ఓట్లడిగే హక్కు మాకు మాత్రమే ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్లడిగే హక్కు మాకు మాత్రమే ఉంది

ఓట్లడిగే హక్కు మాకు మాత్రమే ఉంది

Written By news on Sunday, March 2, 2014 | 3/02/2014

అందరూ ఒక్కటై..ముక్కలు చేశారు
వారంలో ఎన్నికల నగారా మోగుతుంది
 కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు ఇంత మంచి చేశాం అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి
 అందుకే రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజల  మనోభావాలతో ఆడుకుంటున్నాయి
 ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని పోరాడింది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే
 అందుకే ఓట్లడిగే హక్కు మాకు మాత్రమే ఉంది
 ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కైంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది. అందరూ కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని ముక్కలు చేశారు..’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుందని, ఈ ఎన్నికల ప్రచారంలో తాము ప్రజలకు ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయన్నారు.
 
 అందుకే సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి వారి మనోభావాలతో ఆడుకొనైనా ఓట్లు దక్కించుకోవడానికి ఈ పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. ఒక్క వైఎస్‌ఆర్ సీపీ మాత్రమే ప్రజల దగ్గరకు వెళ్లిందని, వారి మనోభావాలను అర్థం చేసుకొని వారి కోసం పోరాడిందని, అందుకే ప్రజలను ఓట్లడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అన్నారు. ‘వైఎస్‌ఆర్ జనభేరి’ పేరుతో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం శ్రీకారం చుట్టిన జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి సభను తిరుపతిలో నిర్వహించారు. ఇటీవల సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని, ఇప్పుడు వైఎస్‌ఆర్ జనభేరిని తిరుపతి నుంచే ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 మన ఆక్రందన వినలేదు..
 ‘‘విభజనతో కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా అన్యాయానికి గురవుతున్న ప్రతి పేద పిల్లాడి ఆర్తనాదాన్ని మేం దేశం మొత్తానికీ వినిపించే ప్రయత్నం చేశాం. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా నీళ్లందని పరిస్థితిలో ఉన్న ఆ రైతన్న ఆక్రందనను దేశం మొత్తానికీ చూపించే ప్రయత్నం చేశాం. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ మన ఖర్మ ఏమిటీ అంటే.. అక్కడ అధికారం పక్షంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. వీళ్లందరూ కలసి కట్టుగా కుమ్మక్కైన పరిస్థితిలో మన ఆక్రందన వినే నాథుడు లేకుండాపోయాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉంటే ప్రగతి సాధించగలమని, రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉంటే దేశంలో అగ్రగామిగా నిలవగలమని, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు ఒక్కటిగా ఉంటే అభివృద్ధి సాధించగలమని, దాని వల్ల కొత్త ఉద్యోగాలు, కంపెనీలు వస్తాయని, రాష్ట్రం  బాగుపడుతుందని కలలుగన్నాం. కానీ చివరకు ఏం చేశారూ అంటే.. వీళ్లంతా కూడా కలసికట్టుగా ఒక్కటై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి.
 
 ప్రజలకేమీ చేయలేదు కాబట్టే..
 ఆశ్చర్యం ఏమిటీ అంటే.. ఇవాళ నుంచి సరిగ్గా వారం కూడా తిరగకముందే.. రాష్ట్రం ఎన్నికలకు పోతుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ... ‘మా ఐదేళ్ల పాలనలో ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చాం.. ఇన్ని కొత్త పింఛన్‌లు ఇచ్చాం.. కరెంటు చార్జీలు తగ్గించాం.. ఆర్టీసీ చార్జీలు తగ్గించాం’ అని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. ప్రజల దగ్గరకు వెళ్లి.. ‘నేను ప్రజల గోడును విన్నాను.. ప్రజల మనసెరిగాను.. ఐదేళ్లు పాలించాను.. అందుకే నాకు ఓటేయండి’ అని అడగలేని పరిస్థితుల్లో ఉంది. ఓట్లడగలేని పరిస్థితిలో ఉంది కాబట్టే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది.. ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ.. ఇప్పుడు ఓట్లడగడానికి ముందుకొస్తోంది.
 
 చంద్రబాబు తానాతందానా..
 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కూడా తానాతందానా అంటూ మద్దతు తెలిపారు. ఇదే చంద్రబాబు ఒకవైపు బిల్లు చాలా అన్యాయంగా ఉంది అని అంటారు.. మరోవైపు ఇదే చంద్రబాబు.. పార్లమెంటులో తానంతట తానే బిల్లు బ్రహ్మాండంగా ఉందీ అంటారు.. మొట్టమొదటి ఓటు తామే వేశామని మరో ప్రాంతంలో చెప్తారు. ఇలా ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు వెళతారు.
 
 
 తొమ్మిది సంవత్సరాల తన పరిపాలనలో ‘నేను రైతుకు ఇంత మంచి చేశాను.. చదువుకున్న పిల్లలకింత మంచి చేశాను.. అవ్వా తాతలకింత మంచి చేశాను అని ఒక్కటంటే ఒక్క మంచి పని గురించి చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. తిరిగి చంద్రన్న రాజ్యం తెస్తానని ఒక్కసారంటే ఒక్కసారి కూడా చెప్పే ధైర్యం లేదు చంద్రబాబుకు. అందుకే ఆయన ఇదే కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేశారు. తాను కూడా ప్రజల మనోభావాలతో ఆడుకుని ఓట్లడగడానికి ముందుకొస్తున్నారు.
 
 చాలా బాధనిపించింది..
 విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఈ పార్టీల తీరు చూస్తే చాలా బాధనిపించింది.. ‘రాష్ట్రాన్ని విడగొట్టాను.. నేను పెద్దమ్మను.. కాబట్టి నాకు ఓటేయండి’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటారు. ‘రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఒక్కరే విభజించలేదు.. మేము మద్దతు తెలపకపోతే రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి ఉండదు.. చిన్నమ్మను నేను.. మాకు ఓటేయండి’ అని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అంటారు. ‘నేనిచ్చిన లేఖ వల్లనే రాష్ట్రాన్ని విభజించారు. నావంతు సహకారం కూడా ఉంది. అందుకే విజయోత్సవాలు చేసుకోండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటారు. ప్రజలకు తాము మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్లున్నారు.
 
 నిజాయితీతో కూడిన రాజకీయాలు చేద్దాం..
 ఇవాళ రాష్ట్రంలో ఒక్క వైఎస్‌ఆర్ సీపీ మాత్రమే ప్రజల వద్దకు వెళ్లింది.. ప్రజల మనస్సుల్లో ఉంది.. ప్రజల గుండె చప్పుళ్లలో ఉంది.. ప్రజల మనోభావాలను గుర్తెరిగింది.. వారి కోసం పోరాడింది.. అందుకే మాకు ఓటేయండీ అని అడిగే హక్కు ఒక్క వైఎస్‌ఆర్ సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నిజాయితీతో కూడిన రాజకీయాలను ముందుకు తీసుకెళదాం. వైఎస్‌ఆర్ సీపీకి ఓటు వేసి విశ్వసనీయత అంటే ఏమిటో చెప్పాలని, సువర్ణయుగానికి నాంది పలకాలని విజ్ఞప్తి చేస్తున్నా...’’
 
Share this article :

0 comments: