పచ్చటి రాష్ట్రంపై దుష్టత్రయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పచ్చటి రాష్ట్రంపై దుష్టత్రయం

పచ్చటి రాష్ట్రంపై దుష్టత్రయం

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

పచ్చటి రాష్ట్రంపై దుష్టత్రయం
సమైక్య శంఖారావంలో సోనియా, కిరణ్, చంద్రబాబుపై జగన్ ధ్వజం
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తన కొడుకును ప్రధానిని చేసేందుకు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సోనియా సిద్ధమవుతున్నారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్యాకేజీలతో బేరసారాలాడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుర్చీ కోసం రాష్ట్ర ప్రజలను అమ్మేసేందుకు సిద్ధపడుతున్నారు. పచ్చటి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకున్న ఈ దుష్ట త్రయం రాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాలకు గురై బంగాళాఖాతంలో కలవక తప్పదు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ గురువారం నాలుగో రోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సాగింది. రాత్రి 10 గంటల సమయంలో గంగాధర నెల్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 వారిద్దరి వల్లే సోనియాకు అంత ధైర్యం
 
 దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ విభజన ప్రక్రియ నడుస్తోంది. ఏ రాష్ట్రాన్నయినా విభజించాలంటే ముందు ఆ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల సమ్మతి తీసుకుంటారు. వారి అభిప్రాయం మేరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. అప్పుడు కేంద్రం విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి పంపాలి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగాలి. ఇక్కడ మాత్రం ఈ వ్యవహారం అంతా తలకిందులుగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా రాష్ట్రాన్ని విభజించేసి ఇక మీరు చర్చించుకోండంటోంది. ఇలా ఇష్టారాజ్యంగా మన రాష్ట్ర విభజనకు పూనుకునే ధైర్యం సోనియాకు ఎక్కడ నుంచి వచ్చింది? కుర్చీ కోసం సొంత ప్రజలను వంచించి అమ్మేసేందుకు సిద్ధపడే ముఖ్యమంత్రి ఉండటం వల్లే సోనియాకు అంత ధైర్యం వచ్చింది. కాలర్ పట్టుకు నిలదీయాల్సిన స్థానంలో ఉన్న ప్రతిపక్ష నేత ప్యాకేజీల బేరసారాలతో సరిపుచ్చుకునే వాడు కాబట్టే సోనియాకు అంత ధైర్యం వచ్చింది. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. 70 శాతం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్లయితే సోనియా ఇలా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించే సాహసం చేయగలిగేవారా?
 
 వైఎస్‌ను చూసైనా నేర్చుకోండి..
 
 ఒక్కసారి టీవీ ఆన్ చేసి అసెంబ్లీ సమావేశాల ప్రసారాలు చూస్తే చాలు.. రాజకీయాలెంత దిగజారిపోయాయో అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక చేత్తో సైగచేసి సీమాంధ్ర  ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మరోచేత్తో సైగచేసి తెలంగాణ ఎమ్మెల్యేల చేత విభజన డిమాండ్ చేయిస్తారు. ఒక పార్టీకి అధినేతగా ఉండి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోనే ఇలా రెండు రకాలుగా పలికించే వారు నాయకుడా? ఇక సీఎం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఆయన సీఎం కుర్చీ కోసం సోనియా గీసిన గీత దాటకుండా విభజన నాటకాన్ని సమైక్య ముసుగులో రక్తి కట్టిస్తున్నారు.
 
 సమ్మె చేసే ఉద్యోగులతో సమ్మె విరమింపచేస్తారు. ముసాయిదా బిల్లును ఆగమేఘాలపై 17 గంటల్లోనే అసెంబ్లీకి పంపుతారు. మరోవైపు.. విభజన తుపానును ఆపేవాడిగా టీవీల ముందుకొస్తారు. 70 శాతం మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తన కుర్చీ కోసం తాకట్టుపెడుతున్నారు. ఎత్తులు, పైఎత్తులతో సీట్లు, ఓట్ల కోసం నయ వంచనకు పాల్పడటం కాదు రాజకీయాలంటే... పేదవాడి గుండె చప్పుడు వినడం నిజమైన రాజకీయం. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో గూడు కట్టుకోవడం నిజమైన రాజకీయం. దివంగత నేత వైఎస్‌ను చూసైనా నేర్చుకొమ్మని వారిని కోరుతున్నా. తెలుగువాడి ఆత్మగౌరవం ముందు ఢిల్లీ అహంకారం నేలకరిచేలా... ఢిల్లీ కోటలు బీటలువారేలా.. వచ్చే ఎన్నికల్లో 30 పార్లమెంటు స్థానాలను గెలుచుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం. సోనియా, కిరణ్, చంద్రబాబు.. ఈ విభజన దుష్టత్రయాన్ని బంగాళా ఖాతంలో కలుపుదాం. స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థను మనమే నిర్మించుకుందాం.’’
 
 యాత్ర సాగిందిలా..
 
 హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.40కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్.. అక్కడ్నుంచి నేరుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మంగుట గ్రామానికి చేరుకొని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొట్టాలపల్లిలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన పెద్దపరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. నేలపల్లి చిన్నమిట్టలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. అక్కడ్నుంచి గంగాధర నెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం గొల్లపల్లి వెళ్లి వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు మండల కన్వీనర్ తమ్మిరెడ్డి ఇంట్లో బసచేశారు. యాత్రలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేందర్‌రెడ్డి, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: