కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వమే.. శరవేగంగా విభజనకు సర్వం సిద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వమే.. శరవేగంగా విభజనకు సర్వం సిద్ధం

కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వమే.. శరవేగంగా విభజనకు సర్వం సిద్ధం

Written By news on Wednesday, December 25, 2013 | 12/25/2013

* రెండు రాష్ట్రాలకు ఆస్తులు, సంస్థల పంపిణీ క్రోడీకరణలో 56 రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బిజీ
* 10 మంది ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, 30 మంది ముఖ్య కార్యదర్శులు,
* ఇంకో 10 మంది కార్యదర్శులు, వారి సిబ్బంది మొత్తం విభజన లెక్కల్లోనే..
* ఆస్తులు-అప్పుల పంపిణీపై ఆర్థికశాఖ ప్రత్యేక నమూనా పత్రం
* హైదరాబాద్, రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై కుస్తీ
* నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పుల పంపకాలపై కసరత్తు
* విద్య, ఉపాధి అవకాశాలపై ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృషి
* నదీజలాలపై సాగునీటిశాఖ; విద్యుత్, జెన్‌కోపై ఇంధనశాఖ బిజీ
* శాసనమండలి స్థానాలు, సభ్యుల కేటాయింపుపై సీఈఓ కసరత్తు
* ప్రతిరోజూ సీఎస్ పేషీ సమీక్ష.. అటకెక్కిన సాధారణ పరిపాలన
* ఉద్యోగులంతా సర్వీసు, స్థానికత వివరాలు నింపే పనిలో నిమగ్నం
* విభజనను అడ్డుకుంటామంటున్న సీఎం కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వమే.. శరవేగంగా విభజనకు సర్వం సిద్ధం చేస్తున్న వైనం
 
సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని.. అసెంబ్లీలో విభజన బిల్లును ‘ఒడిస్తా’మని ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని.. జరగనివ్వబోమని ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ.. మరోవైపు అదే ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం.. విభజన ప్రక్రియ అమలు కోసం పాలనాపరమైన భూమికను ఆగమేఘాల మీద పూర్తిచేస్తోంది.

సాధారణ పరిపాలన వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టేసి.. విభజనకు సంబంధించిన లెక్కలు తేల్చే పనిలో తలమునకలైపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రభుత్వ యంత్రాంగంలోని మొత్తం 56 శాఖలూ.. వాటికి సంబంధించిన 10 మంది ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, 30 మంది ముఖ్య కార్యదర్శులు, మరో 10 మంది కార్యదర్శులతో పాటు, వారి నేతృత్వంలోని ఉద్యోగులంతా.. రాష్ట్ర విభజన కోసం ఆస్తులు, సంస్థలు, ఉద్యోగుల పంపిణీ వివరాలను క్రోడీకరించే పనిలో మునిగిపోయారు. ఐదు రోజులుగా మిగతా కార్యక్రమాలన్నీ అటకెక్కగా.. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నమైంది.

రాష్ట్ర విభజనకు శరవేగంగా సన్నాహాలు చేసే క్రమంలో.. సమాచార క్రోడీకరణ కోసం ఆర్థిక, శాఖపరమైన అనుభవం గల పదవీ విరమణ చేసిన అధికారుల సహకారాలు కూడా తీసుకుంటున్నారు. రోజువారీ పాలనా కార్యక్రమాలు కానీ, మరే ఇతర పనులను కానీ ఆయా శాఖల అధికారులు, కానీ ఇతర ఉద్యోగులు కానీ పట్టించుకోవటం లేదు. సచివాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి నమూనా పత్రం రూపకల్పన; ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు కేటాయింపు; నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పులు; రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు శాసనమండలి స్థానాలు, సభ్యుల కేటాయింపు; ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నదీజలాల పంపిణీ, విద్యుత్, బొగ్గు, జెన్‌కోల విభజన వంటి అన్ని అంశాలనూ ఆగమేఘాల మీద తేల్చేసే పనిలో కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసే సర్కారు యంత్రాంగం బిజీ అయిపోయింది.

విభజన బిల్లులోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న 42 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పనితీరు విభజన తరువాత ఎలాగ ఉండేది కూడా నోట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఉద్యోగులు తమ సర్వీసు, స్థానికత వివరాలకు సంబంధించి జారీ చేసిన కంప్యూటరైజ్డ్ దరఖాస్తును నింపే పనినీ పూర్తిచేస్తున్నారు. ఆయా విభాగాలు చేస్తున్న పనిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ప్రతి రోజూ శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. విభజన పంపిణీలకు సంబంధించి ఇప్పుడే ప్రాథమికంగా సిద్ధంగా ఉండే లక్ష్యంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలోపడ్డారు.
 
బిల్లులో అచ్చు తప్పుల సవరణకు నిర్ణయం
రాష్ట్ర విభజనకు పాలనాపరంగా భూమికను సిద్ధం చేస్తూనే.. విభజన బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందులో ఉన్న కొన్ని తప్పులను గుర్తించి, వాటిని సరిచేయాలని కూడా కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లులోని మూడో పేజీలో ఇంగ్లిష్‌లో మహబూబ్‌నగర్ పేరులో ఎ అక్షరం పడలేదని, దాన్ని సరిచేయాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే బిల్లులో కడప జిల్లా అని పేర్కొనగా.. దాన్ని వైఎస్సార్ జిల్లాగా, నెల్లూరు జిల్లాకు బదులుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చాలని అధికారులు గుర్తించారు.

అలాగే బిల్లులో తొమ్మిదవ షెడ్యూల్‌లో పేర్కొన్న 44 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను, ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న 41 సంస్థల్లో ఏ సంస్థకు ఎన్ని నిధులు ఉన్నాయో లెక్కకట్టడంతో పాటు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే ఏ రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వస్తోయో తేల్చే పనిలో ఆర్థికశాఖ నిమగ్నమైంది. ఈ 41 సంస్థలే కాకుండా ఇంకా సంస్థలేమైనా ఉంటే వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు.
 
 శాఖల వారీగా పనుల వివరాలివీ...
* ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (ఐఎఫ్): ఆస్తులు, అప్పులకు సంబంధించి ప్రత్యేక నమూనా పత్రం రూపకల్పన, సమాచార సేకరణ, జనాభా నిష్పత్తి ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని అస్తులు, అప్పులు వస్తాయో తయారీ. ఆదాయ, వ్యయాలకు సంబంధించి కేంద్రానికి పంపిన పుస్తకాల సేకరణ. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ప్రస్తుతం వస్తున్న ఆదాయం, పంపిణీ. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో గత 55 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్థల ఏర్పాటు సమాచారం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, వాటి ప్రస్తుత విలువ నివేదిక. మూడు ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ లోటుకు కారణాలు. 13వ ఆర్థిక సంఘం నిధులు వ్యయం, నిధులు పంపిణీ.
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (ఆర్ అండ్ ఈ): ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు కేటాయింపు. రీజియన్/ జోన్‌లలో ఉన్న ఖాళీలు.
* ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి(రూల్స్): నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పు లు, ప్రాంతాలవారీగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమాచారం సేకరణ.
ఐటీ శాఖ కార్యదర్శి: మూడు ప్రాంతాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు. హైదరాబాద్‌లో ప్రత్యేకించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వివరాలు.
ఇరిగేషన్ ఈఎన్‌సీ: 3 ప్రాంతాల్లో ప్రాజెక్టుల వారీగా సాగు, తాగునీటి లభ్యత. విభజన నేపథ్యంలో ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పర్యవసానాలు.
ఇంధన శాఖ అదనపు కార్యదర్శి: మూడు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల వివరాలు. కేటగిరీల వారీగా విద్యుత్ వినియోగం.
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి: ప్రాంతం వారీగా ప్రధాన కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులు వివరాలతో పాటు ఇతర అంశాలు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి: రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు ప్రస్తుత శాసనమండలి సభ్యుల కేటాయింపు. నియోజకవర్గాల పునిర్వభజన అనంతరం ఇరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలు, శాసనమండలి స్థానిక, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల వివరాలు, విభజన తరువాత ప్రస్తుతం ఉన్న మండలి సభ్యులను ఇరు ప్రాంతాలకు కేటాయింపు.
 
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల వివరాలు బిల్లులో పేర్కొన్నవి సరిగా ఉన్నాయా లేవా, ఇంకా అదనంగా కులాలు ఉన్నాయా అనే వివరాల సేకరణ.
* గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి: తెలంగాణలో ఎస్టీల వివరాలు బిల్లులో పేర్కొన్నవి సరిగా ఉన్నాయా లేవా, అదనంగా చేర్చాలా అనే వివరాల సేకరణ.
* ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న 41 సంస్థలు, ఇతర పబ్లిక్ ఖాతాల్లోని నిధుల వివరాలు. ఆ నిధులను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ. పదవ షెడ్యూల్‌లో పేర్కొన్న 42 సంస్థలు ఏడాది లేదా కేంద్రం నిర్ణయించినంత కాలం ఇరు రాష్ట్రాలకు పనిచేయడం ఎలాగో నివేదిక.
 
సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి: నదీ జలాల పంపిణీ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కొనసాగింపు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు, విభజన నేపథ్యంలో ఉత్పన్నమయ్యే వివరాల సేకరణ.
ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి: విద్యుత్, బొగ్గు, జెన్‌కో విభజన, విద్యుత్ నియంత్రణ మండలి ఆరు నెలలపాటు ఇరు రాష్ట్రాలకు పనితీరు ఎలా ఉండాలి, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు వివరాలు సేకరణ.
రవాణా, ఉన్నత విద్య, పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు: 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా విద్య, విద్యుత్, యూనివర్శిటీలు పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాల వివరాల సేకరణ.

తెలంగాణకు చెందిన పది జిల్లాలు, మిగతా 13 జిల్లాలకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని అన్ని శాఖలు సేకరిస్తున్నాయి.
 
 ఉద్యోగులు నెలాఖరులోగా వివరాలివ్వాలి
 ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్

సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులు తమ సర్వీసు వివరాలను ఈ నెల 30లోగా అందజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన ఉన్నా లేకున్నా ప్రతి ఉద్యోగి స్థానికత వివరాల డిజిటలైజేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షల మంది ఉన్నారని, వీరికి అదనంగా కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారని, వారి సర్వీసు వివరాలన్నింటినీ డిజిటల్ సర్వీసు రిజిస్టర్‌లోకి తీసుకురావడానికి మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్‌ఆర్‌ఎంఎస్) కింద కంప్యూటరైజ్డ్ దరఖాస్తులో ఉద్యోగులు వివరాలను కోరామని తెలిపారు. డిజిటల్ సర్వీసు రికార్డుల విధానం జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారానికి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
Share this article :

0 comments: