వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి

వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి

Written By news on Thursday, January 2, 2014 | 1/02/2014

వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీలేని వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం పెంచిన రూ.215ను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సామ్యానుడికి పెనుభారం మోపే చర్యలను పార్టీ  కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.1112 నుంచి 1327కు పెంచడం దారుణమన్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు, కూరగాయలు మండుతుంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం, మరోపక్క గ్యాస్ ధరలు పెంచి సామ్యానుడి నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ధరల విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ప్రజలపై భారం పడకుండా చూడగలిగారన్నారు. ‘చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టే నాటికి 1995లో గ్యాస్ సిలిండర్ ధర రూ.147గా ఉంది. అది ఆయన హయాంలోనే వంద శాతం పెరిగి రూ.305కు చేరింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన రోశయ్య హయాంలో కేంద్రం పెంచిన రూ.50ని ప్రజలపైనే రుద్దారు. సీఎం కిరణ్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.450కి చేరింది’ అని తెలిపారు.
 
 అవినీతి గురించి బాబా మాట్లాడేది?
 బహిరంగ చర్చలంటూ చంద్రబాబు చేసిన సవాల్‌ను ప్రస్తావించగా... ‘ముందు ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలి. చంద్రబాబు తనపై విచారణలు జరపొద్దంటూ, కమిషన్లను ఉపసంహరింపచేయాలంటూ కోర్టులకెళ్లి ‘స్టే’లు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. బాబు హయాంలో వేలాది ఎకరాలను ఆయన అనుయాయులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే ప్రజలు అంత సంతోషిస్తారు’ అని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: