కుప్పంలో దొంగ ఓట్లు తొలగించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పంలో దొంగ ఓట్లు తొలగించండి

కుప్పంలో దొంగ ఓట్లు తొలగించండి

Written By news on Tuesday, December 10, 2013 | 12/10/2013

చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ కుప్పం, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సుబ్రమణ్యంరెడ్డి, అమరనాథరెడ్డి  సోమవారం కలెక్టర్ రాంగోపాల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 7వ తేదీన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కుప్పం నియోజకవర్గంలో 43 వేల దొంగఓట్లు ఉన్నాయని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే. దీనిపై కలెక్టర్‌ను పార్టీ నాయకులు కలిశారు. సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ  ఎమ్మెల్యేగా, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనుసన్నల్లోనే అక్కడి అధికారులు పనిచేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులతో విచారణ చేపట్టాలని కోరారు.

తమిళనాడు, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలను కుప్పం నియోజకవర్గ ప్రజలుగా నమోదు చేసి ఓటర్ల లిస్టులో పేర్లను నమోదు చేయిస్తున్నారని వివరించారు. ఈ విషయమై గతంలో తాను ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. విచారణను సమగ్రంగా నిర్వహించి దొంగఓట్లను నిరోధించి, కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని  వినతిపత్రం అందజేశారు.

అమరనాథరెడ్డి మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో 23 వేల వరకు దొంగఓట్లు ఉన్నాయని, వాటిని కూడా విచారించి తొలగించాలని కోరారు. నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై దొంగ ఓట్లర్లను నమోదు చేస్తున్నాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కలెక్టర్ స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా ఒకటిన్నర లక్ష  డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై ఈనెల 17వ తేదీ లోపు సమగ్ర విచారణ జరిపి తొలగిస్తామని చెప్పారు.  
Share this article :

0 comments: