అడుగడుగునా ప్రతిఘటిస్తాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా ప్రతిఘటిస్తాం!

అడుగడుగునా ప్రతిఘటిస్తాం!

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

అడుగడుగునా ప్రతిఘటిస్తాం!
రాష్ట్ర విభజనకు సంబంధిత శాసనసభతో పాటు పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీని తప్పనిసరి చేయాలి. అలాంటి రాజ్యాంగ నిబంధన లేకపోవడం వల్ల ఓట్ల కోసం, సీట్ల కోసం కేంద్రం బలమైన రాష్ట్రాలను చీల్చి బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుకట్ట వేయక తప్పదు.
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విధివిధానాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసినలేఖ సంక్షిప్తపాఠాన్ని ‘సాక్షి’ బుధవారం నాటి సంచికలో (13.11. 13) అందించాం. ‘విభజనతో అంతా చేటే’ అనే శీర్షికతో అది ప్రచురితమైంది. అందులో ఇవ్వలేకపోయిన కొన్ని ముఖ్యాం శాలను ఈ రోజు అందిస్తున్నాం...
 
 రాష్ట్ర విభజనకు సంబంధించిన వివిధ అంశాలపై మా అభిప్రాయాలను తెలపాలని మీరు కోరారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శికి నవంబర్ 3, 2013న మాపార్టీ వైఖరిని తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తు న్నాం. రాష్ట్ర విభజనకు సంబంధించి మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని విస్పష్టంగానూ, దృఢసంకల్పంతోనూ కోరుతున్నాం. రాష్ట్ర విభజన దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలను మా సకల శక్తులూ ఒడ్డి అడుగడుగునా ప్రతిఘటిస్తాం.
 
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత మూడున్నర నెలలుగా రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు అపూర్వమైన రీతిలో శాయశక్తులా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంగానీ, అధికారంలోని కాంగ్రెస్ పార్టీగానీ ప్రజల మనోభావాలను గౌరవించి, మన్నించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాస్వామికమైన ఆ ప్రజాందోళనలకు స్పందించడంగానీ, కేంద్ర నిర్ణయాన్ని సమీక్షించడంగానీ మంత్రుల బృందం ఏర్పాటు ఉద్దేశం కాదు. ఏదేమైనా, రెండు ప్రాంతాలకు ఎంతటి అపారం నష్టం వాటిల్లినా పట్టించుకోకుండా రాష్ట్ర విభజనపై ముందుకు పోవాలనే కేంద్రం భావిస్తోందనేది స్పష్టమే. రాష్ట్ర జనాభాలోని 75 శాతం ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించ నిరాకరిస్తున్న కేంద్ర వైఖరిని చూస్తుంటే మాకు నోట మాట రావడం లేదు.
 
 ఏపీని విభజించాలనే నిర్ణయానికి కేంద్రం రావడానికి ఉన్న రాజ్యాంగపరమైన ప్రాతిపదిక ఏమిటి? సమాచార హక్కు చట్టాన్ని తెచ్చామని యూపీఏ ఘనంగా చెప్పుకుంటోంది. రాష్ట్ర విభజన విషయానికి వచ్చే సరికి అది ప్రజాస్వామికంగానూ, పారదర్శకంగానూ ఒక్క అడుగైనా వేయలేకపోయింది. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నంత మాత్రాన నిర్దిష్టమైన ప్రాతిపదికగానీ, హేతుబద్ధతగానీ లేకుండానే ఇలా ఏపీని విభజించవచ్చా? రాజకీయ ఉద్దేశాలతో, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కేంద్రం... ఆంధ్రప్రదేశ్ 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) చేసిన ప్రతిపాదనల మేరకు జరి గిన పునర్వ్యవస్థీకరణతో ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రమని విస్మరించింది. దేశానికి స్వతంత్రం లభించిన 66 ఏళ్ల తర్వాత, 63 ఏళ్లుగా రాజ్యాంగం అమల్లో ఉన్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏకీకరణ జరిగిన 57 ఏళ్ల తర్వాత... ప్రాంతాల మధ్య పుల్ల బెట్టి, ఓట్లూ సీట్లూ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రం రాష్ట్ర విభజనకు నిర్ణయించ వచ్చా? అది న్యాయమేనా? ఏపీ విభజన విషయంలో దేశంలో ఇంతవరకు ఏర్పడ్డ 28 రాష్ట్రాల విషయంలో పాటించిన ఉత్తమ సంప్రదాయాల నుంచి కేంద్రం ఎందుకు వైదొలగుతోంది? రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోవాలని, తీర్మానాన్ని ఆమోదించాలని మీరు ఎందుకు కోరుకోవడం లేదు?  
 
 ఈ సందర్భంగా 1956లో నాటి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌గా ఎలా విలీనమయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోవడం అవసరం. ఆ రెండు శాసనసభలు విడివిడిగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాయి. 174 మంది సభ్యులుగల హైదరాబాద్ శాసనసభలో తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొన్నవారు 147 మంది. అందులో 103 మంది విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటుకు అంగీకరించారు. విశాలాంధ్ర ఏర్పాటు కావాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ పుత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి, ఆ తీర్మానం నెగ్గడానికి తోడ్పడ్డారు. అదేవిధంగా ఆంధ్ర శాసనసభ కూడా విశాలాంధ్ర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
 
 రెండు రాష్ట్రాల శాసనసభల్లో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఏపీ రాష్ట్రాన్ని నేడు ఏ ప్రాతిపదికపై చీల్చాలని భావిస్తున్నారు? 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటు వేదికపై నుంచి చేసిన ఉపన్యాసాన్ని (రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని విస్పష్టంగా ప్రకటిస్తూ) సైత ం వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఆనాడు ఇందిర ఇలా అన్నారు: ‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలు పోరాటం సాగించారంటే అందుకు ప్రేరణ బహుశా తెలుగువారి సుదీర్ఘ చరిత్రే కావాలి. ఈ సందర్భంగా నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్పమంటారా? ఎస్సార్సీ నివేదికను బహిరంగంగా విడుదల చేయడానికి సరిగ్గా ముందు నేను దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుం డటం జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా వినవచ్చిన నాడు విశాలాంధ్ర నినాదాలు నేటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి... పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతధంగా ఉంచాలన్న కొందరి వాంఛను ఆనాడు జయించినది నిజానికి తెలుగు ప్రజల ఆకాంక్షే.’’
 
 నాటి ఇందిర ప్రసంగాన్నేగాక నేటి శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రథమ ప్రాధాన్యంగా చేసిన సూచనను సైతం విస్మరించి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించింది. ఇది ఎలాంటి వైఖరి? తెలంగాణ ప్రాంతంలోని 17 పార్లమెంటు సీట్లలో అధిక భాగాన్ని చేజిక్కించుకునే లక్ష్యమే కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను ఏపీ విభజనకు పురిగొల్పిన చోదకశక్తి. ఎస్సార్సీ ప్రతిపాదనల మేరకు భాషా ప్రతిపదికపై పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన రాష్ట్రాలను కేంద్రంలోని అధికార పార్టీలు తమ ఇష్టానుసారంగా, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించకుండా చూడటం అవసరం. రాష్ట్ర విభజనకు సంబంధిత శాసనసభతో పాటూ పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీని తప్పనిసరి చేయాలి. అలాంటి రాజ్యాంగ నిబంధన లేకపోవడం వల్ల జనాభాపరమైన సెంటిమెంట్లను వాడుకొని ఓట్ల కోసం, సీట్ల కోసం కేంద్రం బలమైన రాష్ట్రాలను చీల్చి బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుకట్ట వేయక తప్పదు.   
Share this article :

0 comments: