థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు

థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

రాజకీయ కురుక్షేత్రంలో శల్యసారథ్యాలు, ధ్రుతరాష్ట్ర కౌగిళ్లు, పద్మవ్యూహాలు, అధర్మ యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ అన్నయ్య యుద్ధం చేస్తున్నాడు. తెలుగు జాతి కీర్తికోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగింటి సంరక్షణకోసం వెన్ను చూపించకుండా, వెన్నుపోట్లను బేఖాతరు చేస్తూ, అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు.
 ఆ అన్నయ్య అమ్ముల పొదిలో భక్తిశ్రద్ధలతో ఒక బాణం సంసిద్ధంగా నిరీక్షిస్తోంది.
 జగనన్న బాణం... అన్న ఆజ్ఞకోసం సన్నద్ధంగా ఉంది.
 

 - ప్రియదర్శిని రామ్
 
రామ్: అక్టోబర్ 18, 2012 మీరు మీ పాదయాత్ర మొదలుపెట్టారు.. ఆ పాదయాత్రలో మీరు చూసిన అభిమానం చాలా బరువైన అభిమానం. అన్నివైపులా పోలికలు ఉండుంటాయి. నాన్నలాగ ఉన్నారని, అన్నలాగ ఉన్నారని, అన్న కోసం వచ్చారని... అలాంటి బరువును మోస్తూ నడుస్తున్నప్పుడు ఎంత కష్టమనిపించింది?
షర్మిల: ఆలోచిస్తే... నాన్న చేసిన పాదయాత్రను మళ్లీ నేను చేయగలగడం ఒక అదృష్టం.. గౌరవంగా భావిస్తున్నాను. కానీ రెండింటికీ పోలిక... ఏమో... ఎందుకంటే... నాన్న పాదయాత్ర చాలా కష్టంగా సాగింది. నాన్న పాదయాత్ర మండే ఎండల్లో రోజుకు 20 నుంచి 24 కిలోమీటర్ల వరకు చేశారు... నిజంగానే చాలా కష్టపడ్డారు. అది నేను చూశాను. నా పాదయాత్ర అంత కష్టంగా సాగలేదు.
 
 రామ్: మీరు కూడా అలాంటి మండే ఎండల్లోనే నడిచారు కదా...
షర్మిల: లేదు.. ఎండాకాలం కొంత సమయమే.. రోజుకు మరీ ఎక్కువ అంటే 18 కిలోమీటర్లు నడిచాను. నా దృష్టిలో నాన్న పాదయాత్ర అసలైంది... ఒరిజినల్... అండ్ ద ఒరిజనల్ ఈజ్ ద మాస్టర్‌పీస్. మైన్ వజ్ జస్ట్ ఎ రెప్లికా.. నాది ఒట్టి కాపీయే.
 
 రామ్: ప్రజల ఆదరణ..?
షర్మిల: నా పాదయాత్రలో నన్ను నాన్నతోనో, అన్నతోనో పోల్చారని నేను అనుకోను. నాకలా అనిపించలేదు. నాలో నాన్నను, అన్నను వెతుక్కున్నారని అనిపించింది. చాలాసార్లు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఇంకొన్నిసార్లు... మీ నాన్న ఆరోగ్యశ్రీ వల్ల నా భర్త బతికాడనో లేక మీ నాన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల నా కూతురు చదువుకుందనో లేక మా కుటుంబానికి అప్పులు తీరాయనో ఎవరైనా చెబితే... చాలా సంతోషమనిపించేది.. నాన్న గుర్తొచ్చి వెంటనే ఏడుపొచ్చేది.. ఎన్నో జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుండిపోయేవి.
 
 రామ్: వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మహా వృక్షంలాంటి వారు. ఆ వృక్షం కింద చాలామంది వాళ్ల జీవితాలను బాగుచేసుకున్నారు. ఆ మహావృక్షం వాలిపోయింది. ఆ లోటు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కానీ అదే ప్రజలు మీకు ఆ లోటు తెలియకుండా ఉండడానికి సర్వప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని గుండెల్లో హత్తుకుని పెట్టుకున్నారు. ఒక ఎలక్షన్ ఉందంటే, వాళ్లు గెలిచినంత గొప్పగా మిమ్మల్ని గెలిపించుకున్నారు. వీధిలో ఒక మీటింగ్. ఒక బహిరంగ సభ... ఏదైనా కానీ.. అందరూ వచ్చేసేవారు. మీ నాన్న దగ్గర పదవులు పొంది రాజకీయంగా ఎదిగి గొప్పవాళ్లుగా తెలిసిన పెద్దలు విశ్వాసఘాతుకానికి ఎన్నోసార్లు ఒడిగట్టారు. పేదల ప్రేమ చూశాక, వీళ్ల విశ్వాస ఘాతుకం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది?
షర్మిల: నిజంగానే మీరు చెప్పినట్లు ప్రజలైతే, రాజన్న కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మనస్ఫూర్తిగా తమ సొంత కుటుంబమన్నట్లు అక్కున చేర్చుకున్నారు. ఎక్కడికిపోయినా, ఎప్పుడు పోయినా, ‘‘అమ్మా నువ్వు భయపడొద్దు, మేం మీకున్నామమ్మా’’ అని ధైర్యం చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్న కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీరు చెప్పినట్లు, నాన్న వల్ల పదవులు అనుభవిస్తున్న వాళ్లు మా గుండెల మీద తన్నారు. అయినా లోకంతీరు ఇంతేలే అనుకున్నాం.  కానీ ఏ పార్టీకైతే నాన్న 30 ఏళ్లు సేవచేశారో, అదే పార్టీ నాన్నను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అదే పార్టీ నాన్నకున్న మంచిపేరును నాశనం చేసే ప్రయత్నం చేసింది. అదిమట్టుకు భరించలేకపోయాం. దానికి ఈ రోజువరకు అన్న, అందరం చాలా బాధపడుతున్నాం. కానీ, దేవుడే మా ధైర్యం, ప్రజలే మా బలం.
 
 రామ్: మీరు మాట్లాడుతుంటే.. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. రెండేళ్ల తర్వాత అనుకుంటా... మీ అన్నయ్య, మీ నాన్నగారి సమాధి దగ్గర కూర్చొని మీ నాన్నకు నివాళులర్పించారు. ఆయన్ను చూస్తుంటే.. ఆయన మనసులో ఒక ప్రశాంతత కనిపించింది. ఇంకో కోణంలో చూస్తే ఏదో తెలియని దీక్ష కనపడింది.. ఇంకో కోణంలో చూస్తే ఏదో సున్నితమైన బాధ కనిపించింది. మేమైనా దూరం నుంచి చూస్తాం జగన్‌మోహన్‌రెడ్డిని. మిమ్మల్ని చెల్లెలు కంటే కూడా ఒక కూతురులా చూసుకుంటారు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన మనసులో మీకు ఏం కనపడింది? ప్రశాంతత కనపడిందా? తుఫాన్ కనపడిందా? తుఫాన్ కంటే ముందుండే ప్రశాంతత కనపడిందా?
షర్మిల: అన్న అక్కడ కూర్చున్నప్పుడు మా కుటుంబానికి జరిగిన అన్యాయం, అవమానం కనబడ్డాయి. కానీ అన్న అలాంటివాడు కాదు. ఏ కోపం ఉంచుకోడు. ఏ ద్వేషం ఉంచుకోడు. మనసులో బాధ అనిపించినా, మనసులో ఎంత కష్టంగా ఉన్నా, దేవునికే వదిలేస్తాడు. దేవుని దగ్గరే పెడతాడు. అన్న అక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా... ఒక ఆలోచనైతే అన్నకు వచ్చి ఉంటుంది... నాన్న నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. వీళ్ల బాధ్యత నాది. నాన్న లేని లోటు వీళ్లకు కనిపించకుండా, నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు నాన్నా... అని ఆ క్షణంలో ప్రార్థన చేసి ఉంటాడు. తనకు జరిగిన అన్యాయానికి మా కుటుంబం 16 నెలలు చాలా చాలా బాధపడ్డాం. కానీ అన్న ఆ క్షణంలో అది అనుకుని ఉండడు... అన్న అక్కడ కూర్చున్నప్పుడు. కుట్రలు పన్ని, స్వార్థం కోసం మా రాష్ట్రాన్ని, మా జాతిని విడదీయాలనుకుంటున్నారు. మా జాతిని అవమానిస్తున్నారు. ఇది అడ్డుకునేందుకు నాకు శక్తినివ్వు దేవా! నాకు సహాయం చెయ్యి నాన్నా! అని అనుకుని ఉంటాడు.., అని నాకు అనిపిస్తోంది. నాకు తెలుసు.. దట్స్ హిమ్.
 
 రామ్: కుట్రలన్నింటినీ చూసేశారు. ఇప్పుడు విభజన కుట్ర కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద తుఫాను అక్కడ జరుగుతుంటే, మీరు దూరంగా ఇక్కడి నుంచి ఆ ప్రక్రియను చూస్తున్నారు. ఏమనిపిస్తోంది?
షర్మిల: నాకే కాదు.. మూడో మనిషి ఎవరు చూసినా... పక్క రాష్ట్రం వాళ్లు మన రాష్ట్రాన్ని చూసినా... జాలిపడి బాధపడే స్థితిలో మనం ఉన్నాం. నాన్న మన రాష్ట్రాన్ని... దేశానికే ఒక అన్నపూర్ణగా చేయాలని, దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంచాలని అనుకుంటే, కుక్కలు చింపిన విస్తరిలా చేశారు... అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి, చేసింది సరిపోలేదన్నట్లు, వాళ్ల స్వార్థం కోసం మన రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దానికి మద్దతు పలుకుతున్నారు చంద్రబాబుగారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇది మన ఖర్మ. ఇలాంటి వాళ్లు నాయకులుగా ఉండడం మన ఖర్మ. నాన్న ఉన్నప్పుడు విభజన అనే గొడ్డలికి ఎదురుగా నిల్చొని ఒక్కడిగా అడ్డుకున్నాడు. మన రాష్ట్రం, మన జాతి ఒక్కటిగా ఉంటేనే మనకు బలం. కనుక మన రాష్ట్రాన్ని చీలిపోకుండా దేవుడు కాపాడతాడని నా నమ్మకం. త్వరలో ఎలక్షన్లు వస్తాయి. 182 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని నా నమ్మకం. దేవుని మీద నా నమ్మకం.
 
 రామ్: ఈ నంబరేంటి 182?
షర్మిల: నా నమ్మకం...
 
 రామ్: కడప పార్లమెంట్ స్థానం నుంచి నిలబడాలని మీరు బాగా ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నాయకత్వం దీనికి ఒప్పుకోవడం లేదని, అందుకే మీకు, మీ అన్నయ్య జగన్‌కు మధ్య మనస్పర్థలు వచ్చాయని అందరూ చెప్తున్నారు. ఈ విషయం ఎంతవరకు నిజం? మీరెందుకు ఖండించలేదు?
షర్మిల: నేను ఏదో తప్పు చేసినట్టు వివరణ ఇచ్చుకోవాలన్న అవసరం నాకు అనిపించలేదు. కానీ మీరు అన్నట్లు... నేను కడప సీటు కావాలనుకుంటున్నానని, అది అన్న ఇవ్వడం లేదని, నాకు అన్నకు విభేదాలున్నాయని మన ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నాయకులు ఇప్పటికి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్తేనే మంచిదేమో. కడప లోక్‌సభ సీటు అవినాశ్‌కు ఇవ్వాలని, ఎప్పుడో డిసైడైపోయింది. అవినాశ్ ఎవరు? మా చిన్నాన్న కొడుకు. అంటే నాకు తమ్ముడు. నేను ఎప్పుడూ కడప సీటు గురించి ఆలోచన చేయలేదు. అది కావాలని అనుకోలేదు. కడప సీటు నాకు ఇమ్మని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు.
 
 రామ్: నిప్పు లేకుండానే పొగ అంటే ఇదేనేమో!
షర్మిల: కచ్చితంగా అదే. ఇక నా విషయానికి వస్తే... నేను నిలబడాలనే అనుకుంటే., ఒక కడప ఎందుకు నిలబడాలి? దేవుని దయవల్ల, నాన్న లెగసీ వల్ల, అన్న కోసం చేసిన పాదయాత్ర వల్ల, ప్రజల అభిమానం, ఆశీస్సుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నుంచి నిలబడినా... నేను గెలుస్తానన్న నమ్మకం చాలామందికి ఉంది. నేను కడప సీటు మాత్రమే కావాలనుకుంటున్నాను అన్నదాంట్లో లాజిక్ ఏముంది? కేవలం దురుద్దేశంతో అన్నను చెడుగా చూపాలని పనిగట్టుకుంది... మన ఎల్లో గ్యాంగ్. అందుకని ఈ తప్పుడు ప్రచారాలు. వీళ్లకు నిజాలతో పనిలేదు, వీళ్ల అబద్ధాల వల్ల ఇంకొకరి మనసు బాధపడుతుందన్న ఆలోచన లేదు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహ అంతకంటే లేదు. వీళ్లకు కావాల్సిందల్లా వీళ్ల స్వార్థం. అన్న రాకముందు పొలిటికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉన్నానని, పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లానని, అన్న వచ్చిన తర్వాత కనిపించడం మానేశానని అంటున్నారు. అన్న లేనప్పుడు నేను పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నానంటే.. అప్పుడు ఆ అవసరం ఉంది కనుక ఉన్నాను.. అప్పుడు పాదయాత్ర అవసరమైంది కనుక అది చేశాను.
 
 ఇప్పుడు అన్న వచ్చాడు. అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు.. ఇప్పుడు నా అవసరం లేదు. అవసరమైనప్పడు నేను ఉన్నాను. అవసరం వస్తే మళ్లీ ఉంటాను. కానీ అవసరం లేనప్పుడు నేను ఉన్నాను అంటే, అది అనవసరంగా ఉన్నట్లు అవుతుంది కదా! నాన్నను చూడ్డానికి ఇడుపులపాయకు అన్న వెళ్లాక ఒంటరిగా వెళ్లాను. చాలామంది మనుషులుంటారు. నాకు వ్యక్తిగతంగా నాన్న దగ్గర ఒంటరిగా కూర్చోవడమే ఇష్టం. అదేమైనా నేరమా? మా నాన్న దగ్గరకు నేను ఎలా వెళ్లాలి? ఎలా కూర్చోవాలి? అన్నది కూడా ఈ ఎల్లో గ్యాంగే నిర్ణయిస్తుందా? ఏమిటండీ ఇది? ఐయామ్ ఎ ప్రైవేట్ పర్సన్. నా గురించి ఇంత చర్చ అవసరమా? ఇన్ని అబద్ధాలు అవసరమా? నాకు అన్నకు ఏ విభేదాలూ లేవు. ఏ మనస్ఫర్థలూ లేవు, రావు. అన్నకు నన్ను తన పెద్ద కూతురుగా చూసుకునేంత పెద్దమనసు దేవుడిచ్చాడు. నాన్న, అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నా మేలు కోరేవారిలో అన్న మొదటివాడు. పాదయాత్ర చేసినన్ని రోజులూ ప్రతిరోజూ నా కోసం చాలా బాధపడ్డాడు. పాప ఎలా ఉందో, ఎలా చేస్తుందో, ఎండలో ఎలా నడుస్తుందో, రోజూ 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ పెట్టొద్దండీ.. ఎండలుంటే పన్నెండే పెట్టండి.. పదే చేయండి.. అని పదే పదే చెప్పి పంపించేవాడు. అన్న ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మి. నా మీద ఈగ కూడా వాలనీయడు. నాక్కూడా అన్నంటే ప్రాణం. అన్నకు ఇబ్బంది కలిగించేది నేను ఎప్పటికీ ఏదీ చేయను. అసలు నాన్న, అమ్మ మమ్మల్ని ఎలా పెంచారో, ఎంత బాండెడ్‌గా పెంచారో... ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నవారికి మామూలు భాషలో విడమర్చి చెప్పినా అర్థం చేసుకునేటంత మనసులు వీరికి లేవేమో అనిపిస్తోంది. మమ్మల్నే కాదు... అనిల్, వదిన కూడా... నలుగురం చాలా బాగుంటాం. అన్నకు నా గురించి బాగా తెలుసు. నేను ఏదైనా చేయాలనుకుంటే,  ఎంత కమిటెడ్‌గా చేస్తానో తెలుసు. నేను గనుక నోరు తెరిచి.. ‘అన్నా నాకు రాజకీయాల్లోకి రావాలనుంది. నాకు ఈ సీటు ఇయ్యన్నా’ అంటే.. కాదంటాడా.. అఫ్‌కోర్స్ నాట్. దట్స్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. నిజానికి అన్నే నాతో అన్నాడు... పాలిటిక్స్‌లోకి వస్తానంటే, వై నాట్ పాపా... మన పార్టీకి వ్యూహాత్మకంగా మంచి చర్య అవుతుందని అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు.. నువ్వు వస్తానంటే.. రామునికి లక్ష్మణుడు తోడు ఉన్నట్లే. అది చాలా గ్రేట్ కాంప్లిమెంట్.. నాకు రామాయణం గురించి, మహాభారతం గురించి పెద్దగా తెలియదు.. కానీ అది చాలా గ్రేట్‌కాంప్లిమెంట్ అని మాత్రం తెలుసు.
 
 రామ్: కడప కాదంటున్నారు... మరి రాజకీయాలు ఎక్కడి నుంచి.. వేర్ డు యు వాంట్ టు స్టార్ట్ యువర్  పొలిటికల్ లైఫ్?
షర్మిల: (నవ్వుతూ) కడప నుంచి నిల్చోనని అనుకున్నానని తప్ప... ఇంకెక్కడి నుంచైనా నిలబడతానని ఎప్పుడన్నాను...
 
 రామ్: ఎక్కడ నిలబడినా కూడా ఆంధ్రరాష్ట్రంలో ఉన్న అభిమానం వల్ల మీరు గెలుస్తారని ప్రజలే చెప్పారని మీరంటున్నారు కదా..
షర్మిల: నేను ఎక్కడి నుంచి నిల్చున్నా... గెలుస్తానన్న నమ్మకం ఉందని చెప్పాను గాని... నిల్చుంటున్నానని ఎప్పుడన్నాను?
 
 రామ్: మీలాంటి వాళ్లు రాజకీయాల నుంచి దూరంగా ఉంటే, సేవాగుణం ఉన్నవాళ్లు, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకునేవాళ్లు, వాళ్లకు మీరు ఎలాంటి సిగ్నల్ పంపిస్తారు. మీ కుటుంబం సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఎంకరేజ్ చేసే కుటుంబం.
షర్మిల: మనిషికి మనిషి సేవ చేయడం ఒక్క రాజకీయాల వల్లే అవుతుందని నేను అనుకోను. మనిషికి మనిషి ఎన్నోరకాలుగా చేయవచ్చు. సేవ అందుకునే వాడికి సేవ చేస్తున్నవారు ఎవరో తెలియకుండా చేయడం ఉన్నతమైన సేవ అంటారు. కేవలం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే సేవలు చేస్తే.,, సేవాభావమే చచ్చిపోతుందని అంటారు. కాబట్టి ఒక అపరిచితుడిలా అజ్ఞాతంలో ఉండీ సేవ చేయొచ్చు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సేవ చేయొచ్చు. నాన్న రాజకీయాల్లోకి రాక ముందే ఒక డాక్టర్‌గా ఉచితంగా సేవచేశారు. నాన్న మొదలుపెట్టిన హాస్పిటల్, కాలేజెస్, స్కూల్స్... ఈరోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. అమ్మ అయితే నాన్న ముఖ్యమంత్రి అయినరోజు నుంచి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రాం, ప్రతి స్కీమూ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా చేరాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రతిపూటా ప్రార్థించేవారు. సేవ చేయడానికి పదవే ఉండనవసరం లేదు.. డబ్బే ఉండనవసరం లేదు. సేవ చేయడానికి అన్నింటికంటే ముఖ్యమైంది, కావాల్సినది పెద్ద మనసు.
 రామ్: సేవ చేయాలన్న ఆకాంక్ష అంత గొప్పగా ఉన్నప్పుడు, రాజకీయాల్లోకే రావచ్చు కదా. ఇప్పుడు చేస్తున్న సేవ కంటే గొప్పగా చేయొచ్చు కదా.
షర్మిల: అదే కదా నాన్న చేసింది. అదే కదా అన్న ఎంచుకున్నది. ఓదార్పుయాత్ర చేసినప్పుడు అన్న ప్రజలను చాలా దగ్గరగా చూశారు. సామాన్యుల ఇళ్లలో, పూరి గుడిసెల్లో గంటల తరబడి ఎన్నో వందల కుటుంబాలతో గడిపారు. వాళ్ల జీవితాలను దగ్గరగా చూశారు. వారి జీవితాలను అర్థం చేసుకున్నారు. కనుకనే అన్నకు రాజకీయాల్లో కొనసాగాలన్న దీక్ష పెరిగింది. నాన్న పోయాక అంతా శూన్యంలా అనిపించేది. అంతా నిస్తేజంగా ఉండేది. జీవితం మన కోసం కాకుండా, ప్రజల కోసం జీవించడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉందని, అర్థం ఉందన్న ఆలోచన అన్నకు ఓదార్పులోనే కలిగింది. కనుకనే ఈ రోజు రాజకీయాలు అంత ఫోకస్డ్‌గా, అంత చిత్తశుద్ధితో, అంత నిజాయితీతో చేయగలుగుతున్నాడు. సో యెస్.. పాలిటిక్స్ ఈజ్ ఎ గుడ్‌లైన్.
 
 రామ్: మళ్లీ జగనన్నయ్య రాజకీయ ప్రస్థానం గురించే మాట్లాడారు.. మీ విషయాన్ని మాత్రం చాలా చాకచక్యంగా దాటేస్తున్నారు.. రాజకీయాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేనేజ్ చేయగలుగుతున్నారంటే.. రాజకీయాల్లో మీరు మంచి పట్టు సాధించినట్టే.. మరి రాజకీయాలను ఎందుకు కాదనుకుంటున్నారు? ఆదరణ లేక కాదు.. ఆలోచన లేక కాదు.. అభిమానం లేక కాదు.. వై వుడ్ యు నాట్ వాంట్ టు బి ఇన్‌పాలిటిక్స్?
షర్మిల: నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలే నాన్నను మా నుంచి దూరం చేస్తున్నాయని... రాజకీయాల వల్లే నాన్న మాతో లేడు... అన్న భావన నాకు చాలా కాలం ఉండేది. కనుక ఆ సబ్జెక్ట్ అంటేనే నచ్చేది కాదు. నేను ఎప్పుడైనా రూమ్‌లోకి అడుగుపెడితే, ‘పాప వచ్చేసింది, పాలిటిక్స్ ప్యాకప్’ అనేవారు నాన్న. అంత అయిష్టం ఉండేది నాకు. కానీ నాన్న చాలా మంచి రాజకీయ నాయకుడిగా, చాలా గొప్ప స్టేట్స్‌మన్‌గా నిలిచిపోయాడు. అన్న కూడా మంచి రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించే ఒక నాయకుడిగా మిగిలిపోతాడన్న నమ్మకం నాకుంది. కోట్లమంది ప్రజలకు, పేదలకు ఎవరూ ఊహించనంత గొప్ప మేలు చేస్తాడన్న నమ్మకం నాకుంది. నాకు అన్న మనసు తెలుసు. అన్న సామర్థ్యమూ తెలుసు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇందులో నాకు ఏ మాత్రమూ అనుమానం లేదు. అంతేకాకుండా, రాజకీయాలంటే ఒక పార్ట్‌టైమ్ ప్రొఫెషన్‌లాంటిది కాదు. అప్పుడప్పుడు వెళ్లి, అప్పుడప్పుడు చూసుకొనేదీ కాదు. రాజకీయాలంటే... పదిమందిని నీ కింద పెట్టుకుని జీతమిచ్చి చేసే వ్యాపారంలాంటిది కూడా కాదు. రాజకీయమంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈ టైమ్ ఆ టైమ్ అని తేడా లేకుండా అందుబాటులో ఉండడం. రాజకీయాలంటే... వారి ప్రతి సమస్యా తీర్చే ప్రయత్నం చేయడం. రాజకీయాలంటే ఇట్స్ ఎ గ్రేట్ కమిట్‌మెంట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రామిస్. వాట్ యు ఆర్ మేకింగ్ టు గాడ్ అండ్ టు ద పీపుల్. ఇట్స్ ఎ టైమ్ డిమాండింగ్ ప్రొఫెషన్. అంత టైమ్ నేను ఇవ్వలేనేమో... నాకు ఒక బాబు, ఒక పాప... అంజలి అండ్ రాజా. మా పెద్దమ్మకు కూతురు లేదని నేను తనను కూడా అమ్మా అని పిలుస్తాను. పెద్దమ్మ.. నా కూతురుతో అన్నారట.. ‘జిల్లీ, అమ్మ ఎంపీ అయితే బాగుంటుందని చాలామంది అంటున్నారు’ అని! ‘లేదు అమ్మమ్మా... అమ్మ పాలిటిక్స్‌లోకి వెళితే.. ఇక ఫ్యామిలీ లైఫ్ చచ్చిపోతుంది’ అందట జిల్లీ. అది నిజమని నేను అనడం లేదు. కానీ నా పిల్లలకు అర్థం చేసుకునేటంత వయసు రాలేదేమో అని నా అభిప్రాయం.
 

 రామ్: మీ మాటల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి మంచితనం కనపడుతుంది. వారు  మీతో పాటు పంచుకున్న కుటుంబ విలువలు కనపడుతున్నాయి. ఇవన్నీ వింటుంటే ఇంకో ప్రశ్న అడగబుద్ధేస్తుంది... రాజకీయాల్లో ఉంటే అభద్రతాభావం, అల్పత్వం. మీకు గుర్తుందో లేదో... మీరు పాదయాత్రకు వెళ్లిన వెంటనే అభిమానాలు వెల్లువెత్తాయి. చాలామంది వచ్చి మిమ్మల్ని కలవడం.. చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగింది. అది చూసి వెంటనే కొన్ని రాజకీయ పార్టీలు మీ మీద, మీ భర్త అనిల్‌గారి మీద ఏవేవో సందేహాలు, అనుమానాలు సృష్టించారు.  అందుకే మీరు ఈ రాజకీయాల్లోకి రావడంలేదేమోనని అనుమానం!
షర్మిల: మీడియాకు అనుమానం కొత్తకాదు. మాకు నమ్మకం కొత్త కాదు. ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం కొత్త కాదు..
 
 రామ్: నీచ రాజకీయాలు చూసి, అలాంటి బురద రాజకీయాల్లో కాలు పెట్టడానికి సందేహిస్తున్నారా?
షర్మిల: నిజమే. రాజకీయాల్లో చాలా బురద ఉంది. కానీ బురదలోనే కమలం వికసిస్తుందంటారు. మేం మాట పడ్డాం... అంటే, ఒక మంచి పని చేస్తూ మాటపడ్డాం. ఫర్వాలేదు.. నాకు, అనిల్‌కు ఏ బాధా లేదు. మా మీద పడిన బురదను ప్రజలు తమ అభిమానంతో కడిగేశారు. బురద కాదు కారణం... బురదకు భయపడి కాదు రాజకీయాల్లోకి అడుగుపెట్టంది. రాజకీయాలు నాట్ మై కప్ ఆఫ్ టీ. మీరు ఎన్నిసార్లు ఎలా తిప్పి తిప్పి అడిగినా నా సమాధానం అంతే.
 
 రామ్:పార్లమెంటుకు వెళ్లనంటున్నారు, అసెంబ్లీకి రానంటున్నారు. మీ భవిష్య ప్రణాళిక ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు?
షర్మిల: ఎక్కడికి రానన్నా... ఎక్కడికి పోనన్నా... కర్తవ్యం పిలిచినప్పుడు బాధ్యతగా పనిచేస్తాను. మాటిస్తున్నాను... నేను జగనన్న బాణాన్ని. జగనన్న వదిలినప్పుడు ఎక్కడికైనా దూసుకుపోతాను, ఎందాకైనా దూసుకుపోతాను. నాన్న ఆశయాల కోసం, అన్న కోసం జాన్ భీ హాజర్ హై!
 
 రామ్: మీకు, జగనన్నకు మధ్యలో మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సమయంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది... అప్పుడే మీరు పాదయాత్రకు వెళతానంటే జగనన్న ఒప్పుకున్నారు. అప్పుడు భారతమ్మ జగనన్నతో జైల్లో అడిగారట - ‘అందరూ మీకు, షర్మిలమ్మకు మధ్య ఏవో మనస్పర్థలు తెచ్చి కుటుంబాన్ని రెండుగా చీల్చేస్తారని అంటున్నారు. పాపను పాదయాత్రకు పంపిస్తే అలా జరుగుతుందంటున్నారు. ఏం చేద్దాం జగన్?’ అని! అప్పుడు జగనన్న చెప్పారట - ‘నేను నా చెల్లెల్ని నమ్మలేని రోజు రాజకీయాలనే వదులుకుంటాను. నాకు నా చెల్లెలు కంటే రాజకీయాలు గొప్పవి కావు’ అని! దానిపై మీ స్పందన...
షర్మిల: థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు. విశ్వాసం, నమ్మకం లేనిదే మానవ సంబంధాలే లేవంటారు. మాది రక్త సంబంధం... థాంక్ గాడ్...
 
http://www.sakshi.com/news/family/exclusive-interview-ys-sharmila-with-family-88830?pfrom=home-top-story
Share this article :

0 comments: