ఆస్తులు అమ్మైనా మాట నిలబెట్టుకుంటా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆస్తులు అమ్మైనా మాట నిలబెట్టుకుంటా..

ఆస్తులు అమ్మైనా మాట నిలబెట్టుకుంటా..

Written By news on Tuesday, February 4, 2014 | 2/04/2014


నంద్యాల, న్యూస్‌లైన్ :  ఆస్తులు అమ్మైనా సరే పట్టణ ప్రజలకు ఇచ్చిన 10 వేల ఇళ్ల నిర్మాణాల హామీని అపార్ట్‌మెంట్ పద్ధతిలో నిర్మించి తీరుతానని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల సమన్వయకర్త భూమా నాగిరెడ్డి అన్నారు.   పద్మావతినగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పేదల నుంచి సమస్యలపై దరఖాస్తుల స్వీకరణను సోమవారం భూమా ప్రారంభించారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. మొదటి రోజు ఆరు వేల మంది వరకు వచ్చి దరఖాస్తులను అందజేశారు. భూమా స్వయంగా రంగంలోకి దిగి దరఖాస్తులను స్వీకరిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం భూమా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు. మహానేత నిత్యం పేదల అభివృద్ధినే కోరేవారని, ఆయన తనయుడు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేదల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ప్రజల సమస్యల పరిష్కరించడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కొందరు అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అభ్యంతరాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని శిల్పాను విమర్శించారు.
 
 భూమా ఆలోచన అద్భుతం: ఎస్పీవై రెడ్డి
 నంద్యాల పట్టణం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భూమా తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి అభినందించారు. దరఖాస్తుల స్వీకరణపై ఎంపీ, భూమా పార్టీ కార్యాలయంలో చర్చించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎంతో పట్టుదలతో భూమా అనేక కార్యక్రమాలను ప్రకటించారన్నారు. అయితే దీనిని ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు.
 
 ప్రజల పక్షాన పోరాడే వాడే నాయకుడు
 నంద్యాల, న్యూస్‌లైన్:  ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాడే నాయకుడని భూమా నాగిరెడ్డిని ఉద్దేశించి ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలో భూమా సొంత నిధులతో నిర్మించిన వారధి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ సొమ్ముతో పనులు చేయడం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంటుందని, ఇది అందరికి సాధ్యమేనన్నారు, ప్రతి పక్షంలో ఉండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భూమా చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు.
 
 ఇక్కడ వారధి నిర్మించాలని ప్రజలు తనకు వినతిపత్రం ఇచ్చారని.. పదేళ్లలో చేయలేకపోయానన్నారు. అనంతరం భూమా మాట్లాడుతూ ఎస్పీవై రెడ్డి వంతెన నిర్మించలేక పోయినా.. పట్టణంలో ఎన్నో పనులు ప్రభుత్వ, సొంత నిధులతో చేపట్టారన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మాత్రం అవకాశం ఉండి కూడా వంతెన నిర్మించలేక పోయారని విమర్శించారు. ప్రజలకు మేలు చేసేవారిని విమర్శించడం ఎమ్మెల్యేకే చెల్లిందన్నారు. త్వరలో వార్డు పర్యటన కొనసాగించి ప్రతి కుటుంబ సమస్యను తెలుసుకుంటానన్నారు. చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం తన లక్ష్యమన్నారు. వారధి ప్రారంభం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పాత బ్రిడ్జిపై ప్రయాణిస్తూ మృతి చెందిన వారికి కొత్త వారధిని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. వారధిని ప్రతి రోజూ ప్రయాణించే విద్యార్థునుల చేత ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డాక్టర్ బాబన్, మాజీ కౌన్సిలర్ దస్తగిరితో పాటు  స్థానికులు పాల్గొన్నారు.    

Share this article :

0 comments: