విభజనపై ఎన్నికలే రెఫరెండం: వైఎస్ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజనపై ఎన్నికలే రెఫరెండం: వైఎస్ జగన్‌

విభజనపై ఎన్నికలే రెఫరెండం: వైఎస్ జగన్‌

Written By news on Thursday, December 5, 2013 | 12/05/2013

* దమ్ముంటే 2014 ఎన్నికలే రెఫరెండంగా విభజనపై నిర్ణయం తీసుకోవాలి:  కేంద్రానికి జగన్ సవాల్
* విభజనపై కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
*  తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశం
* ఆర్టికల్ 3 సవరణకు కృషిచేయాలని, విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో గొంతెత్తాలని విజ్ఞప్తి
* సానుకూలంగా స్పందించిన జయలలిత, కరుణానిధి
* సమైక్యాంధ్ర నినాదంతోనే మేం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేస్తాం
* 30కిపైగా పార్లమెంట్ సీట్లు గెలుస్తామన్న నమ్మకం మాకుంది..
* కేంద్రానికి తమ వాదనపై నమ్మకముందా?.. కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే స్పష్టత లేదు
* సాధారణ మెజారిటీతో అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసుకునేందుకే రాయల తెలంగాణ
* తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలతో జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం
*  ఈ సమయంలో మౌనంగా ఉంటే రేపు తమిళనాడు, ఇతర రాష్ట్రాలనూ విభజిస్తారని వెల్లడి
* ఇష్టమొచ్చినట్లు విభజించే అధికారమిస్తున్న ఆర్టికల్ 3 సవరణకు కృషి చేయాలని వినతి
* సానుకూలంగా స్పందించిన జయలలిత, కరుణానిధి

 చెన్నై, సాక్షి ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనపై ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రానున్న 2014 ఎన్నికలే రెఫరెండం(ప్రజాభిప్రాయం)గా తీసుకుని.. ఆపై విభజన విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘‘నేను కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మొదట 2014 ఎన్నికలు పూర్తి చేయండి. నేను, నా పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటాం. ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తాం. తమకు ఏం కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. నా రాష్ట్ర ప్రజలపై నాకు నమ్మకముంది. కచ్చితంగా 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని నాకు నమ్మకముంది.
 
  ప్రధాని ఎవరో నిర్ణయించగల విజయాన్ని అందుకుంటామన్న నమ్మకముంది. మరి వారికి(కేంద్ర ప్రభుత్వానికి)ఆ నమ్మకముందా? 2014 ఎన్నికలే రెఫరెండంగా తీసుకోవడానికి మీకు దమ్ముందా?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడానికి జరుగుతున్న యత్నాలకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3ను సవరించేందుకు కృషి చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి.. అందులో భాగంగా బుధవారం తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత జయలలితను, డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

 రేపు తమిళనాడునూ విభజిస్తారు..

 ‘‘ప్రస్తుత విభజన అంశాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యగా మాత్రమే చూడొద్దని నేను జయలలిత, కరుణానిధిలకు స్పష్టంగా చెప్పాను. ‘ఓట్ల కోసం, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అడ్డగోలుగా, అన్యాయంగా విభజిస్తున్న ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే.. అతి త్వరలోనే మీ వంతు వస్తుంది.. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల వంతు అవుతుంది’’ అని ఇద్దరు నేతలకు వివరించినట్లు జగన్ చెప్పారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను కచ్చితంగా సవరించాల్సిన అవసరం ఉంది. దీన్ని సవరించకుంటే 272 మంది ఎంపీలతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజిస్తుంది. ఆ రాష్ట్ర ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా విభజించే అధికారాన్ని ఈ ఆర్టికల్ ఇస్తోంది’ అని అన్నారు. ‘‘ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఆర్టికల్ 3 సవరణకు మేం చేసే పోరాటానికి మద్దతివ్వాలని కోరాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు ముందుకు రావాలని, విభజనకు వ్యతిరేకంగా గొంతెత్తాలని అర్థించాను. మా విజ్ఞాపనల్ని వారు శ్రద్ధగా విన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని వారు ఇద్దరూ అభిప్రాయపడ్డారు’’ అని తెలిపారు.
 
 అందుకే రాయల తెలంగాణ అంటున్నారు..
 ‘‘కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే స్పష్టత లేదు. రాయల తెలంగాణ అని మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని రెండు రోజుల కిందటే నేను విన్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండా విభజిస్తున్న విషయాన్ని మేం దేశవ్యాప్తంగా తిరిగి అన్ని పార్టీల నాయకులందరికీ తెలిపి.. మద్దతు కూడగడుతుండడంతో కొత్తగా ఈ రాయల తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేయక తప్పని పరిస్థితి వస్తుందన్న ఆలోచనతో.. సాధారణ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవడానికి.. వారు రెండు రాయలసీమ జిల్లాలను తెలంగాణకు కలిపి విభజించాలని చూస్తున్నారు. ఇదేం న్యాయం? రెండు జిల్లాలను మాత్రమే కలపడం ఎందుకు? మిగతా అన్ని జిల్లాలను కూడా తెలంగాణకు కలిపేసి రాష్ట్రం పేరునే తెలంగాణ రాష్ట్రం అని మార్చేయండని అడుగుతున్నా. అలా చేస్తే మద్దతిచ్చే మొదటి వ్యక్తిని నేనే’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘రెండు జిల్లాలను కలిపేసి విభజిస్తే.. మీకు ఓకే కదా అని అంటే.. ఇదేం న్యాయం? మీరు హైదరాబాద్ ఇవ్వరు.. మాకు జలాలు రానివ్వరు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా నీరు లేక రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది’’ అని అన్నారు.
 
 వారి హృదయాలను కరిగించాలని దేవుడిని కోరుతున్నా..
 కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు మద్దతిస్తుంటే.. మీరు మిగతా పార్టీలను కలవడం వల్ల లాభముందా? అని విలేకరుల ప్రశ్నకు జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘నేను బీజేపీని కూడా కలిశాను.. ఎన్డీయే భాగస్వామి శివసేనను కూడా కలిశాను. రాజ్‌నాథ్ సింగ్‌తో 40 నిమిషాలు, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో 35-40 నిమిషాలు చర్చించాను. కమ్యూనిస్టులనూ కలిశాను.
నేను ప్రతి ఒక్కరినీ కలుస్తున్నాను. దేశంలో తొలిసారి ఆర్టికల్ 3 దుర్వినియోగమవుతోందని,దీన్ని అడ్డుకోవాలని కోరుతున్నాను. వారి హృదయాలను కరిగించి వారంతా మాకు మద్దతుగా తోడొచ్చేలా చేయాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ప్రధాని అంటున్నారు కదా..అని అడగ్గా.. ‘‘కాంగ్రెస్ చెప్పిందే మన్మోహన్ చెప్తున్నారు. కానీ తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటు. పార్లమెంటు అంటే కేవలం కాంగ్రెస్సే కాదు.. చాలా పార్టీల నాయకులున్నారు. అందుకే అందర్నీ మేం కలుస్తున్నాం.. అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా గొంతెత్తాలనికోరుతున్నాం’’ అని స్పష్టంచేశారు.
 
 ఎవ్వరితోనూ రాజకీయాలు మాట్లాడలేదు..
 జయలలిత, కరుణానిధి పార్లమెంటులో మీకు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారా అని విలేకరులు అడగ్గా.. ‘‘అదే మేం అడిగాం. నిజాయితీగా చెప్తున్నా.. నేను చాలా చిన్నవాడిని. పార్లమెంటులో నాకు ఉన్నది కేవలం ముగ్గురు ఎంపీలే. అందుకే మీరందరూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ, పార్లమెంటులోని సభాపక్ష నాయకులందరూ.. మాకు మద్దతుగా నిలిచి అడ్డగోలు విభజనను అడ్డుకోవాలని నేను అర్థిస్తున్నాను. ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే.. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు గురయ్యే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. ఇది ఆరోగ్యకరం కాదు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత మద్దతివ్వాలని డీఎంకే, అన్నా డీఎంకే ఏమైనా కోరాయా? అని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్ర విభజన అంశం చాలా పెద్ద సమస్య అని, తాను ఎవ్వరితో రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా తాము అందరినీ కలుస్తున్నామని, విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికే కలుస్తున్నామని, రాజకీయాలు మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే మీడియా, సోషల్ మీడియా సహా ప్రతి ఒక్కరూ తమకు మద్దతివ్వాలని, ఈ సమయంలో మౌనంగా ఉంటే.. విభజన ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగదని, తర్వాత మీ రాష్ట్ర్రాలనూ విభజించడానికి చూస్తారని జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులనుద్దేశించి అన్నారు.
Share this article :

0 comments: