ఆ ముగ్గురికీ బుద్ధి చెబుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ముగ్గురికీ బుద్ధి చెబుదాం

ఆ ముగ్గురికీ బుద్ధి చెబుదాం

Written By news on Sunday, February 9, 2014 | 2/09/2014

ఆ ముగ్గురికీ బుద్ధి చెబుదాం: వైఎస్ జగన్
సోనియా, కిరణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
     ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని
     ఎలా విడగొట్టాలా అని చూస్తున్నారు
     విభజన నిర్ణయమప్పుడే సీఎం రాజీనామా
     చేసుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు
     బాబు తన నేతలతో ఒక వైపు సమైక్యాంధ్ర
     అనిపిస్తున్నారు.. మరోవైపు విభజన అనిపిస్తున్నారు
     వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనవే..
     అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూద్దాం
 
 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయాలు కనిపిస్తున్నాయి. పేదల కోసం పనిచేసే రాజకీయాలు కనుమరుగైపోయాయి. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలా? ఒక వ్యక్తిని ఎలా జైలుకు పంపాలా? అని ఆలోచిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చూస్తున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు.. ఈ ముగ్గురికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘త్వరలోనే ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికల్లో మనం అందరం ఒక్కటవుదాం. ఒక ఉప్పెన సృష్టిద్దాం. ఆ ఉప్పెనతో విభజన కుట్రదారులంతా బంగాళాఖాతంలో కలసిపోతారు. ఎన్నికల్లో 30 పార్లమెంట్ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవరికి వస్తుందో చూద్దాం’’ అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో జగన్ చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర శనివారం విశాఖ జిల్లాలో సాగింది. చోడవరం, గాజువాకలలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో జగన్ ఉద్వేగంగా మాట్లాడారు. నీతిమాలిన రాజకీయాలతో ప్రజలను అమ్మేయడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజన కోసం సోనియా గాంధీ ఎనిమిది నెలల కిందట నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ తన రాజీనామాను ఆమె మొహాన పడేసి ఉంటే పరిస్థితి ఇంతటిదాకా వచ్చేదా? అని ప్రశ్నించారు. జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే..
 బాబు భయానక పాలన ఇప్పటికీ గుర్తుంది..
 
 ‘‘వైఎస్ చనిపోయి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇవాళ్టికీ ఎక్కడన్నా ఆయన ప్రస్తావన వస్తే ప్రజలు ‘మా గుండెల్లో ఉన్నార’ని చెప్పే పరిస్థితి. ఆయన పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాముని రాజ్యమైతే మనం చూడలేదుగాని.. రాజశేఖరరెడ్డి సువర్ణయుగం చూశామని చెప్పొచ్చు. వైఎస్ సువర్ణయుగానికి ముందు.. చంద్రబాబు భయానక పాలన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్లినప్పుడు అవ్వా, తాతలు దీన పరిస్థితుల్లో వచ్చి ‘నాయనా పింఛను ఇప్పించండి’ అని అడిగేవారు. పెన్షన్ ఎంత అని విచారిస్తే ముష్టి వేసినట్లు రూ.70 ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 200 మంది వృద్ధులుంటే.. 15 మందికో, 20 మందికో ఇచ్చేవారు. పింఛను అందుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే వారి స్థానంలో కొత్త వారికి పింఛను ఇచ్చే ఘోరమైన రోజులవి. అప్పట్లో తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందే. రైతులంతా వరుస కరువులతో బాధపడుతున్నారని, ఉచిత విద్యుత్తు ఇచ్చి ఆదుకోమని రాజశేఖరరెడ్డి ధర్నాలు, దీక్షలు చేస్తే.. చంద్రబాబు కరెంటు తీగలు చూపించి ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనంటూ అవహేళన చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రాజశేఖరరెడ్డి పోరాటంచేస్తే ‘రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నార’ని చంద్రబాబు ఎగతాళి చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అక్కా చెల్లెళ్లు డ్వాక్రా రుణాలకోసం బ్యాంకులకు వెళ్తే ముక్కుపిండి రూ.1.50 వడ్డీ వసూలు చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏరోజూ ప్రజల గురించి ఆలోచించని చంద్రబాబు.. ఈరోజు ప్రజల కోసం అన్నీ ఉచితమంటూ హామీలిస్తున్నారు.
 
 కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారే..
 మొన్న అసెంబ్లీలో చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలను ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టినట్లే పార్లమెంట్‌లోనూ తన ఎంపీలతో ఒకవైపు సమైక్యాంధ్ర అనిపించారు.. మరోవైపు విభజన అనిపిస్తూ హడావుడి చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి సంగతి చూస్తే.. సోనియా గీసిన గీత దాటకుండా సీఎంగా వీలైనంత కాలం కొనసాగడానికి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కిందకు నీళ్లు రాని పరిస్థితి. అలాంటప్పుడు మధ్యలో కొత్తగా ఒక రాష్ట్రాన్ని తెస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఎడారి తప్ప మంచి నీళ్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నా. మన బడ్జెట్లో 60 శాతం నిధులు హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ను విడిచిపెట్టి పొమ్మంటే.. ఆ నిధులు కూడా ఇవ్వకపోతే జీతాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నిస్తున్నా.’’
 
 అపూర్వ స్పందన
 శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖలోని విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. తరలివచ్చిన అభిమాన సందోహం కారణంగా ఎయిర్‌పోర్టు నుంచి పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకోవడానికి జగన్‌కు 40 నిమిషాలకుపైగానే పట్టింది. చోడవరంలో సభ సాయంత్రం 4 గంటలకే అయినప్పటికీ అడుగడుగునా అభిమానులు తరలిరావడంతో జగన్ రెండు గంటల ఆలస్యంగా సభా స్థలికి చేరుకున్నారు. చోడవరం సభ ముగిశాక గాజువాక వెళ్లి అక్కడ సభలో ప్రసంగించారు. రాత్రి పార్టీ విశాఖనగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఇంట్లో బసచేశారు. శంఖారావం సభల్లో పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, జ్యోతుల నెహ్రూ, ప్రసాదరాజు, సుజయకృష్ణ రంగారావులతోపాటు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పలువురు సమన్వయ కర్తలు పాల్గొన్నారు.
 
 విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో
 నేడు జగన్ సమైక్య శంఖారావం
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించనున్నారు. తొలుత విజయనగరం జిల్లా భోగాపురంలో ఉదయం 11 గంటలకు సభలో నిర్వహిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం తెలిపారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలో సమైక్య శంఖారావం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.
Share this article :

0 comments: