జగన్ ఒక్కడే ఒక సైన్యం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఒక్కడే ఒక సైన్యం!

జగన్ ఒక్కడే ఒక సైన్యం!

Written By news on Thursday, November 21, 2013 | 11/21/2013

జగన్ ఒక్కడే ఒక సైన్యం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం రాజకీయాలలో తలపండిన వారిని సైతం ఆశ్చర్య పరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర  పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వామపక్ష, బీజేపీ పార్టీ నేతల్ని ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీని కొలకత్తాలో కలిసిన జగన్, త్వరలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని కలవనున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, అఖిలేశ్ యాదవ్‌ని నేడు (గురువారం) కలవాల్సి ఉండగా, ఆ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది.

ఏదిఏమైనా, సంఖ్యాపరంగా చూస్తే, నామినేటెడ్ సభ్యులిద్దరితో కలిపి 545 మంది ఉండే లోక్‌సభలో తనతో కలిపి ఇద్దరు (మరొకరు మేకపాటి రాజమోహన రెడ్డి) మాత్రమే ఉన్న అతి చిన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అయిన జగన్, 203 ఎంపీల బలంతో, రాజకీయపుటెత్తులు, రణతంత్రపు జిత్తులతో చలాయించుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకీ, దాని నేతృత్వంలోని యుపిఎ కూటమికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేస్తుందని, రేపు డిల్లి గద్దె మీద యువరాజు రాహుల్ గాంధీని కూర్చోబెట్టడానికే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పూనుకున్నారని జగన్ పదే పదే చాటారు. రాష్ట్రాలను తన ఇష్టారాజ్యంగా విభజించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా  చేజిక్కించుకోబోతున్న కాంగ్రెస్‌ వైఖరిలోని అప్రజాస్వామ్యాన్ని జాతీయ పార్టీల దృష్టికి ఆయన తీసుకు వచ్చారు.

 25 మంది సభ్యుల వామపక్ష కూటమిలో, 16 మంది సభ్యుల సిపీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. నలుగురు సభ్యులున్న సిపీఐకి రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగ పరిస్తే అవకాశాలపై జగన్ వెలిబుచ్చిన ఆందోళనని ఆ పార్టీ అర్థం చేసుకోవడమే కాకుండా, అటువంటి దుర్వినియోగాన్ని తప్పకుండా అడ్డుకుంటామని జగన్‌కు హామీ ఇచ్చింది.

ఇంతకు మించి జగన్ సాధించిన మరో ముఖ్యమైన విజయం, ప్రత్యేక తెలంగాణాకు మొదటుంచీ సుముఖంగా ఉన్న బీజేపీని పునరాలోచన దిశగా మళ్లించడం. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి అనుకూలం అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాని వేరు చేయడం వెనక కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని జగన్ వాదనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్, వారిరువురి సమావేశ సందర్భంగా అంగీకరించారు. ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా, 133 మంది సభ్యుల బలం ఉన్న ఎన్‌డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ (117 ఎంపీలు) మద్దతు ఉంటే, తెలంగాణ విభజన తేలిగ్గా చేసేయవచ్చని తలపోస్తున్న కాంగ్రెస్సుకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఇదిలా ఉండగా, ఏ కూటమిలో లేని 19 మంది ఎంపీల తృణమూల్‌ కాంగ్రెస్ దన్ను పొందటం, ‘జగన్ వెనకే మేము’ అని మమతాబెనర్జీ అంతటి ఫైర్ బ్రాండ్ చేతే అనిపించుకోవడం డిల్లీలో పెద్దలకి మింగుడు పడటం లేదు.

యుపిఎ కూటమికి బైటనుచి సహకరిస్తున్న సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ యువరాజు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని జగన్ కలవడం అనూహ్యమైన పరిణామం కాకపోయినా, ఈ విషయంలో జగన్ వ్యూహం వేరని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇటీవల బెంగుళూరులో జరిగిన కార్యక్రమానికి తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌, ఇతర నేతలతో కలిసి హాజరయిన సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ, తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించబోమని కరాఖండిగా చెప్పారు. అదే సందర్భంలో, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. నిజానికి, కిరణ్ అధిస్ఠానం అడుగుజాడల్లోనే నడుస్తూ, విభజన ప్రక్రియ వేగవంతం కావడానికి చక్కని ఉత్ప్రేరకంగా, బహు విధేయంగా నడుచుకుంటున్న విషయం సమాజ్ వాదీ పార్టీ అధినాయకులకు తెలియదు. కిరణ్ ప్రకటనలు ఒట్టి కాగితపు పులి గాడ్రింపులేనని, వాటి వెనక కాంగ్రెస్ మంత్రాంగం ఉందనీ సమాజ్ వాదీ పార్టీ నేతలకి, ముఖ్యంగా అఖిలేష్ కు విడమరిచి చెప్పడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్నో పర్యటనలో మరో ముఖ్యోద్దేశ్యమని తెలుస్తోంది.  జగన్ తన వ్యూహరచనలో, దాన్ని అమలు చేస్తున్న తీరులో కనబరుస్తున్న పరిణితికి రాజకీయ విశ్లేషకులు ముక్కన వేలేసుకుంటుంటే, తెలంగాణా బిల్లు ఇక తెల్లారినట్టేనని విభజనవాదులు భయపడుతున్నారు.
Share this article :

0 comments: