బంద్ సంపూర్ణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్ సంపూర్ణం

బంద్ సంపూర్ణం

Written By news on Saturday, February 15, 2014 | 2/15/2014

బంద్ సంపూర్ణం
సాక్షి నెట్‌వర్క్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సీమాంధ్ర బంద్ రెండోరోజు శుక్రవారం విజయవంతమైంది. అన్ని జిల్లాల్లో ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూయించారు. విద్యాసంస్థలను బంద్ చేశారు. ఆర్టీసీ బస్సులు రెండోరోజు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలుబంకులు మూసేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 
అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రి స్వామిరెడ్డి, మహిళా విభాగం నేతలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైకి మహిళలు కోడిగుడ్లు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూపురం, కళ్యాణదుర్గంలో ఏపీఎన్జీఓలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  కడపలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు ఆధ్వర్యంలో అప్సర సర్కిల్‌లో టైర్లుకాల్చి నిరసన తెలిపారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకోగా, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో  పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ తీయగా, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు, పాఠశాలలను మూయించారు.
 
   చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పుత్తూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి బంద్‌ను పర్యవేక్షించారు. తిరుపతిలో రమణమ్మ, గీత అనే మహిళా కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
 
   తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16వ నంబర్ హైవేపై కేంద్రమంత్రి జేడీ శీలంను ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు అడ్డుకోబోయారు. అనంతరం మంత్రి ప్రారంభించిన సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. కోటగుమ్మం, పుష్కర్‌ఘాట్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సోనియా, రాహుల్‌ల ఫ్లెక్సీలను చించివేశారు. 214 జాతీయ రహదారిపై ముమ్మిడివరం, మామిడికుదురు, పిఠాపురంలలో రాస్తారోకో చేశారు. అనపర్తిలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, అమలాపురంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బంద్‌లో పాల్గొనగా, జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ నిర్వహించారు.
 
   పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో  వైఎస్సార్‌సీపీ నాయకులు  ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. యువకులు  దుకాణాలను మూయించారు. పలు కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. భీమవరంలో మానవహారం, కొవ్వూరులో ధర్నా చేశారు. గోపాలపురంలో మూడు రోడ్ల సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టగా, తణుకులో మోటార్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
 
   విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ పార్టీ నేత  సుజయకృష్ణ రంగారావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బొబ్బిలికోట నుంచి ర్యాలీ చేపట్టారు. నెలిమర్లలో మొయిద జంక్షన్ వద్ద విజయనగరం -పాలకొండ రహదారిపై రాస్తారోకో, మానవహారం చేపట్టారు. విజయనగరం, ఎస్. కోట, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు.
 
  శ్రీకాకుళంలో  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పార్టీనేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూర్యమహల్ కూడలి వరకు జరిగిన ర్యాలీ, మానవహారాల్లో పాల్గొన్నారు.
 
   విశాఖ నగర వైఎస్సార్‌సీపీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి నుంచి బైక్‌లు, వాహనాలతో తూర్పు నియోజకవర్గమంతా భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో టీ-బిల్లు ప్రతులు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రాస్తారోకో నిర్వహించి, షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద కేంద్రమంత్రి జేడీ శీలం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు  సామినేని ఉదయభాను బైక్‌ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్‌డిపో గేట్ ఎదుట ఆందోళన చేశారు. అవనిగడ్డలో ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలపగా,  చల్లపల్లిలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. కంచికచర్లలో 65వ నంబర్ జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ రామవరప్పపాడుసెంటర్‌లో  మానవహారం నిర్మించారు.
 
  నెల్లూరులో వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు మోటార్ బైక్‌లపై ర్యాలీ నిర్వహిస్తూ బంద్‌ను పర్యవేక్షించారు.  పొదలకూరులోని సంగం రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. గూడూరు పోటుపాళెం కూడలి ప్రాంతం, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో, వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి తదితర ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు.
 
   ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను డిపోల వద్దే అడ్డుకున్నారు. కనిగిరిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రిలేనిరాహార దీక్షలకు కూర్చున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి.
 
   గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి గురజాల, పిడుగురాళ్లలో రాస్తారోకో చేశారు. కేంద్రపాలక మండలి సభ్యుడు కోన రఘుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు
Share this article :

0 comments: