అధికారమున్నా.. ఉచిత సలహాలా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారమున్నా.. ఉచిత సలహాలా!

అధికారమున్నా.. ఉచిత సలహాలా!

Written By news on Sunday, December 22, 2013 | 12/22/2013

అధికారమున్నా..  ఉచిత సలహాలా!
అఖిలపక్షంతో ప్రధాని వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి అసంతృప్తి
ట్రిబ్యునళ్ల వల్ల జరిగే అన్యాయాలపై చట్టం తేవచ్చని ప్రధానికి తెలియకపోవడం మనకు శాపం


కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన అన్యాయంపై అఖిలపక్షాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు తీసుకెళ్లింది ఆయన నుంచి ఉచిత సలహా తీసుకోవడం కోసమా? అని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీలో అఖిలపక్షం నివేదిస్తే అన్నీ విన్న ప్రధాని, ‘మీ మాటల్లో సారాంశం ఉంది.. సుప్రీంకోర్టుకు వెళ్లి గట్టిగా వాదించండి..’ అని చెప్పారన్నారు. ‘ఈ సలహా కోసమేనా ఆయన వద్దకు సీఎం కిరణ్ అన్ని రాజకీయ పక్షాలను తీసుకెళ్లింది? ఎందుకు వెళ్లారు.. ఎందుకు వచ్చారు? అక్కడ చేసిందేమిటో... అంతా అయోమయంగా ఉంది’ అని విమర్శించారు.
ప్రధాని తనకు ఉన్న అధికారాలను కూడా మరిచి ఈ సందర్భంలో మాట్లాడారన్నారు. రాజ్యాంగంలోని 262 అధికరణ కింద ఇలాంటి ట్రిబ్యునళ్లు, విచారణ సంస్థల వల్ల ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు భావిస్తే వాటిని సరిచేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావచ్చని ప్రధానికి తెలియకపోవడం మన రాష్ట్రానికి శాపంగా ఉందన్నారు. సీఎం ప్రజలను మభ్యపెడుతూ కేంద్రానికి సహకరించేందుకే అఖిలపక్షం డ్రామాను నడిపించారని, ఆయన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని మండిపడ్డారు. స్టార్ బ్యాట్స్‌మెన్ అని చెప్పుకుంటూ రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలికిన కిరణ్ రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన పది గంటల్లోపే అసెంబ్లీకి పంపి తన నైజాన్ని చాటుకున్నారన్నారు. ఇపుడు అఖిలపక్షం విషయంలో కూడా ఇలాగే చేశారన్నారు.

 అశోక్‌బాబు అందరినీ ఒకేగాట కట్టేస్తే ఎలా?

 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్న వైఎస్సార్ సీపీని, విభజనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలను ఒకే గాటన కట్టేయడం ఏ మాత్రం సరికాదని మైసూరా అన్నారు. ఎన్జీవోల నేత అశోక్‌బాబు వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించినపుడు.. విభజనకు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్, విభజనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్నది చంద్రబాబు, అలాంటపుడు సమైక్యం కోరుకుంటున్న వైఎస్సార్ సీపీ వారితో ఎలా వేదికను పంచుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ, చంద్రబాబు విభజన విషయంలో వారి విధానం మార్చుకున్నారా? అశోక్‌బాబు వీరితో ఏమైనా మాట్లాడారా? అని మైసూరా అన్నారు.
తాను చెప్పిందే పార్టీ విధానం, తాను విభజనకే కట్టుబడి ఉన్నానన్న చంద్రబాబును ఉటంకిస్తూ ఒక పత్రికలో ప్రచురితమైన వార్తను మైసూరా చూపిస్తూ.. ఆ పార్టీకి చెందిన ఎవరైనా నాయకులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన పార్టీ విధానంలో మార్పు వచ్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. సమైక్యం కోసం సమావేశం నిర్వహిస్తున్నపుడు అందులో పాల్గొనడానికి వచ్చే ముందు ఆయా పార్టీలు సమైక్యానికి అనుకూలమనే విధానం ప్రకటించాలని అశోక్‌బాబు షరతు విధించాల్సిందని అన్నారు. ఎన్జీవోలతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని, వారి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవని చెప్పారు.
Share this article :

0 comments: