పేదోడి పెద్ద కొడుకు వైఎస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదోడి పెద్ద కొడుకు వైఎస్

పేదోడి పెద్ద కొడుకు వైఎస్

Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014

పేదోడి పెద్ద కొడుకు వైఎస్
సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఒక మనిషి మరణించి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ  జనం గుండె చప్పుళ్లలో సజీవంగానే ఉన్నారు.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహా నాయకుడు. రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు చిరునామా. పేదవాడి గుండె చప్పుడును హృదయంతో విన్న డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి కుటుంబానికి ఆయన పెద ్దకొడుకు. అలాంటి ప్రియతమ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత కనుమరుగయిపోయింది. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
 
 పస్తుతం రాజకీయాలను ఒక చదరంగంలా మార్చేసి, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని లెక్కలేస్తున్నారే తప్ప పేద ప్రజల గురించి ఆలోచించడమే లేదని అన్నారు. నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ శుక్రవారం ఐదోరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 వైఎస్ అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు..
 
 ‘‘ఎనిమిదిన్నర కోట్ల మందిలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇస్తాడు. పదవిలో ఉన్నప్పుడు ప్రజల కోసం మనమేం చేశామన్న ప్రాతిపదికగానే ప్రజలు మనల్ని చనిపోయాకగానీ, పదవి నుంచి దిగిపోయాక గానీ గుర్తు పెట్టుకుంటారు. మహానేత మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయన మా గుండెల్లోనే సజీవంగా ఉన్నాడని ఇంత మంది గర్వంగా చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం.. పదవిలో ఉన్న ప్రతిక్షణం ఆ నేత ప్రజల బాగోగుల కోసం పరితపించడమే. మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను అతి దగ్గర నుంచి గమనించారు.
 
 పేదవాడు అప్పుల ఊబిలో కూరుకు పోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి పిల్లల చదువులు, మరొకటి అనుకోకుండా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపితే పేదవాడిని అప్పుల ఊబి నుంచి బయటపడేయగలం అని వైఎస్ భావించారు. అందుకే పెద్ద చదువులకు పేదరికం అడ్డురాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఈ పథకాలను రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేశారు. ఎంతమంది అర్హులుంటే అంత మందికీ ప్రయోజనం కలిగేలా పథకాలను తీర్చిదిద్దారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు పూయించడం కోసం అనుక్షణం తపన పడ్డాడు. అలా పేదవాడి కుటుంబంలో పెద్దకొడుకయ్యాడు. ఇలా దివంగత నేత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
 
 ఇదా రాజకీయం..?
 
 మహానేత మనకు దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల కోసం తపించే ఒక్క నాయకుడూ లేకుండా పోయాడు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేదే లేకుండా పోయింది. ఎత్తులు, పైఎత్తుల రాజకీయ చదరంగంలో పేదవాణ్ణి ఎప్పుడో పక్కకు నెట్టేశారు. ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? ప్రత్యర్థిపై ఎలా కేసులు పెట్టాలి? ఎలా జైల్లో పెట్టాలి? అన్న అంశాలే రాజకీయాలైపోయాయి. అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి చూస్తే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతుంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక చేత్తో సైగ చేసి తన ఎమ్మెల్యేల్లో కొందరితో సమైక్య మనిపిస్తారు. మరోచేత్తో సైగచేసి ఇంకొందరితో విభజన కేకలేయిస్తారు. ఇదా రాజకీయం..? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ ప్రాంతానికైనా వెళ్లినా.. ‘నన్ను నమ్మండి. మీకు నేనున్నాను. నన్ను చూసి ఓటేయండి’ అని అడిగే దమ్మూ, ధైర్యం లేని వారు నాయకులుగా చలామణి కావడమే నేటి రాజకీయాల్లో దౌర్భాగ్యం. ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసుకుని ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రీ లేరు.
 
 పతిపక్ష నేతా లేరు. ఒకరేమో సీఎం కుర్చీలో ఎంతకాలం వీలైతే అంతకాలం ఉండేందుకు సోనియా గీసిన గీత దాటకుండా ‘సమైక్య’ ముసుగులో విభజన కార్యక్రమాన్ని సజావుగా కొనసాగిస్తారు. మరొకరేమో ప్యాకేజీల బేరసారాలతో కుమ్మక్కవుతున్నారు. రాజకీయాల్లో విలువలు లేని ఈ పరిస్థితిని మనమే మార్చుకోవాలి. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో విభజన కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేద్దాం. 30 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం.
 
 సమైక్య రాష్ట్రాన్ని సజీవంగా ఉంచుకుందాం’’
 యాత్ర సాగిందిలా...
 
 గంగాధర నెల్లూరు నియోజక వర్గం తిరువీధి కుప్పం నుంచి యాత్ర మొదలైంది. తొలుత జగన్ ముసలయ్యగారి పల్లె చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆవులకొండలో పార్టీ జెండాను ఆవిష్కరించి తూగుండ్రం, పిలారికుప్పం, ఆముదాల క్రాస్ మీదుగా పాలసముద్రం మండలంలోకి ప్రవేశించారు. వీర్లగుడి గ్రామంలో చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతర అక్కడ శిఖామణి సుగానందం కుటుంబాన్ని ఓదార్చారు. ఏటుకూరి పల్లెలో చెరకు రైతులను కలసి బెల్లం తయారీ విధానాన్ని పరిశీలించారు. పాలసముద్రంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ్నుంచి నగరి చేరుకుని మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ గృహంలో బస చేశారు. పాలసముద్రం నుంచి నగరి వచ్చే దారిలో దాదాపు 15 కి.మీ. మేర జగన్ తమిళనాడు సరిహద్దులో ప్రయాణించారు. పల్లెపట్టు నియోజకవర్గ కేంద్రం దాటేంత వరకు దారిపొడవునా ఉన్న తమిళ గ్రామాల ప్రజలు జగన్‌ను ఆప్యాయంగా పలకరించారు. అతిమాంజరిపేట వద్ద జనం పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ ముందుకు సాగారు. యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
 రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (వైఎస్‌ఆర్‌టీయూసీ అనుబంధం) 2014 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. ఆరుమాకుల పల్లె సమీపంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్మిక విభాగం నేత జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, విద్యుత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: