ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ?

ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ?

Written By news on Tuesday, December 31, 2013 | 12/31/2013



 ‘‘చంద్రబాబు.. అవినీతి గురించి మాట్లాడతారు. అయ్యా 1978లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీ కుటుంబం ఆస్తి మొత్తం రెండున్నర ఎకరాలకు మించి లేదన్న సంగతి మర్చిపోయారా? ఇవాళ చంద్రబాబు ఆస్తి ఎలా ఉందీ అంటే.. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన కర్ణాటక, తమిళనాడు చెన్నైలో ఎక్కడ చూసినా.. హెరిటేజ్ షాపులు వేలసంఖ్యలో కనిపిస్తాయి. మరి ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ? చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడ్డమంటే.. ‘టైజం నాకు పట్టదు’ అని బిన్‌లాడెన్ మాట్లాడినట్టు ఉంటుంది. ‘నా అల్లుడు అంత అవినీతి పరుడు దేశంలోనే మరొకడు లేడు’ అని ఆయన సొంత మామ ఎన్టీఆర్ స్వయంగా లేఖలో రాశారు. ఇదే చంద్రబాబు గురించి కమ్యూనిస్టులు.. ‘చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా’ అనే పుస్తకమే ముద్రించారు.’’    
 - వైఎస్ జగన్
 
 ‘‘చంద్రబాబు అబద్ధాలు చెప్తారు.. మోసం చేస్తారు.. సీబీఐ కేసులంటారు.. జగన్‌ను ఎందుకు జైల్లో నుంచి తీసుకొచ్చారు అంటారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే కాదయ్యా.. ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తిని జైల్లో పెడితే.. ఎంక్వైరీ పూర్తి కాకుండా, ఆ వ్యక్తి అన్యాయం చేశాడని నేరం రుజువు కాకుండా.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో సంవత్సరాలపాటు పెట్టడం ఎంతవరకు న్యాయం? అని చంద్రబాబును అడగదలచుకున్నా. అయ్యా నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కుమ్మక్కై నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏదో ఒక రోజు దేవుడు పై నుంచి కరుణిస్తాడు. దేవుడు నీ విషయంలో కూడా ఇదే చేస్తాడు. నన్ను 16 నెలలు పెట్టారు... నిన్ను కనీసం రెండు మూడు నెలలు పెడితే నీకెలా ఉంటుందో ఆ రోజు నిన్ను అడుగుతా చంద్రబాబూ!’’
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని కాపాడడం వరకు నాలుగేళ్లుగా అడుగడుగునా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇవాళ రాష్ట్రాన్ని విడగొడుతున్నది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ సోనియా గాంధీతో కుమ్మక్కై ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పడంలేదా?’’ అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే.. తిరుపతిలో గంటకుపైగా మీటింగ్ పెట్టి మాట్లాడిన చంద్రబాబు.. ఒక్కసారి కూడా సమైక్యం అన్న మాటే అనలేదని దుయ్యబట్టారు. ‘‘మొన్నటికి మొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ.32 వేల కోట్ల మేర చార్జీలు పెంచి కరెంటు బిల్లులతో ప్రజలకు షాక్ కొట్టిస్తోంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లంతా కూడా ఒక్కటై అవిశ్వాసం తీర్మానం పెడితే.. ఆ సమయంలో ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌జారీ చేసిన మాట వాస్తవం కాదా? అని అడుగుతున్నా.

చంద్రబాబు నాయుడు ఆ వేళ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ సర్కారే కూలిపోయి ఉండేది.. విభజన జరక్కుండాపోయేది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర రెండో దశ రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగింది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ‘‘మొన్నటికిమొన్న చంద్రబాబు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి సుదీర్ఘంగా గంటకుపైగా మాట్లాడారు. చంద్రబాబు గర్జిస్తున్నారు.. ప్రజా గర్జన అని పేరు పెట్టి పిలుస్తున్నారు.. ఆ గర్జనలో చంద్రబాబు సమైక్య నినాదం తీసుకుంటారేమోనని నేను ఆశగా ఎదురుచూశాను. మన ఖర్మ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు మారనే మారరు. గంటపాటు సాగిన మీటింగ్‌లో కనీసం ముప్పావు గంట జగన్‌మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే కేటాయించారు. రాష్ట్రం మొత్తం సమైక్య ఉద్యమంతో ఉడుకుతూ ఉంది. సమైక్య నినాదం తీసుకోమని చంద్రబాబును ప్రతి రైతన్న కాలర్‌పట్టుకుని అడగబోతున్నాడు. ఉద్యోగం కోసం మేం ఎక్కడికి వెళ్లాలి అని ప్రతి విద్యార్థీ చంద్రబాబును కాలర్‌పట్టి నిలదీసే పరిస్థితి ఉంది. అయినాసరే చంద్రబాబు నాయుడి నోట స..మై..క్యం.. అన్న మాట రానేరాదు.
 
 ఎవరు చంద్రబాబూ కుమ్మక్కైంది?
 
 జగన్‌మోహన్‌రెడ్డి సోనియా గాంధీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు అంటున్నారు. ఎవరు ఎవరితోనయ్యా కుమ్మక్కైంది? ఆయన్ను నేను ఓ మాట అడగదలచుకున్నా.. జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరయ్యా జైల్లో పెట్టించారు? జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎవరయ్యా కేసులు పెట్టారు? ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన 18 నెలల తర్వాత, ఆ దివంగత నేత కొడుకైన జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి రెండు నెలలైన తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, చంద్రబాబు కుమ్మక్కై కోర్టులకు పోవడం నిజం కాదా అని అడుగుతున్నా. ఇద్దరూ కలిసి ఆ దివంగత నేత మీద కేసులు వేశారు.. ఆ దివంగత నేత చెప్పుకోలేడని, ఆయనకు ఎవ్వరూ తోడుగా రారని, ఆయనను బజారుకు ఈడ్చాలని ఇద్దరూ కలసికట్టుగా ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఇద్దరూ చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్సిగ్గుగా కలసికట్టుగా పోటీచేశారు. చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్‌లో నడిబొడ్డున అమీర్‌పేటలో రూ.400 కోట్ల విలువ చేసే తొమ్మిది ఎకరాల భూమిని జీఎం నాయుడు అనే వ్యక్తికి ధారాదత్తం చేశారు. ఆర్‌టీఐ కమిషనర్ల పదవులనూ ఇద్దరూ కలిసికట్టుగా పంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు చిన్న వర్తకులు, రైతులపై ప్రభావం చూపే ఎఫ్‌డీఐల మీద ఓటింగ్ సమయంలో.. దేశం మొత్తం చూస్తుండగా.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించారు.. ఇది కుమ్మక్కు కాదా చంద్రబాబూ?
 
 ఆ హామీల సంగతేంటి బాబూ?
 
 చంద్రబాబు నాయుడిని ఒక మాట అడగదలచుకున్నా.. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హామీలిస్తున్నావ్ బాబూ.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే.. దాన్ని రూ.5.25 చేసింది నువ్వు కాదా? నాడు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లావ్... ఎన్నికలైపోయిన తర్వాత ‘ఈనాడు’ దినపత్రికలో.. మద్యపానం నిషేధిస్తే.. రాష్ట్రమంతా అధోగతి పాలవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధించకపోగా.. ఊరుఊరునా బెల్టు షాపులు తెచ్చింది నువ్వు కాదా చంద్రబాబూ? ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తామంటున్న చంద్రబాబూ.. ఆ రోజు.. రూ.50గా ఉన్న హార్స్ పవర్ విద్యుత్ ను రూ.625కు పెంచింది నువ్వు కాదా? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. రైతన్నకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండీ అని ప్రతిపక్షాలంతా ధర్నాలు చేస్తూ ఉంటే.. కరెంటు తీగలు చూపించి.. ‘ఉచితంగా కరెంటు ఇస్తే.. ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికివస్తా’యంటూ కొట్టిపారేసింది నువ్వు కాదా చంద్రబాబూ? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే.. తిన్నది అరక్క వారు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మీ పార్టీ కాదా? అని అడుగుతున్నా.
 
 నువ్వా చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడేది?
 
 చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తన మీద సీబీఐ విచారణ జరగకుండా చూసుకున్నారు. శ్రీమంతులు గోల్ఫ్ ఆట ఆడుకోవడానికి, శ్రీమంతులు ఇళ్లు కట్టుకుని అమ్ముకోవడానికి చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన 530 ఎకరాలను ఎమ్మార్ అనే సంస్థకు అప్పనంగా కేటాయించేస్తే.. అది కూడా సింగిల్ టెండరుకు ఇచ్చి అన్ని ఉల్లంఘనలకూ పాల్పడితే.. సీబీఐ చంద్రబాబును కనీసం ఎంక్వైరీకి కూడా పిలవదు. ఇదే చంద్రబాబు ఐఎంజీ భారత అనే సంస్థకు.. హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 830 ఎకరాలను.. విలాసవంతమైన ఇళ్లు కట్టి శ్రీమంతులకు అమ్ముకోవడానికి ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ.. కేబినెట్‌కు కూడా పోకుండా ఒక డమ్మీ కంపెనీకి ఆయన భూములు అక్రమంగా కేటాయింపులు చేస్తే.. హైకోర్టు చంద్రబాబు మీద ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిస్తే..  సీబీఐ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇవ్వకుండా చూడ్డానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇటువంటి వ్యక్తా అవినీతి గురించి మాట్లాడేది?
 
 ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ఉద్యమాలు జరుగుతూ ఉంటే.. చంద్రబాబు గంటలకు గంటలు మీటింగ్ పెట్టి.. అందులో సమైక్యం గురించి మాట్లాడకుండా.. సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఎన్నికల గురించి మాట్లాడ్డం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నాను.. మోసం చేస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డికీ చెప్తున్నాను. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సోనియా గాంధీకి చెప్తున్నాను. మీరు చేస్తున్న మోసం ఊరికే పోదు. పై నుంచి దేవుడనేవాడు కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరం కూడా ఒక్కటవుదాం. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనంతట మనమే తెచ్చుకుందాం.. ఆ తర్వాత ఎవరు మన రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూద్దాం. మన రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని గట్టిగా చెప్తున్నాను.  కుయుక్తులు, కుమ్మక్కు రాజకీయాలతో చెడిపోయిన ఈ వ్యవస్థలో ఇవాళ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే’’.
 
 జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్. అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు రోజా తదితరులు పాల్గొన్నారు.
 
 అసెంబ్లీ మొదటి భేటీలోనే ఎస్‌టీ జాబితాలో చేరుస్తాం
 వాల్మీకులకు జగన్ హామీ
 
 తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీకి తగ్గట్టుగానే తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాల్మీకి కులస్తులను ఎస్‌టీ జాబితాలో చేరుస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చౌడేపల్లెలో సోమవారం ఉదయం తనను కలసిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. వాల్మీకుల డిమాండ్ సమంజసమైనదని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా వాల్మీకులను ఎస్‌టీలుగా చేర్చాలన్న అంశాన్ని ఉంచామన్నారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి నేతృత్వంలో వాల్మీకి సంఘం నేతలు బొగ్గిట కృష్ణమూర్తి, హరికృష్ణ ఆయనను కలిశారు.    
 - సాక్షి ప్రతినిధి, తిరుపతి
 
Share this article :

0 comments: