పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా

పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా

Written By news on Monday, January 13, 2014 | 1/13/2014

పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా: సీఎం కిరణ్ పై జగన్ ఫైర్
 సమైక్య శంఖారావంలో సీఎం కిరణ్‌పై నిప్పులు చెరిగిన జగన్
  ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారు
  సోనియా గీసిన గీత దాటకుండా.. ప్రజలను మోసం చేస్తున్నారు
  ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు
  ప్రజా సమస్యలను గాలికొదిలి అసెంబ్లీలో విభజనపై చర్చిస్తున్నారు
  ఈ ముగ్గురికి ప్రజల ఉసురు తగులుతుంది.. ప్రజా ఉప్పెనలో వారి అడ్రస్‌లు గల్లంతవుతాయి

 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:

 ‘‘ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న దిక్కుమాలిన ఆలోచనతో కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన రాష్ట్ర ప్రజలను అమ్మడానికి సిద్ధపడ్డారు. సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పాలన చేస్తూ సమైక్య ముసుగు కప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ ఒకరోజు వస్తుంది. ఆ రోజున 70 శాతం మంది ఉసురు తాకి, అది ఉప్పెనై లేస్తుంది. ఆ ఉప్పెనలో సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్ గల్లంతవుతుంది...’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలన్న చర్చ జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనపై కాలర్ పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. ప్యాకేజీలు అడుగుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం చిత్తూరు జిల్లాలో మూడో విడత ఎనిమిదో రోజు చిత్తూరు నియోజకవర్గంలో కొనసాగింది. చిత్తూరు పట్టణం, పాలడుగు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.

  ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే....

 రూ. 5 పెట్టి బిందెడు నీళ్లు కొంటున్నారు చిత్తూరులో రూ.2 నుంచి రూ.5 పెట్టి బిందెడు నీళ్లు కొనాల్సి వస్తోందని అక్కాచెల్లెమ్మలు ఆవేదనతో చెబుతున్నారు. వంటగ్యాస్‌కు సబ్సిడీ కూడా అందడం లేదని బాధపడుతున్నారు. కరెంటు చార్జీలు కట్టాలంటే షాక్ కొడుతోందని, వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు దొరకటం లేదని రైతన్నలు బాధపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలు తొలగించారు. ఈరోజు ఈ ప్రజాసమస్యల్లో ఏ ఒక్కదానిపై కూడా అసెంబ్లీలో చర్చ జరగడం లేదు.

రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలనే అధ్వాన రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఈ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే చాలు. వాళ్ల నిజ స్వరూపం బయటపడుతుంది. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు అసెంబ్లీకి వస్తారు. కానీ అసెంబ్లీ ఫ్లోర్ మీద మాత్రం కనిపించరు. చంద్రబాబు అయితే ఏసీ రూంలో కూర్చొని ఓవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విడగొట్టాలని అనిపిస్తారు. వీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నారు. రేప్పొద్దున మీరిద్దరు ఈ జిల్లాకు వచ్చినపుడు చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడిగితే ఏం చెబుతారు? సాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలని రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు?
 
 సమైక్య తీర్మానం పెట్టాల్సిందే..

 మన రాష్ట్రానికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అన్యాయం జరుగుతోంది. మనకు సంబంధం లేకుండానే మనల్ని విడగొడతారట. దేశంలోని ప్రతి నాయకుడు కూడా ‘మీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది’ అని చెప్తున్నారు. ఇది మనమంతా ఏకం కావాల్సిన సమయం. కానీ ఢిల్లీ కుమ్మక్కు రాజకీయాలను బద్దలు కొట్టాల్సింది పోయి కిరణ్‌కుమార్‌రెడ్డి... సోనియా గీసిన గీత దాటడం లేదు. ఆమెను నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ మన గడ్డపై పుట్టి మనకే ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికైనా వీరిద్దరూ సమైక్య రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి.

కేంద్రం నుంచి బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటల లోపే సీఎం సంతకం చేసి అసెంబ్లీకి పంపించారు. సోనియా విభజన చేయాలని చెబుతుంటే ముఖ్యమంత్రిగా అందుకు సహకరిస్తున్నారు. విభజనపై అధికారులకు ఆదేశాలిస్తూ ప్రతి అడుగులోనూ సహకారం అందిస్తూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులా? వీరి కుమ్మక్కు రాజకీయాలు ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు. 70 శాతం మంది ప్రజలు చూస్తున్నారు. వీరి ఉసురు మీకు తగులుతుంది. సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ అడ్రస్‌లు గల్లంతవుతాయి. త్వరలోనే ఎన్నికలు వస్తాయి. అప్పుడు మనందరం ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలుకొడదాం. ఆ కోటను మనమే పునఃనిర్మిద్దాం. మన రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికుందో చూద్దాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం.’’
 
 సమస్యలు తెలుసుకుంటూ..

 ఆదివారం నాటి యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. రెడ్డిగుంటలో పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్.. అక్కడ్నుంచి మాపాక్షి క్రాస్ చేరుకుని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోపాలపురంలో మహిళలను పలకరించి వారి సమస్యలపై ఆరా తీశారు. చీలాపల్లి క్రాస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం 189 కొత్తపల్లె మీదుగా గుడిపాల చేరుకుని సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం చిత్తూరు చేరుకున్న జగన్‌కు యువకులు మోటారు సైకిళ్ల ర్యాలీతో స్వాగతం పలికారు.

గ్రీమ్స్‌పేట, కన్నన్ కాలేజీ మీదుగా దర్గా, ఎంజీఆర్ వీధి, ఎంఎస్‌ఆర్ సర్కిల్, పీసీఆర్ సర్కిల్ వరకు యాత్ర సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత జగన్ మూడో విడత యాత్రను ముగించారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, ఎన్.గాంధీ బాబు, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, రోజా,  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
ముగిసిన మూడో విడత యాత్ర

 చిత్తూరు జిల్లాలో మూడో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ముగిసింది. ఈనెల 5 నుంచి మొదలైన మూడో విడత యాత్ర 8 రోజులు కొనసాగింది. చిత్తూరు బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వె ళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరులో 9 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్... 15 కుటుంబాలను ఓదార్చినట్లు వివరించారు
Share this article :

0 comments: