దమ్ముంటే ఎన్నికలకు అందరూ కలసి రండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దమ్ముంటే ఎన్నికలకు అందరూ కలసి రండి

దమ్ముంటే ఎన్నికలకు అందరూ కలసి రండి

Written By news on Tuesday, March 11, 2014 | 3/11/2014

దమ్ముంటే ఎన్నికలకు అందరూ కలసి రండి: కొండా రాఘవరెడ్డి
చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్
కిరణ్ వైఫల్యమే వరుస ఎన్నికలకు కారణం

 
 సాక్షి, హైదరాబాద్: అందరినీ కలుపుకొని టీడీపీ అధినేత చంద్రబాబు మహామాయకూటమిగా ఎన్నికల్లో దిగినా తమ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ... పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను తనతో కలసి రావాల్సిందిగా చంద్రబాబు చెబుతున్నారని, వారే కాదు నారాయణ, ములాయం, జయప్రకాశ్ నారాయణ్, ఆప్ పార్టీలన్నింటినీ కలుపుకొని వైఎస్సార్ కాంగ్రెస్‌తో పోటీకి రావాలని సవాలు చేశారు.
 
 చంద్రబాబు అందరినీ కలుపుకొని ఒక అభ్యర్థిని నిలబెడితే, పోటీగా వైఎస్సార్‌సీపీ ఒకరిని రంగంలోకి దింపుతుందని, అపుడు ఎవరి సత్తా ఏమిటో బయటపడుతుందని అన్నారు. అసలు కిరణ్‌ను తన వైపు రావాలని చంద్రబాబు కోరడంలోనే వీరిద్దరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వీరిద్దరి కుమ్మక్కు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వరకూ కొనసాగిందని గుర్తుచేశారు. ఇది చాలదన్నట్లు చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించే బిల్లుపై రాజ్యసభలో బాహాటంగా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తూంటే కాంగ్రెస్ తల్లి అయితే, టీడీపీ భర్త అయినట్లుగా వీరిద్దరికీ పుట్టిన అక్రమ సంతానంగా కిరణ్ పార్టీ మిగలబోతోందని కొండా విమర్శించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ మూడున్నరేళ్ల పాలనలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేక వైఫల్యం చెందడం వల్లే ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఎన్నికలన్నీ వరుసగా వచ్చాయని విమర్శించారు. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డే ఈ విషయంలో కిరణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
 
 రాష్ట్రానికి ఆరువేల కోట్లు రాలేదు
 రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పాలించానని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్... స్థానిక ఎన్నికలే నిర్వహించలేకపోయారని రాఘవరెడ్డి విమర్శించారు. ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి రావలసిన 4 నుంచి 6 వేల కోట్ల రూపాయలు రాకుండా పోయాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శులు ఈ విషయాన్ని చెప్పినా కిరణ్ పెడచెవిన పెట్టారన్నారు. ఎన్నికలు జరగకపోవడానికి చంద్రబాబు మరో కారణమని చెప్పారు. ఏ రోజూ కూడా ఎన్నికలు నిర్వహించాలని కిరణ్‌ను డిమాండ్ చేయలేదన్నారు. ఎన్నికలంటేనే వీరిద్దరికీ ఈ నాలుగేళ్లు లాగులు తడుస్తూ వచ్చాయని, వాటిని ఎదుర్కోలేకనే ఇద్దరూ కూడబలుక్కుని నిర్వహించలేదన్నారు.
 
  పంచాయతీరాజ్ మంత్రులుగా ఉన్న ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కె.జానారెడ్డి కూడా ఏ దశలోనూ ఎన్నికల నిర్వహణకు చొరవ చూపలేదన్నారు. ఎన్నికలు నిర్వహించనందుకు కిరణ్, బొత్స, చంద్రబాబు, జానారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 58 ఉపఎన్నికలు జరిగితే, టీడీపీకి అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక వీరు ఎన్నికలు నిర్వహించలేక పోయారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయని, అవే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లు కురిపిస్తాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి పథకాలతో లబ్ధ్ది పొందిన విద్యార్థుల నుంచి ఓట్లు తమ పార్టీకి వస్తాయన్నారు.
Share this article :

0 comments: