జాబితాలో పేరు లేకపోతే జనవరి 17 నుంచి మళ్లీ దరఖాస్తు చేసుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జాబితాలో పేరు లేకపోతే జనవరి 17 నుంచి మళ్లీ దరఖాస్తు చేసుకోండి

జాబితాలో పేరు లేకపోతే జనవరి 17 నుంచి మళ్లీ దరఖాస్తు చేసుకోండి

Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013

కొత్తగా ఓటర్ నమోదుకు 30 లక్షల దరఖాస్తులు
జనవరి 16న ఓటర్ల తుది జాబితా
కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి
ఆ జాబితాలో పేరు లేకపోతే జనవరి 17 నుంచి మళ్లీ దరఖాస్తు చేసుకోండి
పేరు లేని వారికి వచ్చే ఎన్నికల నామినేషన్
చివరి తేదీ వరకు అవకాశం కల్పిస్తాం
ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై సంతృప్తి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్‌గా నమోదు కోసం కొత్తగా 30,98,445 మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి తెలిపారు. ఇందులో అర్హులైనవారందరికీ జనవరి 16వ తేదీకల్లా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియ, వచ్చే సాధారణ ఎన్నికలకు సంసిద్ధతకు సంబంధించి వినోద్ జుత్సి సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత పట్ల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లు తీసుకున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లుగా నమోదుకు చివరి తేదీ అయిన సోమవారం వరకు కొత్తగా ఓటర్‌గా నమోదుకు 30,98,445 దరఖాస్తులు వచ్చాయన్నారు. అలాగే జాబితా నుంచి పేర్లు తొలగింపునకు 1,31,415 దరఖాస్తులు... పేర్లు, చిరునామాల్లో సవరణలకు 4,17,607 దరఖాస్తులు... ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి పేర్లు బదిలీకి 54,488 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ దరఖాస్తులన్నింటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
 
పేరు లేకపోతే జనవరి 17 నుంచి మళ్లీ దరఖాస్తు

ఓటర్ల తుది జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ప్రతి ఒక్కరు చూసుకోవాలని జుత్సి కోరారు. జాబితాలో పేరు లేకపోతే ఓటు వేయడానికి అవకాశంలేదని అసంతృప్తి చెందాల్సిన పనిలేదని, జనవరి 17 నుంచి మళ్లీ ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు వచ్చే ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సమయం ఉంటుందని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌కు రెండు లేదా మూడు రోజుల ముందుగానే బూత్ స్థాయి ఆఫీసర్ల ద్వారా ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్‌ల పంపిణీని కమిషన్ చేపడుతుందని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా ఈ స్లిప్ ఉంటే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ రోజు వెనుకబడిన, మురికివాడల్లోని ఓటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వ్యయానికి సంబంధించి షాడో రిజిస్టర్‌ను నిర్వహించనున్నామని తెలిపారు.

ఓటు చూసుకునే విధానం ప్రయోగాత్మకంగా అమలు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ఓటు వేసిన వారికి పడిందా లేదా అనేది చూసుకుని సంతృప్తి చెందడానికి ‘ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ పేపర్ ట్రే’ విధానాన్ని అమలు చేయనున్నట్లు జుత్సి తెలిపారు. ఈ విధానంలో ఓటు ఏ అభ్యర్థికి వేశారో ఆ పేరు, సింబల్, ఓటర్ సంఖ్య ఓటింగ్ యంత్రంలో ఏడు సెకన్ల పాటు డిస్‌ప్లే అవుతుందని చెప్పారు. గతంలో నాగాలాండ్, మిజోరం, ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో  ఆ విధానం అమలు చేస్తారనేది ఆ ఓటింగ్ యంత్రాలు లభ్యత ఆధారంగా కమిషన్ నిర్ణయిస్తుందని ఆయన వివరించారు.  ఎన్నికల ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై వచ్చే నెలలో మళ్లీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు చేసిన న్యాయమైన సూచనలు, సలహాలను అమలు చేస్తామని తెలిపారు. నామినేషన్లకు ముందే రాజకీయ పార్టీల ఏజెంట్లకు నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నియమావళి, అభ్యర్థుల వ్యయం, ఎన్నికల విధానాలను వర్క్ షాపు నిర్వహించడం శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.

ఓటర్ల స్లిప్‌ల పంపిణీ కీలకం

సినిమా టికెట్ ఇస్తే ఎవరైనా తప్పకుండా సినిమాకు వెళ్తారని, అలాగే పోలింగ్ రోజు ముందే ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్‌ను పంపిణీ చేస్తే తప్పకుండా ఓటు వేస్తారని జుత్సి అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువకు ఇదీ ఒక కారణమని కలెక్టర్లకు వివరించారు. అందువల్ల పోలింగ్‌కు ముందే ఓటర్లందరికీ ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను నూటికి నూరు శాతం మందికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
Share this article :

0 comments: