విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి

విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి

Written By news on Friday, November 1, 2013 | 11/01/2013

విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి
విభజన నరకాసురుల దిష్టిబొమ్మలు తగులబెట్టాలని వైఎస్సార్‌సీపీ పిలుపు
1వ తేదీ ఉదయం సమైక్య తీర్మానాలు చేయాలి
ఆ మేరకు ప్రధానికి ఈమెయిల్స్ పంపాలి
6, 7 తేదీల్లో 48 గంటలపాటురహదారుల దిగ్బంధం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. మెజారిటీ ప్రజల అభీష్టానికి నిలువెత్తు పాతర వేస్తూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు నిరసనగా శుక్రవారం రాత్రి విభజన నరకాసురుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఒక బలమైన రాష్ట్రాన్ని నిరంకుశంగా విడగొట్టాలని చూస్తున్న సోనియాగాంధీ, విభజనకు లేఖనిచ్చి సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పదవిని పట్టుకుని వేలాడుతూ డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు ఆజ్యం పోసిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉదయం గ్రామసభలు ఏర్పాటు చేసి అందులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని కూడా పార్టీ కోరింది.
 
  ఆ తీర్మానాలను ప్రధానమంత్రికి ఈమెయిల్స్ ద్వారా పంపాలని సూచించింది. అదేరోజు రాత్రి 7 గంటల తరువాత నరక చతుర్ధశి రోజున నరకాసురుని వధించిన విధంగా విభజన నరకాసురులను కూడా బాణసంచాతో కూడిన దిష్టిబొమ్మలతో దగ్ధం చేయాలని పార్టీ కోరింది. ఈ నిరసన కార్యక్రమాలు ఊరూరా, వాడవాడలా చేసి కేంద్రానికి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని మైసూరా కోరారు. కాగా విభజనపై చర్చించడానికి నవంబర్ 7న కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నిర్వహిస్తున్న సమావేశానికి నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని కూడా పార్టీ పిలుపునిచ్చింది.
 
 మహిళలు క్రియాశీలంగా పాల్గొనాలి
 నరకాసురునితో యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాక్షసుడిని వధించడంలో కీలక పాత్ర వహించింది సత్యభామే కనుక ఈ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంలో మహిళలే చురుగ్గా పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి కోరారు.
 
 సమైక్య దినంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య దినంగా పాటించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగే ఈ ఉత్సవంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
Share this article :

0 comments: