రాజకీయాల్లో లీడరంటే.. జగన్‌మోహన్‌రెడ్డే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయాల్లో లీడరంటే.. జగన్‌మోహన్‌రెడ్డే

రాజకీయాల్లో లీడరంటే.. జగన్‌మోహన్‌రెడ్డే

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

సమైక్య లీడర్.. జగనే
 
కొనియాడిన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
  విభజనపై రాజీ లేని పోరాటం చేస్తున్నారని వ్యాఖ్య
  సోనియా నిర్ణయాలు ఏకపక్షం
  చంద్రబాబు విధానాల్లో గందరగోళం
   సిద్ధాంతాలు వీడి.. అధికారానికి అర్రులు
  పార్టీ పెద్దలతో వేగలేకే ప్రత్యామ్నాయంపై దృష్టి
  వైఎస్‌ఆర్‌సీపీయే బెటరని మద్దతుదారుల స్పష్టీకరణ
  మీ వెంటే మేమని క్యాడర్ భరోసా
 
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: ప్రస్తుతం రాష్ట్రంలో.. రాజకీయాల్లో లీడరంటే.. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగ న్‌మోహన్‌రెడ్డేనని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో తనదైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సిస్టమ్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన రాజకీయ సమాలోచన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన వెంటనే స్పందించి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ఆయన పోరాటం ఫలించి రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలని ఆకాంక్షించారు. దివంగత వైఎస్‌ఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆధికారానికి తప్ప రాష్ట్ర ప్రజల  ఆత్మగౌరవానికి విలువ ఇవ్వడం లేదన్నారు.
 
 సమన్యాయం అంటు ఏవేవో ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. రాజకీయంగా కీలకమైన సమయంలో 32 ఏళ్లుగా కలిసి పని చేసిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకే ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రజల మనోభావాలను గాయపరిచిందన్నారు. పార్టీ పెద్దలు సిద్ధాంతాలను విడిచిపెట్టి అధికారం కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు. కొంతమందికి అధికారం కోల్పోవడం ఇష్టం లేదని, అయితే వారు తమ నియోజకవర్గాల్లోనే గెలవలేరని ఎద్దేవా చేశారు. ప్రజల అభిమతానికి తగట్టు పని చేయకపోతే బలహీన పడతామన్నారు. పార్టీలో ఉన్న ఈ పరిస్థితులతోనే బాగా ఆందోళనకు గురయ్యాన ని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఆపకపోతే ఇబ్బంది పడతామని కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలకు చెప్పానని, అయితే ఆ విషయం తమకు తెలుసునంటూ ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే రీతిలో మాట్లాడటంతో అప్పుడే ఆలోచనలో పడ్డానన్నారు. 
 
 కొన్నాళ్లుగా అంతర్మథనం
  ఈ పరిస్థితుల్లో 30 ఏళ్లు ఒక పక్క పనిచేసి నేడు వేరే వైపు వెళ్లాలా?.. లేకపోతే రాజకీయాలను వదిలేయాలా?.. అన్న అంతర్మథనం ప్రారంభమైందన్నారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజలకు మరో 10-15 ఏళ్లు సేవలందించాల్సి ఉంది..వంశధార ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఐదు నియోజకవర్గాల కు సాగు నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా ఒక్కరే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పేరుతో గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని, గతంలో దేవత అన్న చోటే దెయ్యం అంటున్నారని అన్నారు. ఆరు దశాబ్దాలుగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో విభజన జరిగితే మళ్లీ వెనుకబడిపోతామన్నారు.
 
 అందువల్ల రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి వచ్చిందంటూ టీడీపీలోకి వెళ్దామా.. అని ప్రశ్నించారు. ‘వద్దూ.. వద్దూ’.. అంటు సభికులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. మరి రాజకీయాలు వదిలేద్దామా.. అని తిరిగి ధర్మాన ప్రశ్నించగా, దానికి కూడా ‘వద్దూ.. వద్దూ’.. అంటూ తిరస్కరించారు. జై జగన్.. జై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మళ్లీ ధర్మాన మాట్లాడుతూ తానేం చేయాలో చెప్పాలని కోరుతూనే మరికొద్ది రోజుల్లో మళ్లీ పిలుపిస్తాను. లక్షల సంఖ్యలో తరలిరావాల్సిన ఉంటుందన్నారు. అనంతరం హాజరయిన వారంతా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్ సీపీలోకి చేరడానికి తీర్మానం చేశారు. నరసన్నపేట నియోజక వర్గానికి చెందిన టంకాల బాబ్జీ మాట్లాడుతు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎంతో సేవ చేశారని, ఎంపీగా ఈసారి బరిలోకి దిగి ఢిల్లీలో కూడా జిల్లా వాణిని వినిపించాలని కోరారు. ప్రజలను జాతీయ పార్టీలు కాలదన్నే సమయంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయని కేఏఎన్ భుక్త అన్నారు.
 
 జిల్లాకు దిక్సూచిగా ఉన్న ధర్మాన వెంటే తామంతా ఉంటామన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్‌చార్జి జోగినాయుడు మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి సిద్ధాంతాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాను ధర్మాన ప్రసాదరావు ఎంతో అభివృద్ధి చేశారని, పాతవారిని గౌరవించాలని పాలకొండకు చెందిన సామంతుల దామోదర్ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలోకి రాజమార్గంలోనే వెళ్లాలని కోరారు. జిల్లా నాయకుల్లో అగ్రగణ్యులైన బొడ్డేపల్లి రాజగోపాలరావు, కింజరాపు ఎర్రన్నాయుడు, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావులని ఆమదాలవలసకు చెందిన జెజె. మోహనరావు అన్నారు. అన్ని వర్గాల వారికి అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనుడు వైఎస్‌ఆర్ అని నందిగాం చెందిన పేడాడ తిలక్ అన్నారు.
 
 టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి కుమార్తె చిగిలిపల్లి శిరీష మాట్లాడుతు సమైక్యాంధ్రాకు కట్టుబడిన నాయకుడి వెంటే నడవాలని, ధర్మాన ప్రసాదరావు కూడా అటువైపే అడుగులు వేయాలన్నారు. ఆయన వెంటే టెక్కలి నియోజకవర్గమంతా ఉంటుందన్నారు. వైఎస్‌ఆర్ భౌతికంగా మరణించినా ప్రజల మనసుల్లో నేటికీ జీవించే ఉన్నారని గురుగుబెల్లి లోకనాథం అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు క్రిష్ణమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బరాటం నాగేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు క్రిష్ణ, విశాలగుప్త, టంకాల అచ్చెన్నాయుడు,
 
 రాడ మోహనరావు, మాజీ ఎంపీపీలు గొండు రఘురాం, చిట్టి జనార్ధనరావు, అంబటి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు గుండ ఢిల్లీరావు, చిట్టి రవికుమార్, మూకళ్ల తాతబాబు, మామిడి శ్రీకాంత్, అందవరపు వరాహానర్సింహం(వరం), ఎంవీ పద్మావతి, హనుమంతు క్రిష్ణారావు, అందవరపు సూరిబాబులతో పాటు జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరువేల మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, అనుచరులు, మద్దతుదారులు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: