంలో సర్కారు ఏర్పాటులో జగన్ పాత్ర కీలకం అవుతుంది. ఇక బెంగాల్లో ఇటీవలే స్థానిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తృణమూల్ కూడా గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది.
 
 తమిళనాడులో జయ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ పార్టీల మద్దతూ కీలకంగా మారుతుంది. ఎన్నికల తర్వాత జయ, మమతలు యూపీఏ, ఎన్డీఏల్లో దేనివైపు మొగ్గుతారనేదానిపైనా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్న జయ.. యూపీఏతోనూ దోబూచులాడుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆమె ప్రధాని మన్మోహన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడం, ఇటీవల ఇద్దరు కేంద్రమంత్రులు పాల్గొన్న సభలకు తన కేబినెట్ మంత్రులిద్దరు వెళ్లడానికి అభ్యంతర చెప్పకపోవడం దీనికి రుజువంటున్నారు. యూపీఏతో గొడవపడి తెగతెంపులు చేసుకున్న మమత బీజేపీకి  దగ్గరయ్యే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింల మద్దతు పోగొట్టుకోవడానికి ఆమె సిద్ధపడకపోవచ్చని, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వంటి అవసరాల కోసం జాగ్రత్తగా పావులు కదుపుతారని విశ్లేషిస్తున్నారు.
Share this article :

0 comments: