బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం

బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం

Written By news on Saturday, January 11, 2014 | 1/11/2014

ఎందుకు వెనుకాడుతున్నారు?: అంబటి రాంబాబు
సమైక్యతపై బాబుకు, కిరణ్‌కు చిత్తశుద్ధి లేదని ధ్వజం
సిసలైన, నిఖార్సయిన సమైక్యవాద పార్టీ వైఎస్సార్‌సీపీయే...
భోగిమంటల్లో వేయాల్సిన బిల్లుపై చర్చిస్తారా? అని ఆగ్రహం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సంజీవనిలా ఉపయోగపడే సమైక్య తీర్మానాన్ని శాసనసభలో చేయకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తూంటే పట్టించుకోకుండా.. ఈరోజు బిల్లుపై చర్చ వద్దన్నందుకు తమ పార్టీపై విభజన కోరుతున్నదనే విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, అందుకనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ ఒక విధానమంటూ లేకుండా గందరగోళపడుతూ.. మరోవైపు తమ పార్టీని సమైక్యం ముసుగులో విభజన కోరుకుంటోందని ఎలా విమర్శిస్తాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలైన, సిసలైన, నిఖార్సయిన సమైక్యవాదం వినిపిస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ‘‘కాంగ్రెస్, టీడీపీల విధానం పార్టీపరంగా ఒకటుంటే వారి ఎమ్మెల్యేలు కొందరు విభజనకు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ ఉంటున్నారు.
 
 కాంగ్రెస్‌లో సీఎం తాను సమైక్యవాదినంటే అదే పార్టీలోని టీ-ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలంగానూ, ఇతర ప్రాంతాలవారు వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నారు. బాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తే ఆ పార్టీలోని రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కానీ వైఎస్సార్‌సీపీలో మా అధ్యక్షుడు, రాయలసీమ, కోస్తా ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత నేతలు అందరూ సమైక్యవాదననే వినిపిస్తున్నారు. అలాంటి మా పార్టీని విభజనకు అనుకూలమైనదిగా విషప్రచారం చేసి నమ్మించాలని చూస్తే.. ప్రజలు నమ్మబోరు’’ అని అంబటి స్పష్టం చేశారు. కేంద్రమంత్రుల బృందం(జీవోఎం) ముందుకెళితే విభజనకు అంగీకరించినట్లేనని కొద్ది నెలలక్రితం చెప్పిన చంద్రబాబు ఇపుడు వారు పంపిన బిల్లుపైనే చర్చకు ఎందుకు అంగీకరిస్తున్నారని నిలదీశారు. బిల్లుపై చర్చకు అంగీకరించబోమని నిన్నటిదాకా తేల్చిచెప్పిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇపుడెందుకు మాటమార్చి చర్చకు సిద్ధమయ్యారని, ఆజాద్ హైదరాబాద్ వచ్చినపుడు టీడీపీ ఏమైనా ఒప్పందం కుదుర్చుకుందా! అని అనుమానం వెలిబుచ్చారు.
 
 బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం
 పునర్వ్యవస్థీకరణ బిల్లును భోగిమంటల్లో వేయాలని ఏపీఎన్జీవో నేతలు ఇచ్చిన పిలుపుపై అంబటి హర్షం వ్యక్తం చేశారు. వారి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే భోగిమంటల్లో వేయాల్సిన బిల్లుపై ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలనడం పూర్తిగా అధర్మమన్నారు. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే ముట్టడి చేస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని ఈ నేతలు చెప్పిన మాటలేమయ్యాయన్నారు. బిల్లుపై చర్చలో పాల్గొనని వారి ఇళ్లను ముట్టడిస్తామన్న ఏపీఎన్జీవో నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి నిప్పుతో చెలగాటమాడొద్దు. అసలు సిసలు సమైక్యవాదులైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లను నకిలీ సమైక్యవాదులతో కలసి ముట్టడించడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లేనని గుర్తుంచుకోండి’’ అని హెచ్చరించారు. ‘‘బిల్లుపై చర్చ జరగాలని టీఆర్‌ఎస్ కూడా కోరుకుంటోంది. మరి ఆ పార్టీ కూడా సమైక్యవాద పార్టీయేనా? విభజనవాదులను మీరు సమైక్యవాదులని అంటారా?’’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు.
Share this article :

0 comments: