సోనియాకొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియాకొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం..

సోనియాకొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం..

Written By news on Wednesday, January 22, 2014 | 1/22/2014

* సోనియా, కిరణ్, చంద్రబాబు.. విభజన కుట్రదారులు..
‘సమైక్య శంఖారావం’లో జగన్ ధ్వజం
అన్యాయానికి గురవుతున్న 70 శాతం ప్రజల ఉసురు తగులుతుంది
వచ్చే ఎన్నికల్లో జనం వీరిని బంగాళాఖాతంలో కలుపుతారు..
వైఎస్ బతికుంటే... రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసేవారా?
సోనియా తన కొడుకు కోసం.. మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపాటు

 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఓట్ల కోసం, సీట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ, కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలసి పచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ఇవాళ ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది. వీళ్లు చేస్తున్న పాపం ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారేమో.. విభజనతో అన్యాయానికి గురవుతున్న 70 శాతం మంది ప్రజల ఉసురు వీరికి కచ్చితంగా తగులుతుంది. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికల్లో ప్రజలందరం కలసి వీళ్లను బంగాళాఖాతంలో కలుపుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం. అప్పుడు రాష్టాన్ని వీళ్లెలా విభజిస్తారో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం’’ అని జగన్ పిలుపు నిచ్చారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత రెండోరోజు మంగళవారం జగన్.. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం సభల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 సోనియాకొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం..
 ‘‘కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర అని నినదిస్తోంది. సాగునీటికోసం పరితపించే ప్రతి రైతన్న గుండె చప్పుడూ సమైక్యమనే ఘోషిస్తోంది. అయితే.. కోట్లాది ప్రజల గుండెచప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు మాత్రం వినిపించడం లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కొడుకును ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియా గాంధీ ఇవాళ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు.. ఆమె కొడుకు కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి సోనియా గాంధీని పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. ప్యాకేజీల కోసం కుమ్మక్కైపోయారు. ఇవాళ టీవీ పెట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే.. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది. చంద్రబాబు సభలోకొస్తారు.. సీమాంధ్ర ఎమ్మెల్యేలతో ఒకవైపు సమైక్యాంధ్ర అనిపిస్తారు.. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో విభజన అనిపిస్తారు. ఒక పార్టీ అన్నాక.. ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాక.. ఏ ప్రాంతంలో ఉన్న ప్రజల్లోకైనా వెళ్లి తన వైఖరి చెప్పి.. ‘మీకు నేనున్నాను.. నన్ను చూసి ఓటేయండి.. నన్ను చూసి గెలిపించండి.. నేను అభివృద్ధి చేస్తాను’ అని చెప్పే దమ్ము, ధైర్యం కూడా లేదు చంద్రబాబుకు.
 
 కిరణ్.. సోనియా గీత జవ దాటరు
 ఇవాళ సోనియా గాంధీ గీత గీస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి జవ దాటరు. తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు సోనియా గాంధీ చెప్పినట్లు ఆడుతున్నారు. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు, సమ్మెలు చేస్తున్న ఉద్యోగులను పిలిపించి వారిని భయపెట్టి సమ్మె విరమించుకునేలా చేస్తారు. విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చీరాగానే తాను సంతకం చేయడమే కాక, ప్రభుత్వ కార్యదర్శులందరితో సంతకాలు చేయించి కేవలం 17 గంటల్లోనే అసెంబ్లీకి పంపిస్తారు.. పైకేమో తాను సమైక్యవాదినని చెబుతారు. చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కలిసి ప్రజల జీవితాలతో నాటకాలు ఆడుతున్నారు.

 వీళ్లా రాజకీయ నాయకులు..

 ఆ దివంగత నేత బతికున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడానికి ఏ ఒక్కరికీ ధైర్యం చాల్లేదు. విశ్వసనీయత అన్న పదానికి వైఎస్ ఒక అర్థంలా నిలిచారు. రాజకీయాల్లో నిజాయితీని చూపించారు. ఆయన బతికున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. ఎంతకాలం బతికామన్నదే ముఖ్యం’ అన్నదే ఆ మాట. ఆ మాట ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాలి. ఎందుకంటే.. ఈ రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు వీళ్లా రాజకీయ నాయకులు అని జనం చీదరించుకునే పరిస్థితి.’’
 
 రెండోరోజు యాత్ర సాగిందిలా..
 జగన్ మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పుత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద నుంచి రెండోరోజు ‘సమైక్య శంఖారావం, ఓదార్పు’ యాత్ర ను ప్రారంభించారు. పుత్తూరు బైపాస్ రోడ్డు నుంచి నారాయణవనం చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పుత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. అడుగడుగునా అభిమానంతో ప్రజలు పోటెత్తడంతో పుత్తూరు పట్టణ పొలిమేరలు దాటేందుకే 3 గంటలకు పైగా సమయం పట్టింది. తర్వాత నెత్తం, రాజుల కండ్రిగ, చినరాజుకుప్పం, పద్మ సరసు మీదుగా రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్ కార్వేటినగరం చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలు ఆలస్యమయినప్పటికీ కార్వేటినగరంలో ప్రజలు జగన్ రాకకోసం ఎదురుచూశారు. కిక్కిరిసిన ఆ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రాత్రి 11 గంటలకు నెలవాయి గ్రామం చేరుకుని స్థానిక నాయకుడు గోపాలనాయుడు ఇంట్లో బస చేశారు. మంగళవారం యాత్రలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమరనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు నారాయణ స్వామి, ఆర్‌కే రోజా, మిథున్ రెడ్డి, ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు.
 
 రాజకీయాలంటే.. పేదోడి గుండెలో సజీవంగా ఉండడం
 రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు కాదు.. ఎత్తులు పై ఎత్తుల చదరంగం కాదు.. ఓట్లు, సీట్ల కోసం విభజించడం కాదు.. ఓ వ్యక్తిని జైల్లో పెట్టడం కాదు. రాజకీయాలంటే పేదవాడి ముఖాన చిరునవ్వు పూయించడం, సగటు బడుగు జీవి ఆకాంక్షలకు అద్దం పట్టడం, రాజకీయం అంటే విశ్వసనీయత, ఇచ్చిన మాటకోసం తుదికంటా నిలబడటం. రాజకీయమంటే చనిపోయాక కూడా జన హృదయ స్పందనల్లో సజీవంగా ఉండటం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇటువంటి విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామాగా నిలిచారు. ఆయన మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండె చప్పుడులోనూ సజీవంగా ఉన్నారు. అసలు ఆ మహానేతే జీవించి ఉంటే మన రాష్ట్రాన్ని విభజించేందుకు ఎవ్వరైనా సాహసించే వారా?
Share this article :

0 comments: