బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?

బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?

Written By news on Saturday, December 28, 2013 | 12/28/2013

బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?
విభజన బిల్లుపై ‘సమైక్య సింహం’ సంతకమెందుకు చేశారు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ధ్వజం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు ఎందుకు ఇవ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరినీ వెంట తీసుకెళ్లకుండా చంద్రబాబు ఒక్కరే రాష్ట్రపతిని కలిశారంటే రాష్ట్రాన్ని విభజించమని చెప్పడానికేనని అనుమానం వ్యక్తం చేశారు. ‘సమైక్య సింహం’ అని తన తాబేదార్లతో పొగిడించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన బిల్లు వస్తే దానిని తిప్పి పంపకుండా సంతకమెందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే బాబు, కిరణ్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ ఎమ్మెల్యేల చేత అఫిడవిట్లు ఇప్పించి ఉండేవారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారని.. అయితే సీఎం, స్పీకర్, బాబు మాత్రం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బిల్లుపై చర్చలో పాల్గొనడం అంటే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే కదా అని ఆయన ప్రశ్నించారు.
విభజన ప్రక్రియ ముందుకు పోతుంటే ఏ దశలోనైనా కిరణ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నిం చారు. చంద్రబాబు విభజన కోరుకుంటున్నారో, సమైక్యం కావాలనుకుంటున్నారో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్‌కు బుద్ధి, జ్ఞానం ఉందా అని తమ నాయకుడు జగన్ అంటే కొందరు సభాహక్కుల తీర్మానం పెడతామని బయలుదేరారని, కానీ ఆయన అడిగినదాంట్లో తప్పేమీ లేదన్నారు. బుద్ధి, జ్ఞానం అనే మాటలు బూతు పదాలేమీ కావన్నారు. కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, వారు చెప్పినట్టే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ విభజనపై చర్చ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న స్పీకర్‌కు అక్కడి అసెంబ్లీ విభజనకు ముందుగానే ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి గుర్తు చేస్తూ.. బుద్ధి, జ్ఞానం ఉందా అని తమ నాయకుడు ప్రశ్నించారని, దీనిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని అంబటి కోరారు. అసలు ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకునికీ బుద్ధి, జ్ఞానం ఉందా? ఉంటే ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనకు సహకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సభా హక్కుల తీర్మానాలకు తాము బెదరబోమని, రాష్ట్ర సమైక్యత కోసం సర్వశక్తులూ ఒడ్డుతామని అంబటి చెప్పారు.
 
Share this article :

0 comments: