ఇక నిత్య వడ్డింపులే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక నిత్య వడ్డింపులే..

ఇక నిత్య వడ్డింపులే..

Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014


ఇక నిత్య వడ్డింపులే..
 మధ్యంతర రైల్వే బడ్జెట్ సారమిదే
 తరచూ చార్జీల పెంపునకు ‘రూట్’ మ్యాప్
 రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటు: రైల్వే మంత్రి
 హేతుబద్ధీకరణ ముసుగులో చార్జీల మోత
 పలు వర్గాల చార్జీల రాయితీలకూ చెల్లుచీటీ!
 పైగా డిమాండ్‌ను బట్టి చార్జీల పెంపుతో దోపిడీ
 ఇక రైల్వేల్లోనూ దూకుడుగా సంస్కరణల బాట
 ప్రైవేటుకు తలుపులు బార్లా.. ఎఫ్‌డీఐలకూ ఓకే!
 అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు తొలిసారిగా రైల్వే లైన్లు

 కొత్త రైళ్లు:73, ఏసీ ప్రీమియం:17, ఎక్స్‌ప్రెస్‌లు:39, ప్యాసింజర్లు:10

 
 న్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకుండా, సాదాసీదాగా పట్టాలకెక్కింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను నేరుగా పెంచలేదు. అలాగని సగటు రైల్వే ప్రయాణికుడు ఆనందించడానికి కూడా ఏమీ మిగల్లేదు. ఎందుకంటే వారికోసం ఇకపై నిత్యం దొంగ దెబ్బలు పొంచి ఉన్నాయి! ఎప్పుడుపడితే అప్పుడు చార్జీల పెంపుతో ఎడాపెడా బాదేయడానికి స్వతంత్ర అధికారాలతో కూడిన రైల్వే టారిఫ్ అథారిటీ తెరపైకి రాబోతోంది. ‘హేతుబద్ధీకరణ’ ముసుగులో చుక్కలు చూపనుంది. అందుకు సగటు ప్రయాణికులు, సరుకు రవాణాదారులు సిద్ధంగా ఉండాల్సిందే. అంతేకాదు, ఇప్పటిదాకా పలు వర్గాల ప్రయాణికులకు ఇస్తున్న చార్జీల రాయితీని కూడా క్రమంగా ఎత్తేయనున్నారు! ఇది చాలదన్నట్టు విమాన చార్జీల మాదిరిగానే రైల్వే చార్జీలను కూడా డిమాండ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు పెంచే ప్రతిపాదనను కూడా రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తెరపైకి తెచ్చారు! నాలుగు నెలల కాలానికి ఉద్దేశించిన మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను బుధవారం ఆయన ముందుగా లోక్‌సభలోనూ అనంతరం రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీల ఆందోళనల దెబ్బకు లోక్‌సభలో బడ్జెట్ తంతు కేవలం 14 నిమిషాల్లోనే ముగిసింది. రైల్వేలనూ క్రమంగా ప్రైవేటు బాట పట్టించే దిశగా ఈ సందర్భంగా మంత్రి స్పష్టమైన సంకేతాలిచ్చారు.

‘రైల్వేల అభివృద్ధి, ఆధునికీకరణ’ కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నట్టు ప్రకటించారు. అంతేగాక, ‘ప్రపంచ స్థాయి’ మౌలిక సదుపాయాల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ఆహ్వానించే విషయమూ పరిశీలనలో ఉందన్నారు! రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని ఇకపై రాష్ట్రాల మీదా రుద్దనున్నారు. ఈ ప్రతిపాదనకు కర్ణాటక, జార్ఖండ్, హర్యానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకరించిందని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలూ అదే బాటలో సాగాలంటూ హితవు పలికారు. రైల్వే వార్షిక ప్రణాళికను రికార్డు స్థాయిలో రూ.64,305 కోట్లుగా పేర్కొన్నారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.30,223 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లకు భిన్నంగా ఈ ఏడాది రైల్వే శాఖ మిగులు నిధులతో ఆర్థిక సంవత్సరానికి ముగింపు పలికిందంటూ గొప్పలు పోయారు. 17 ఏసీ ప్రీమియం, 38 ఎక్స్‌ప్రెస్‌లు, 10 ప్యాసింజర్లు సహా మొత్తం 72 కొత్త రైళ్లను ప్రకటించారు. యథాప్రకారంగా రాష్ట్రానికి మాత్రం అత్తెసరు కేటాయింపులతోనే సరిపెట్టారు. పైగా ప్రతిపాదిత ప్రాజెక్టులు వేటికీ రైల్వే మంత్రి పైసా కూడా విదల్చలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లకు కూడా కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్ అలెర్టులు, అన్ రిజర్వుడ్ విబాగాలకు కూడా మొబైల్ ఫోన్లలో టికెట్ బుకింగ్ సదుపాయమంటూ ఊరించారు.
 
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1.6 లక్షల కోట్ల ఆదాయార్జన లక్ష్యం. ఇందులో సరుకు రవాణా ఆదాయం రూ.1.05 లక్షలు, ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.45,255 లక్షలు, కోచింగ్ తదితర ఆదాయాలు రూ.9,700 కోట్లు
  • సరుకు రవాణా లక్ష్యం 110.1 కోట్ల టన్నులు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 4.97 కోట్ల టన్నులు అధికం.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేల మొత్తం ఆదాయం రూ.1.315 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
  • ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టదలచిన ప్రాజెక్టులు: స్టాక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, బహుళార్థ కాంప్లెక్సులు, లాజిస్టిక్స్ పార్కులు, ప్రైవేట్ సరుకు రవాణా టెర్మినళ్లు, పూర్తిస్థాయి రవాణా కారిడార్లు తదితరాలు
  • 2014-15లో మార్కెట్ నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ, రైల్ వికాస్ నిగమ్‌ల ద్వారా రూ.13,800 కోట్లు సేకరించదలచారు
 
  భారతీయ రైల్వే విశేషాలు...
  •  ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్కుల్లో ఒకటి
  • రోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తోంది
  • రోజూ 26.5 లక్షల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది
  • 64 వేల కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన రూట్లలో రోజూ 12 వేల ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు నడుపుతోంది
  • భారతీయ రైల్వేలో 1.4 లక్షల మంది ఉద్యోగులున్నారు.
 రైల్వే బడ్జెట్ సమగ్ర స్వరూపం 
(రూ.కోట్లలో)                      2014-15                 2013-14
 స్థూల ట్రాఫిక్ వసూళ్లు        1,60,000            1,31,500 (సవరించిన)
 నిర్వహణ వ్యయం              1,44,199            1,27,260 (సవరించిన)
 నికర ఆదాయం                  19,655                  19,400
 డివిడెండ్                              9,117                    6,250
నిర్వహణ నిష్పత్తి                    89.8                      87.8
 మొత్తం మిగులు                12,728                   8,018 (సవరించిన)
Share this article :

0 comments: