త్వరలో సమైక్య శంఖారావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో సమైక్య శంఖారావం

త్వరలో సమైక్య శంఖారావం

Written By news on Thursday, November 14, 2013 | 11/14/2013

త్వరలో సమైక్య శంఖారావం
సమైక్యాంధ్ర కోసం కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్ర: జగన్
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలో సమైక్య శంఖారావం పూరించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టబోయే ఈ సమైక్య శంఖారావం యాత్ర రాష్ర్టవ్యాప్తంగా సాగుతుందని తెలిపారు. దారి మధ్యలో ఓదార్చాల్సిన కుటుంబాలను ఓదారుస్తూ త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ప్రజలనుద్దేశించి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీ వివాహానికి జగన్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
 
దారి మధ్యలో రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇక్కడ జక్కంపూడి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు నేను అనుకోని పరిస్థితుల్లో కుట్రలు, కుతంత్రాల మధ్య జైలుపాలయ్యాను. అందువల్లే రాలేకపోయాను. మీ ఆప్యాయతలు, దేవుని చల్లని ఆశీస్సులతో మళ్లీ మీ అందరి ప్రేమానురాగాలు పొందేందుకు మీ మధ్యకు రాగలిగాను’’ అని అన్నారు. త్వరలోనే సమైక్య శంఖారావం పూరిస్తూ ఇక్కడకు వస్తానని చెప్పారు.
 
జగన్‌కు జన నీరాజనం..
ఏడాదిన్నర తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు మధురపూడి చేరుకున్న తమ అభిమాన నేతకు స్వాగతం చెప్పడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. మధురపూడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి కంబాల చెరువు సెంటర్‌కు చేరుకునేందుకు ఏకంగా నాలుగున్నర గంటల సమయం పట్టింది. దారిపొడవునా వేలాదిగా జనం బారులు తీరారు. మహిళలు అడుగడుగునా మంగళ హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. పెద్ద సంఖ్యలో యువకులు మోటారు బైకులపై ర్యాలీగా వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. పిల్లాపాపలతో సహా జనమంతా రోడ్లపైకి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. తనను చూసేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
 
 కంబాల చెరువు సెంటర్‌లో జక్కంపూడి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత జగన్ జక్కంపూడి విజయలక్ష్మి నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన జక్కంపూడి తనయ సింధుసహస్ర-భుజంగరాయుడు దంపతులను ఆశీర్వదించారు. తర్వాత అక్కడ్నుంచి కాకినాడ చేరుకొని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. జగన్ వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు గంపల వెంకట రమణ, జ్యోతుల నెహ్రూ, పార్టీ నేతలు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాతపాటి సర్రాజు, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరిజాల వెంకట స్వామినాయుడు తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: