నాడు కళ్లు మూసుకొని నేడు కన్నెర్ర! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు కళ్లు మూసుకొని నేడు కన్నెర్ర!

నాడు కళ్లు మూసుకొని నేడు కన్నెర్ర!

Written By news on Sunday, December 8, 2013 | 12/08/2013

నాడు కళ్లు మూసుకొని నేడు కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి అంతుబట్టక కాంగ్రెస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామంటూ సీఎం తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు అంతుబట్టడంలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయం మాత్రమే చెప్పగలదే తప్ప.. దానిని అడ్డుకోవడం, ఓడించడం అన్న ప్రసక్తే ఉండదని తెలిసినప్పటికీ కిరణ్ ఎందుకు గందరగోళపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. జూలై 30న రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం ఆమోదిం చింది మొదలు ఇప్పటి వరకు పలుసార్లు విభజనను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆచరణలో అందుకు భిన్నంగా సాగుతున్న వ్యవహారాలను బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు అంతా ఒక పథకం ప్రకారమే సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 నిజానికి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే దాన్ని అడ్డుకోవడానికి ఎన్నో అవకాశాలు, మార్గాలు ఉన్నప్పటికీ అప్పుడు ఆచరణలో పెట్టకుండా చివరి వరకు అనేక అంశాలను ముందుపెడుతూ కిరణ్ నెట్టుకొస్తున్నారన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది.
 
 తెలంగాణపై కోర్ కమిటీ చర్చ మొదలు తాజాగా ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించే మొత్తం క్రమంలో అడ్డుకోవడానికి అనేక సందర్భాలను కాదని చివరి దశలో బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని సీఎం చెప్పడం వ్యూహాత్మక వైఖరిగా భావిస్తున్నారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదించిన సమయంలోనే రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే మొత్తం ప్రక్రియ వెనక్కి వెళ్లేదని, అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనా మా చేయాల్సిన అవసరం లేదని, ఏదో ఒక చోట అడ్డుకుంటామని భరోసా కల్పిస్తూ సీఎం సంక్షోభం రాకుండా చేశారు.
 సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ఉద్యోగులు, సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టిన దశలో కూడా సీఎం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టిన దశలో అసెంబ్లీలో బిల్లును ఓడిస్తామని చెప్తూ కాలయాపన చేశారు. అయితే బిల్లుపై ఓటింగ్ ఉండదని, కేవలం అభిప్రాయం మాత్రమే కోరుతారని తెలిసిన తర్వాత.. రాజ్యాంగంలో ఆర్టికల్ 371(డీ) ఉందని, అది ఉన్నంత కాలం రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరని చెప్తూ వచ్చారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం, దాన్ని యథాతథంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, ఆ తర్వాత జీవోఎం ఏర్పాటు, జీవోఎం నివేదిక సమర్పణ,  ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం వరుస క్రమంలో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుండగా.. గడిచిన నాలుగు నెలల కాలంలో ప్రతి చోటా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ద్వారా ప్రక్రియను అడ్డుకోవడానికి అవకాశం ఉంది.
 
 అయితే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక మెలిక పెడుతూ చివరకు బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి పంపే వరకు సాగదీయడం వెనుక ఏదో మతలబు ఉందన్న భావన కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడే అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఆ రోజు ఆ రకంగా తీర్మానం ఆమోదించి పంపించగలిగితే విభజన ప్రక్రియపై కాంగ్రెస్ ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట పడేదని, అసెంబ్లీ సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేసిన తర్వాత విభజన నిర్ణయం తీసుకుంటే అభాసుపాలవుతామని కాంగ్రెస్ భయపడి వెనక్కి తగ్గేదని.. అప్పట్లో పలువురు మంత్రులు స్వయంగా కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌కు వివరించారు. అయితే.. దానివల్ల ప్రయోజనం ఉండదని, మనం వేరే రకంగా అడ్డుకుంటామని సీఎం సర్దిచెప్పి పంపిన విషయాన్ని ఇప్పుడు ఆ మంత్రులే గుర్తుచేస్తున్నారు.
 
 అలాగే ఉద్యోగ సంఘాలన్నీ ఉధృతంగా సమ్మెను కొనసాగిస్తున్న సమయంలో వారి సమ్మెకు రాజకీయ పార్టీలన్నీ మద్దతుగా నిలిచినా విభజన ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ఆగిపోయేదే. అయితే ఈ విషయంలో ఉద్యోగుల సమ్మె రాజకీయ మలుపు తిరక్కుండా కిరణ్ ఆయా సంఘాల ప్రతినిధులను వేరువేరుగా చర్చలకు పిలిచి 371(డీ) ని ఒక ఆయుధంగా చూపించి విభజన జరగదని చెప్తూ వారిని సమ్మె విరమింపజేశారు. తీరా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ముసాయిదా బిల్లుతో అసలు 371(డీ) అన్నది పెద్ద అడ్డంకే కాదని తేలిపోయిందని ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. విభజనను అడ్డుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడమో లేదా జేఏసీ ఆధ్వర్యంలోనో.. విభజించాలన్న కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా లేఖలు రాసి కేంద్రానికి పంపాలన్న ప్రతిపాదనను కూడా అప్పట్లో కిరణ్ వ్యతిరేకించారు. తీరా కేంద్ర కేబినెట్ ముసాయిదా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై చర్చించడానికి సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ కాగా.. విభజనను అడ్డుకోవడానికి మిగిలిన పార్టీలను సైతం కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కిరణ్ చెప్పడంతో నేతలు విస్మయం చెందారు. ఈ రకంగా విభజన ప్రక్రియ మొదలైన తొలి రోజుల్లో వచ్చిన ప్రతి ప్రతిపాదననూ తోసిపుచ్చిన సీఎం ఇప్పుడు అన్ని పార్టీలతో కలిపి అవసరమైతే ఒక జేఏసీలా ఏర్పడి ముందుకు వెళ్లాలని చెప్పడమేంటని ఒక మంత్రి పెదవి విరిచారు. ఈ రకంగా సీఎం అనుసరిస్తున్న వింత వైఖరితో పార్టీలో ఉండాలో బయటకు వెళ్లి భవిష్యత్తు చూసుకోవాలో తేల్చుకోలేక కాంగ్రెస్‌లో నలిగిపోతున్నామని ఓ సీనియర్ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కిరణ్ బాటలో నడవాలంటే చివరకు ఎటూ కాకుండా పోతామేమోనన్న భయం పట్టుకుందని వాపోతున్నారు.
 
 విభజన ప్రక్రియలో కిరణ్ తొలి నుంచి వేస్తున్న అడుగులు, వ్యవహరించిన తీరును లోతుగా గమనిస్తే.. సరిగ్గా కార్యాచరణలోకి దిగాల్సిన సమయంలో దిగకుండా అడ్డుకోవలసిన మంచి అవకాశం ఉన్నా వాటిని వదులుకుని చివరకు బిల్లు అసెంబ్లీకి వచ్చే వరకు చూడటంలో ఒక ఎత్తుగడ ఉంద న్న వాదన బలపడుతోందని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఈ రకంగా మొత్తం ప్రక్రియను చివరి దశ వరకు తెచ్చి ఇప్పుడు బిల్లు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో చివర్లో మాత్రం ఆయనొక్కరే సమైక్య చాంపియన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాలకు చెందిన ఒక కీలక నేతతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, అందుకు అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా విభజనను వ్యతిరేకించి కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి పూర్వరంగంగానే ఇదంతా చేశారన్న ప్రచారానికి బలం చేకూరుతోందని కిరణ్ వ్యవహార శైలిని దగ్గరుండి గమనిస్తున్న ఒక నేత విశ్లేషించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని సర్వేలు తేలుస్తున్న నేపథ్యంలో.. కొత్త పార్టీ ద్వారా ఎన్నికలకు వెళ్లి, ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో కలిసిపోయే ఎత్తుగడ ఉన్నట్లు కూడా కాంగ్రెస్ నేతల్లో బలంగా వినిపిస్తోంది.
Share this article :

0 comments: