అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యకాండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యకాండ

అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యకాండ

Written By news on Thursday, January 2, 2014 | 1/02/2014

అద్దంకిలో క‘రణం’
అద్దంకి, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యకాండకు తెగబడ్డారు. కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు వెంకటేష్ స్వయంగా తన కార్యకర్తలను దాడులకు ప్రోత్సహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
 
 వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలోని తమ కార్యాలయంలో బుధవారం న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు రాసాగారు. అలా వస్తున్న కార్యకర్తలను సింగరకొండ నుంచి వస్తున్న టీడీపీ నేతలు గేలి చేశారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. రాడ్లూ, కర్రలతో తీవ్రంగా కొట్టారు. భయంతో పరిగెడుతున్న కార్యకర్తల వెంటబడి మరీ కొట్టారు. చేతిలో ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని పరిగెడుతూ టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. డీవీకే రెడ్డి, దుగ్గి నర్సింహారెడ్డి, చుండూరు మురళీసుధాకర్, నర్రా నాగేశ్వరరావు, కర్రి పరమేశ్, సురేష్ (గొట్టిపాటి రవికుమార్ కార్ డ్రైవర్)లు గాయపడ్డారు. వారిలో డీవీకే, దుగ్గిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
 
 వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
 టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ ఆందోళనకు దిగారు. మేరదమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై కార్యకర్తలు, నాయకులతో ధర్నా నిర్వహించారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు మళ్లీ వైఎస్సార్ కాంగ్రేస్ కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  ప్రతిఘటించడానికి సిద్ధపడిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఇరువర్గాలతో పోలీసులు చర్చలు జరిపి నచ్చజెప్పి పంపారు.
 
 కరణం బలరాం కుమారుడి వీరంగం
 పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గం మాత్రం కయ్యానికి కాలుదువ్వింది.  పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించి అక్కడి నుంచి నిష్ర్కమిస్తుండగా, అక్కడికి చేరుకున్న టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ మళ్లీ ఉద్రిక్తతను రేకెత్తించారు. వెంకటేష్ ఏకంగా తన వాహనం ఎక్కి తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. ‘మా సంగతి మీకు తెలుసు... జాగ్రత్తగా ఉండండి...ఎవర్నీ తిరగనివ్వం’ అని హెచ్చరించారు. చేతిలో పార్టీ జెండా పట్టుకుని వేలు చూపిస్తూ ఊగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కరణం బలరాం కుమారుడిని నియంత్రించలేదు.. సరికదా ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని ఉన్న కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు. సీనియర్ నేత బలరాం, ఆయన కుటుంబ దౌర్జన్యకాండపై స్థానికులు విస్తుపోయారు.
 
 కరణం రౌడీయిజానికి భయపడం
 గొట్టిపాటి రవికుమార్
 కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ దౌర్జన్యాలకు భయపడేది లేదని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తానుగానీ తమ పార్టీగానీ ఎంతవరకైనా న్యాయబద్ధంగా పోరాడతామన్నారు. కరణం బలరాం ఒక ఫ్యాక్షనిస్టని, ఆయన నేరచరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. హత్య కేసుల్లో కరణం బలరాం జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ జ్ఞానోదయం కలగలేదన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ పిల్ల రౌడీ అవతారం ఎత్తి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
Share this article :

0 comments: