విభజన ఆపండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన ఆపండి

విభజన ఆపండి

Written By news on Friday, December 27, 2013 | 12/27/2013

 రాష్ట్రపతికి జగన్ వినతి
* సమైక్య అఫిడవిట్లు ఇచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు
* ఆంధ్రప్రదేశ్‌ను విభజించటానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు
* రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు
* సార్వత్రిక ఎన్నికలకు ముందు విభజన ఏమాత్రం సరికాదు
* తెలంగాణలో కొన్ని సీట్ల కోసమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది
* సర్కారియా, పూంచీ కమిషన్ల సిఫారసులను విస్మరించింది
* విధివిధానాలు, కనీస సంప్రదాయాలను పక్కనపెట్టింది
* రాష్ట్రాన్ని కలిపి ఉంచటమే మేలన్న శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పట్టించుకోలేదు.. వీటిపై రాష్ట్ర ప్రజలతో చర్చించనూ లేదు
* దీర్ఘ కాలికంగా ఉన్న ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పక్కనపెట్టి.. తెలంగాణ అంశాన్ని మాత్రమే కేంద్రం తెరపైకి తెచ్చింది
* గతంలో ‘విదర్భ’ను మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్నారని పక్కనపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది
* విభజనపై కేంద్రం చర్యలు ఏ మాత్రం చెల్లుబాటు కావు
* రాజ్యాంగాధినేతగా విభజనను ఆపివేయాలని కోరుతున్నాం
* ప్రణబ్‌కు జగన్ సహా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల వినతిపత్రం
 
సాక్షి, హైదరాబాద్: ఒక ప్రాతిపదిక, పద్ధతి లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించటాన్ని ఆపివేయాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఒక సంప్రదాయం, విధానమంటూ ఏదీ అనుసరించకుండా.. అదీ మరికొద్ది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రాష్ట్రాన్ని విభ జించాలన్న నిర్ణయానికి రావడం ఏమాత్రం సమంజసం కాదని విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

విభజన అంశంలో రాజ్యాంగపరమైన అంశాలు, గతంలో పాటించిన విధివిధానాలన్నింటినీ తెలియజేస్తూ ఈ సందర్భంగా నాలుగు పేజీల వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేసింది. దాంతో పాటుగా.. జగన్‌తో కలిసి వెళ్లిన ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్వీయ అఫిడవిట్లను రాష్ట్రపతికి అందజేశారు. వినతిపత్రంతో పాటు స్వీయ అఫిడవిట్లను రాష్ట్రపతి సావధానంగా పరిశీలించారు. ముందుగా తన వెంట వెళ్లిన ప్రజాప్రతినిధులను పరిచయం చేసిన అనంతరం రాష్ట్రపతికి జగన్ వినతిపత్రాన్ని సమర్పించారు.

రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని, మెజారిటీ ప్రజల అభిమతానికి భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే అంశంతో పాటు.. రాష్ట్రాల విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో పాటించిన పద్ధతులు, ఏదైనా ఒక కమిషన్, కమిటీ సిఫారసుల మేరకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను ఉపయోగించి రాష్ట్రాలను విభజించాలన్న జస్టిస్ పూంచీ కమిషన్ సూచనలు, ఇతర అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు. అందులోని ముఖ్యాంశాలివీ...
ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటని కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఎమ్మెల్యేలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. క్రమంగా పార్టీ పరపతి కోల్పోతూ ఒకదాని తరువాత మరొక  రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో కొన్ని సీట్ల కోసం ఈ విభజనకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించాలని చూస్తోంది.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ పూంచీ కమిషన్‌లు చేసిన సిఫారసులను, రాజ్యాంగపరంగా నెలకొల్పిన సంప్రదాయాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించింది. రాష్ట్రాల విభజనకు వీలు కల్పించే రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద చర్యలు తీసుకునే ముందు ఏదైనా కమిషన్, కమిటీ చేసిన సిఫారసులను ప్రాతిపదికగా తీసుకోవటం కానీ, లేదా విడగొట్టాలనుకున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి విభజనకు అనుకూలంగా తీర్మానం కానీ తీసుకోవాల్సి ఉంటుందని ఈ 2 కమిషన్లు చేసిన సిఫారసులను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.

ఇతర రాష్ట్రాల విభజన సందర్భంగా గతంలో పాటించిన సంప్రదాయాలు, విధానాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకు పక్కన పెట్టి కుతంత్రాలు పన్నుతోంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి 461 పేజీల నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా చెప్పింది. (శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాష్ట్రాన్ని కలిపి ఉంచడమే మేలన్న విషయాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందుపర్చారు.)

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఇంతటి ప్రాధాన్యం గల నివేదికపై ఆయా ప్రాంతాల వారితో విస్తృతంగా చర్చించకపోవడం దురదృష్టకరం. కనీసం అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా తీసుకోకుండా ఉన్నపళంగా అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. న్యాయపరమైన ఈ కమిటీ నివేదికను కేంద్రం ఎందుకు విస్మరించిందో ఊహలకు అందని విధంగా ఉంది. కమిటీ చేసిన సిఫారసులు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే కాదా?

*  దీర్ఘ కాలికంగా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణను మాత్రమే కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడం కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. నాగపూర్‌ను రాజధానిగా చేస్తూ విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తొలి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ 1956లో సిఫారసు చేసింది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అక్కడి అసెంబ్లీ మూడేళ్ల కిందట తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం పక్కనపెట్టింది.

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి వరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాలను కూడా విస్మరించారు. 2000 సంవత్సరంలో విదర్భ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు అప్పటి కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటూ విదర్భ రాష్ట్రం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారని వివరించారు. అందువల్ల దానిని పక్కనపెడుతున్నామని వెల్లడించారు.

*  పైన పేర్కొన్న రాజ్యాంగపరమైన సంప్రదాయాల నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం చెల్లుబాటు కావు. ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ఉన్న ఒక రాజకీయ పార్టీగా మేము ఇటీవల దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అనేకసార్లు ఈ అప్రజాస్వామిక విభజనను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌లను కూడా అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనపై అభిప్రాయం తీసుకోవాల్సిందిగా కోరాం. కానీ దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ మాత్రం ఎలాంటి సంప్రదాయాలు, విధానాలు పాటించకుండా ముందుకే పోతోంది.

*  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (2013) ముసాయిదాను పూర్తి తొందరపాటుతో చేసినట్లుగా స్పష్టమవుతోంది. అసెంబ్లీకి కూడా అంతే వేగంగా పంపారు. బిల్లు ఉద్దేశాలు, కారణాలు కూడా పొందుపరచకుండా, అనేక ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా బిల్లును పంపారు. దీనిని బట్టి కేంద్రం దీనిపై ఎలాంటి చర్చా విపులంగా జరగకూడదని భావించినట్లుగా ఉంది. ఇలా చర్చ జరగకపోవడం వల్ల 8.4 కోట్ల మంది ప్రజలు గల రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుంది.

*  ఇంతటి ముఖ్యమైన అంశం మీద రాష్ట్రంలోని సీనియర్ నాయకులకు మెజారిటీ శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలపై ఏ మాత్రం గౌరవం లేనట్లుగా వారి ప్రకటనలనుబట్టి అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీ తీర్మానం గురించి అసలు పట్టించుకోవడం లేదు. అందుకే మేం విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అత్యున్నతమైన రాజ్యాంగ అధినేత అయిన మీకు అఫిడవిట్లను సమర్పిస్తున్నాం.

*  మా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలం.. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అఫిడవిట్లను సమర్పిస్తున్నాం. అవిశ్వాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హతకు గురి చేయకుండా.. కొంత కాలం సాగదీసి వారిని ఎమ్మెల్యేలుగా లేకుండా చేసేందుకు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఉపఎన్నికలు జరిగి ఉంటే వారంతా తిరిగి ఎన్నికైతే రాష్ట్ర విభజనను వ్యతిరేకించే వారేనని మనవి చేస్తున్నాం. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ రాష్ట్ర విభజనను నిలిపి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 
సావధానంగా ఆలకించిన ప్రణబ్
రాష్ట్రపతి ప్రణబ్.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో 15 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన వినతిపత్రాన్ని, ప్రజాప్రతినిధులు అందించిన స్వీయ అఫిడవిట్లను స్వీకరించారు. రాష్ట్ర విభజన ఏ మాత్రం శ్రేయస్కరంకాదని జగన్ వివరిస్తున్నపుడు ప్రణబ్ సావధానంగా వింటూ అఫిడవిట్‌లోని అంశాలను సాంతం పరిశీలించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ప్రణబ్ పలుకరించి క్షేమసమాచారాలు అడిగారు.

రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణరంగారావు, పేర్ని వెంకటరామయ్య, తానేటి వనిత, జోగి రమేష్, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్ , ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మద్దాల రాజేష్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: