కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోక తప్పదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోక తప్పదు

కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోక తప్పదు

Written By news on Monday, February 3, 2014 | 2/03/2014

సమైక్య లక్ష్యం సాదిద్ధాం

కోట్లాది తెలుగు ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారు
 వారి ఆశలను నెరవేర్చేందుకు మనమంతా కంకణం కట్టుకుందాం
 ఈ క్రమంలో కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోక తప్పదు
 జగన్‌బాబులో వైఎస్ కన్నా ఎక్కువ పోరాట పటిమ ఉంది
 లక్ష్య సాధనలో అండగా నిలవండి
 
 సాక్షి ప్రతినిధి, కడప: ‘‘కోట్లాది మంది తెలుగు ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారు. మన ముందు మహోన్నత లక్ష్యం ఉంది. అందుకు జగన్ బాబు దృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఈ మహోన్నత లక్ష్యం సాధించేందుకు మనమంతా కంకణం కట్టుకుందాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ ప్లీనరీలో ఆమె ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. వైఎస్ దూరమయ్యాక తమ కుటుంబానికి ఎదురైన కష్టాలను, ఎదుర్కొన్న ఒడిదుడుకులను తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతున్నంత సేపూ ప్రతినిధుల హృదయాలు ఆవేదనతో బరువెక్కాయి. కొందరు కంట తడిపెట్టుకున్నారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌పై పన్నిన కుట్రలు, జగన్‌ను అక్రమంగా జైలుకు పంపి, కోర్టు ముందు ఒక నేరస్తుడిగా చూపిన ప్రయత్నాలను తలచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాలు చుట్టుముట్టినప్పుడు తమ వెంట నిలబడిన రాష్ట్ర ప్రజల కోసం... తమ కుటుంబం ఏమి చేయడానికైనా సిద్ధమేనని విజయమ్మ అన్నపుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..
 
     దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే, గౌరవించే మీరందరూ జగన్ బాబును కూడా అలాగే ఆదరించి ప్రేమిస్తున్నారు. మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈరోజు రెండో ప్లీనరీ జరుపుకుంటున్నాం. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా 2011 జూలై 8న మొదటిసారి ప్లీనరీని ఇక్కడే నిర్వహించుకున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై మూడేళ్లయింది. దివంగత నేత మన నుంచి దూరమై నాలుగున్నర సంవత్సరాలైంది. ఈ కాలంలో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. మా జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
     వైఎస్ మన నుంచి దూరమయ్యాక జగన్ బాబు ఓదార్పు యాత్ర చేశారు. ఒక తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా వస్తున్నాడని మీరంతా ఆదరించారు. అలాగే జగన్ బాబు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరంతా ఎన్నో ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జగన్ బయటికి రావాలని కోరుకున్నారు. జగన్ బాబు లోపల ఉంటే పార్టీకి, ప్రజలకు నష్టం వస్తుందని మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జగన్ బాబు జైలులోకి పోయేటప్పుడు ‘అమ్మా! మన వెంట వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది’ అని చెప్పిన తర్వాత నేను, షర్మిల ప్రచారానికి వెళ్లాం.
 
     మేం వస్తుంటే ప్రతి ఇంట్లో నుంచి బిడ్డలతోసహా వచ్చి ఆదరించారు. మీరు చూపిన ఆదరాభిమానాలతో మేం ఎదుర్కొంటున్న బాధ కనిపించలేదు. ఆ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా మీరంతా వెన్నంటే ఉండి 15 మందిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ విజయం మీ వల్లే సాధ్యమైంది. మీ ఆదరాభిమానాలు మరువలేనివి. తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీకి అండగా నిలిచారు.
 
     కాంగ్రెస్ అధిష్టానం కుట్రల ఫలితంగా ఒక బిడ్డను అక్రమంగా జైల్లో  నిర్బంధించగా, మరో బిడ్డ జనంలోకి వెళ్తానంటే మనసు కలచి వేసింది. పేద ప్రజలకు అండగా ఉండాలని దివంగత నేత చూపిన మార్గంలో షర్మిల 3,112 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టింది. ఆరోజు పాదయాత్రకు పంపిస్తూ మీకు నేను ఒక్కటే చెప్పాను.. ‘ఈరోజు మన మధ్య రాజశేఖరరెడ్డి లేరు.. ఒక బిడ్డ జైల్లో ఉన్నారు.. ఇంకో బిడ్డను మీకు అప్పగిస్తున్నాను..’ అని చెప్పా. షర్మిల పట్ల మీరు చూపించిన ఆదరాభిమానాలు మరువలేనివి.
 
      ఆరోజు నగదు బదిలీ, ఉచితంగా కలర్ టీవీ అంటూ కోటి వరాలు చూపించినా మహాకూటమిగా అన్ని పార్టీలు ఏకమైనా వైఎస్‌ను రెండోసారి గెలిపిం చారు. మీ అభిమానమే వైఎస్‌ను గొప్ప లీడర్‌గా నిలిపింది. అధికారంలోకి వచ్చిన ఆయన అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేశారు. పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, రైతు రుణాల మాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయిం బర్స్‌మెంట్.. ఇలా అనేక పథకాలతో వైఎస్ పాలన సువర్ణయుగంలా సాగింది.
 
  ఈరోజు దుర్బుద్ధితోనే రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. బూర్గుల రామకృష్ణారావులాగా పదవీ త్యాగం చేసి ఉంటే నేడు రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తీర్మానం చేయండి.. అని మేం  ఎంతగానో చెప్పాం. అయినా పట్టించుకోలేదు. కోట్లాది మంది తెలుగు  ప్రజలు మనపై  నమ్మకం పెట్టుకున్నారు. జగన్ బాబు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాడు. జగన్ నాయకత్వంలో రాష్ట్ర సమైక్యం కోసం చేయాల్సిన ప్రతీ ప్రయత్నిస్తున్నాం. జాతీయ స్థాయిలో జగన్ అనేక పార్టీల మద్దతు కూడగట్టారు.
 
    వైఎస్సార్‌సీపీపై కుతంత్రాలు ఎక్కువయ్యాయి. వీటిని ఎదుర్కొనేందుకు దీటుగా నిలవండి. వైఎస్ చూపిన పోరాట పటిమకన్నా జగన్‌లో అధికంగా ఉంది. విశ్వసనీయత, విలువల కోసం రాజశేఖరరెడ్డి కట్టుబడి ఉండేవారు. నా బిడ్డ కూడా తండ్రి ఆశయ సాధన కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, తెలుగు ప్రజల మహోన్నత లక్ష్యం కోసం అండగా నిలుస్తాడని చెబుతున్నా!
 
 
 జగన్‌ను ఎదుర్కోలేకే..
 ‘‘రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ప్రజలతో, తెలంగాణ వారు కూడా దీనిని గమనించాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఢిల్లీ పాలకులు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర విభజన చేస్తున్నది పాలనా సౌలభ్యం కోసం కాదు.. కేవలం 40 ఏళ్ల యువ నాయకుడి(జగన్)ని రాజకీయంగా ఎదుర్కోలేక. తెలంగాణలో కూడా 119 స్థానాలకు వైఎస్సార్‌సీపీ 60 సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వేల్లో వెల్లడికావడంతో.. ఆగమేఘాల మీద దుర్మార్గపూరితంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఓట్లు, సీట్ల కోసం విభజన రాజకీయాలు చేస్తున్నాయి. సోనియా నియంతలా మారి చెడు సంప్రదాయాలను సృష్టిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రోజు ఆ మహానేత లేని కొరతను తీర్చగల వ్యక్తి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే.’’
 -మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ  
 
 వంద రోజుల్లో జగన్ సీఎం..
 ‘‘రాబోయే వంద రోజుల్లో జగన్ సీఎం అవుతారు. వైఎస్‌ఆర్ మాదిరిగా ప్రజారంజక పాలన అందిస్తారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరం భూమిని సాగులోకి తెస్తారు.’’              - ఎస్పీవై రెడ్డి, ఎంపీ
 
 వైఎస్ గుండెను చీల్చుతున్న సోనియా..
 ‘‘వైఎస్ రెక్కల కష్టం మీదే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. 2009లో ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ ఒంటి చేత్తో కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వైఎస్ గుండెను సోనియాగాంధీ చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ జగన్ నాయకత్వంలో నెరవేరనుంది. రాష్ట్రాన్ని దేశంలోనే నం.1గా ఉంచాలనే వైఎస్ ఆశయాన్ని జగన్ సాధిస్తారు.’’
 - కొణతాల రామకృష్ణ, రాజకీయవ్యవహారాల సమన్వయకర్త
 
 జనం నాయకుడు..
 ‘‘పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం జనం కోసం.. జనం మధ్య తిరుగుతున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కానీ, ఆయన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు కుట్రదారులు పార్టీలోకి వస్తున్నారు. ఎప్పుడు వెళ్లాలో ముందే టైం ఫిక్స్ చేసుకొని మరీ వస్తున్నారు. అలాంటి వారి పట్ల పార్టీ అధిష్టానం జాగ్రత్త వహించాలి. తెలంగాణలోని ప్రతిగుండెలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి.’’               - గట్టు రామచంద్రరావు, బీసీ విభాగం కన్వీనర్
 
 తెలుగువారు గర్వించ దగ్గ వ్యక్తి జగన్
 ‘‘యావత్ తెలుగుజాతి గర్వించతగ్గ వ్యక్తి జగన్. జగన్ తన తండ్రి ఆశయాల కోసం జైలుకు వెళ్లారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ఎక్కడ కూడా చలించలేదు. వైఎస్ హయాంలో బడుగు, బలహీనవర్గాలకు అండదండ ఉండేది. ఆయన మరణం తర్వాత వారికి రక్షణ లేకుండా పోయింది.’’                                      -నల్లా సూర్యప్రకాష్, ఎస్సీ విభాగం కన్వీనర్
 
 ఓర్వలేకే దుష్ర్పచారం..
 ‘‘చంద్రబాబుకు జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా... వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ ఖాళీ అయ్యిందని దుష్ర్పచారం చేస్తోంది. తెలంగాణ నేతలెంత మంది ఉన్నారో చూస్తారా? (వేదిక మీదున్న తెలంగాణ నాయకులు లేచి నిలబడ్డారు) వీరిని చూసిన తర్వాతైన దుష్ర్పచారం మానుకోవాలి. హైదరాబాద్ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు. సీమాంధ్ర సోదరులు ఒక వేళ భయపడితే.. వారి షాపులపై వైఎస్సార్‌సీపీ పేరు రాసిపెట్టుకోండి. ఎవరు దాడిచేస్తారో చూస్తా.’’   -రెహ్మాన్, మైనారిటీ విభాగం కన్వీనర్
 
 ఇతర పార్టీల వెన్నులో చలి..
 ‘‘ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే ఊపిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. మా పార్టీ పేరు చెబితేనే ఇతర పార్టీల వెన్నులో చలి పుడుతోంది. రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. 2014 మేలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం.’’               -బాబూరావు, ఎమ్మెల్యే
 
 సమైక్య పోరులో వైఎస్సార్‌సీపీదే కీలక పాత్ర..
 ‘‘రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొదటి నుంచీ అంకితభావంతో ఉద్యమించిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీయే. రాష్ట్ర విభజన వైపు అడుగులు వేస్తోందనే సంకేతాలు అందిన వెంటనే.. 2013 జూలై 17న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ రాశారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజీనామా చేశారు. తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామా చేశారు. ప్రధాని, షిండే, ప్రతిపక్షాలకు విజయమ్మ లేఖలు రాశారు, గుంటూరులో ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఆగస్ట్ 25న  వైఎస్ జగన్ జైలులో నిరాహార దీక్ష చేపట్టారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ.. షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చేశారు. అక్టోబరు 4న విభజన నిర్ణయానికి నిరసనగా 72గంటల బంద్ నిర్వహించాం. అక్టోబరు 5న వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. అనంతరం హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహించారు. నవంబర్ 16 నుంచి జగన్ వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. ఈ ఏడాది జనవరిలోనూ విభజన బిల్లుకు నిరసనగా అసెంబ్లీలో, వెలుపల వైఎస్సార్‌సీపీ అలుపెరుగని పోరాటం చేసింది. ఆ పోరాటం ఫలితంగానే జనవరి 30న శాసనసభ మూజువాణి ఓటుతో విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానించింది.’’          -వాసిరెడ్డి పద్మ, పార్టీ అధికార ప్రతినిధి.
 
 రాజన్న రాజ్యం కోసం జనం ఎదురుచూపు..
 ‘‘వైఎస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి పాలన చాలా దగ్గరి రోజుల్లోనే ఉంది. జగన్‌ను మరోసారి ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నాయకులందరికీ ధన్యవాదాలు.’’
 - జ్యోతుల నెహ్రూ, సీజీసీ సభ్యుడు
 
 
 విజయమ్మ భావోద్వేగ క్షణాలు...
 ‘‘కొన్ని విషయాలు తలచుకుంటే గుండెలు బరువెక్కుతున్నాయి.. అవి మీకు చెప్పాలనుకుంటున్నా.. ఆనాడు రాజశేఖరరెడ్డి రచ్చబండకు వెళుతున్నారు.. ‘వాతావరణం బాగా లేదు, హెలికాప్టర్ పోగలిగితే ప్రోగ్రామ్‌కు వెళ్తాను.. లేదంటే మధ్యాహ్నానికి వస్తాను’ అని చెప్పారు. కానీ ఆ తర్వాత శాశ్వతంగా మనకందరికీ దూరమయ్యారు.’’
 
  ‘‘జగన్ బాబు జైలుకు పోయేటపుడు నన్ను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘అమ్మా! మనల్ని నమ్ముకుని 17 మంది ఎమ్మెల్యేలు వెంట నడిచారు. వాళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నేనెక్కడున్నా నీవు, పాప వెళ్లి ప్రచారం చేయాలి’ అని కోరాడు. అప్పటి వరకు రాజకీయాలంటే తెలియని మేం, ఏనాడూ బయటికి వెళ్లని మేం ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాం.’’
 
  ‘‘జగన్‌ను అకారణంగా జైలుకు పంపారు. 90 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉన్నా.. 16 నెలలు జైల్లో పెట్టారు. జైలుకు వెళ్లిన ప్రతిసారీ ఇక ఇదే లాస్ట్ కావాలని కోరుకున్నా. ఇంకెన్ని రోజులు నాన్నా.. అని అంటే ‘దేవుడిని నమ్ము... అంతకంటే చేసేదేమీ లేదు..’ అని జగన్ బాబు చెప్పేవారు. నా కొడుకు ఏం తప్పు చేశాడు దేవా.. అని ఆ దేవుడిని అడిగా! జడ్జీల ముందు నా కుమారుడు నిలబడి ఉంటే మనసు తీవ్రంగా కలచి వేసింది.’’
Share this article :

0 comments: