సమైక్యంగా ఉంచే పార్టీకి మద్దతిస్తాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యంగా ఉంచే పార్టీకి మద్దతిస్తాం..

సమైక్యంగా ఉంచే పార్టీకి మద్దతిస్తాం..

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014

బిల్లును శాయశక్తులా అడ్డుకుంటాం
జాతీయ టీవీ చానెళ్లతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ అన్యాయమైన విభజన బిల్లును లోక్‌సభలో అడ్డుకోవడానికి తాము సర్వశక్తులు ఒడ్డుతామని, పోడియంలో తమ నిరసనగళం బలంగా వినిపిస్తామని ఆయన ఉద్ఘాటించారు.
 
 మంగళవారం జాతీయ టీవీ చానెళ్లకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి మేం మద్దతు కూడగట్టాల్సి ఉంది. అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందుకుపోతోంది. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనం. ఈ సమయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై.. అన్యాయాన్ని అడ్డుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఇంతకుముందు బీజేపీ సహా ప్రతిపక్షాలన్నిటినీ కలిసి తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి కలిసిరావాలని విజ్ఞప్తి చేశామని, మరోసారి ప్రతి ఒక్కరినీ కలిసి వారి మద్దతు కూడగడతామని చెప్పారు. బిల్లు విషయమై బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలవనున్నట్లు స్పష్టంచేశారు.
 
 సమైక్యంగా ఉంచే పార్టీకి మద్దతిస్తాం..
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారికి మద్దతిస్తామని అంటున్నారు కదా.. ఒకవేళ బీజేపీగాని, మరే ఏ ఇతర పార్టీ అయినాగాని సమైక్యాంధ్రకు అనుకూలమని ప్రకటిస్తే ఎన్నికల తర్వాత వారికి మద్దతిస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘మా లక్ష్యం సుస్పష్టం. బంగారం లాంటి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే మా ధ్యేయం. దీనికి కలిసొచ్చే ప్రతి పార్టీకీ మేం మద్దతుగా నిలుస్తాం..’’ అని జగన్ స్పష్టంచేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ సజావుగా సాగుతుందంటారా? అని ప్రశ్నించగా.. ‘‘మేం బిల్లును శాయశక్తులా అడ్డుకోవడానికి యత్నిస్తాం.. పోడియంలోనే ఉంటాం’’ జగన్ తమ వైఖరిని ప్రకటించారు. మరో మూడు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న ఈ సమయంలో కాంగ్రెస్ రెబెల్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టినా దానికి పెద్ద ప్రాధాన్యముండదని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.
 
 త్వరలో తెలంగాణలో యాత్ర..
 
 ‘‘సమైక్యం అంటే ఒక్క సీమాంధ్రనే కాదు. మూడు ప్రాంతాలు కలిపే సమైక్యరాష్ట్రం. మా శ్రేణులు, అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం ఐదింటిని మేం గెలుచుకుంటామని నేను బలంగా చెప్పగలను. అన్ని ప్రాంతాలనూ సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి చేయగలమన్న నమ్మకం నాకుంది’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ అన్నారు. సమైక్య రాష్ట్ర నినాదంతోనే త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నానని చెప్పారు.
 
 చంద్రబాబుతో ‘సమైక్యం’ అనిపించండి చూద్దాం
 
 టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతవరకు ఒక్కరోజు కూడా సమైక్యాంధ్ర అన్న మాటే అనలేదని జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘సమైక్యం కోసం పోరాడుతున్నానని ఆయన నోట ఒక్క మాట చెప్పించండి చూద్దాం’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. ఇక సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయమైనందుకు సంతోషమేనని అన్నారు. నిజానికి 8 నెలల కిందట సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్న రోజే ఆయన రాజీనామా చేసి ఉంటే.. పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని, ఎనిమిది నెలల కిందటే రాజ్యాంగ సంక్షోభం తలెత్తేదని చెప్పారు. అలా చేయకపోగా.. సమైక్యాంధ్ర కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలను బెదిరించి మరీ కిరణ్‌కుమార్ రెడ్డి సమ్మె విరమించుకునేలా చేసి పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చారని విమర్శించారు. కార్పొరేటర్ స్థాయి నుంచి అధ్యక్షుడి వరకు ఒకే తాటిపై ఉండి సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది తమ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. సమైక్యాన్ని కోరుకునేవారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో రెండు రకాల వాదనలు వినిపిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని విమర్శించారు.
Share this article :

0 comments: